చంద్రబాబు గందరగోళం!

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈమధ్య మరీ గందరగోళంలో పడిపోతున్నారు. ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు స్పష్టంగా, వ్యూహాత్మంగా ఉండటం లేదు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో చంద్రబాబు తత్తరపాటుకు గురవుతున్నారో లేక ఆయన ఆలోచనల్లో సూక్ష్మత లోపిస్తోందోగానీ…ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు, చేస్తున్న ప్రకటనలే….ఆ తరువాతి కాలంలో పార్టీకి ఆటంకంగా మారుతున్నాయి. రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించడం కోసం జరుగుతున్న ఉద్యమంలో భాగంగా ఈనెల 16న రాష్ట్ర బంద్‌ చేయాలేని కొన్ని సంఘాలు, పార్టీలు నిర్ణయించారు. బంద్‌కు వైసిపి సహా అన్ని పార్టీలూ మద్దతు ఇస్తున్నాయి. అయితే చంద్రబాబు నాయుడు మాత్రం ‘ప్రతిపక్షాలు రాష్ట్ర బంద్‌కు పిలుపునివ్వడం ఏమిటి…బంద్‌ చేసి ఏమి సాధిస్తారు’ అని ప్రశ్నిస్తున్నారు.

చంద్రబాబు ప్రకటన రాష్ట్ర ప్రజలకు ఆశ్చర్యం కలిగించింది. దీనికంటే ముందు జరిగిన బంద్‌లో అన్ని పార్టీలతో పాటు తెలుగుదేశం పార్టీ కూడా పాల్గొంది. 16న జరగబోయే బంద్‌లోనూ క్షేత్ర స్థాయిలో పాల్గొనాల్సిన అనివార్య పరిస్థితి తెలుగుదేశం పార్టీది. గతంలో జరిగిన పలు బంద్‌లను, ఆందోళనలను చంద్రబాబు ప్రభుత్వం నిరంకుశంగా అణచివేసింది. ఏదైనా సమస్యపై విజయవాడకు వెళ్లి ప్రదర్శన చేయాలన్నా అనుమతి ఇవ్వకుండా…ఆయా ఊర్లలోనే రైల్వే స్టేషన్లలో, బస్‌ స్టేషన్‌లలో అరెస్టులు చేయడం ఆనవాయితీగా మార్చుకుంది. అయితే ప్రత్యేక హోదా కోసం ఇటీవల నిర్వహించిన బంద్‌కు ప్రభుత్వం పరోక్షంగా సహకరించింది. బస్సులు ఆపేసింది. ప్రభుత్వ కార్యాలయాను మూసేసింది. ఇంతలోనే ఏమయిందోగానీ…16న నిర్వహించనున్న బంద్‌కు వ్యతిరేకంగా మాట్లాడుతన్నారు. కచ్చితంగా ఈ ప్రకటన తెలుగుదేశం కార్యకర్తల్లో గందరగోళం సృష్టిస్తుంది. 16న అన్ని పార్టీలూ బంద్‌ చేస్తుంటే తెలుగుదేశం పార్టీ శ్రేణులు చూస్తూ ఉండగలరా? ప్రభుత్వం గతంలోలాగా బలంవంతంగా ఆర్‌టిసి బస్సులు తిప్పలదా? నాయకులను అరెస్టు చేయించగలదా? అలా చేస్తే తెలుగుదేశం పార్టీ ప్రజల్లో విశ్వసనీయత కోల్పోతుంది.

బంద్‌లపైన, నిరసనలపైన చంద్రబాబు నాయుడికి తీవ్రమైన వ్యతిరేకత ఉంది. అలాంటి ఉద్యమాల వల్ల రాష్ట్ర ప్రతిష్ట దెబ్బతింటుందన్నది ఆయన నిశ్చితాభిప్రాయం. దీనివల్ల రాష్ట్రానికి పెట్టుబడులు రావన్నది కూడా ఆయన అభిప్రాయం. అయితే….తెలుగుదేశం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బంద్‌లు సహా అనేక ఆందోళనల్లో చంద్రబాబు పాల్గొన్నారు. ఆయన ఉద్దేశం ఏమంటే తెలుగుదేశం అధికారంలో ఉండగా బంద్‌లు జరగకూడదు. మనసులోని మాటను దాచుకోకండా బయటికి చెప్పేశారు. దీనిపైన తెలుగుదేశం నాయకులే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కనీసం వ్యూహాత్మకంగా మౌనంగా ఉండాల్సిందని అంటున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*