చంద్రబాబు గూబ గుయ్యమనిపించిన ఈనాడు..!

ఈ శీర్షిక చదవగానే ఆశ్చర్యంగా అనిపించవచ్చు. ఈనాడు పత్రికలో తెలుగుదేశం ప్రభుత్వానికి అనుకూలమైన వార్తలే వస్తాయన్న భావన సర్వత్రావున్న సంగతి తెలిసిందే. రాజకీయంగా ఎలావున్నా…ప్రజాసమస్యలను ప్రతిబింబించకపోతే పాఠకుల అభిమానం చూరగొనడం కష్టం. కారణాలు ఏవైనా అప్పుడప్పుడు ఈనాడులో వచ్చే కథనాలు ప్రభుత్వానికి చెంపపెట్టులా ఉంటున్నాయి. అటువంటి కథనాలే ఈవారంలో రెండు ప్రచురితమయ్యాయి.

పట్టుసీమ వచ్చిన తరువాత రాయలసీమ ప్రాంతం సస్యశ్యామలం అయిపోయిందని ప్రభుత్వ పెద్దలు ప్రచారం హోరెత్తించారు. సీమకు నీళ్లు ఇస్తుంటే ప్రతిపక్షాలు ఓర్వలేకపోతున్నాయని విమర్శించారు. రాయలసీమలో హంద్రీ-నీవా, గాలేరు-నగరి వంటి ప్రాజెక్టులు దశాబ్దాలుగా అసంపూర్తిగా ఉంటే వాటిని పట్టించుకోకుండా పట్టిసీమ ఎందుకు నిర్మించారని నిలదీస్తే…అది రాయలసీమ కోసమే అని దబాయించారు. మొత్తంగా సీమలో కరువు కనుమరుగైపోయిందని గొప్పలు చెప్పారు. దానికి ముందు రైన్‌ గన్లతో రాయలసీమలో ఒక ఎగరం పొలం కూడా ఎండిపోకుండా కాపాడుతామని పెద్దపెద్ద సభలు పెట్టి చెప్పారు.

ఇప్పుటు ఇదంతా చెప్పడం ఎందుకంటే…’భూమి నవ్వదు…బువ్వ పుట్టదు’ అంటూ రాయలసీమలోని దుర్భిక్షం గురించి ఈనాడు పతాకశీర్షికన ఓ కథనాన్ని ప్రచురించింది. అనంతపురం జిల్లాలో వేరుశనగ పండి ఎండిపోతున్న ఫొటోనూ వేశారు. ఇవన్నీ చూస్తుంటే….సీమకు ఇచ్చామని చెబుతున్న నీళ్లు ఏమయ్యాయన్న ప్రశ్న ఉదయిస్తుంది. బాబుగారు చెప్పిన జల ఫిరంగులు కరువును అంతం చేయలేకపోయాయా అనే అనుమానం కలుగుతుంది. ఇప్పటికీ నీళ్ల కోసం బోర్లు వేసి రైతులు అప్పులపాలై ఆత్మహత్యలు చేసుకుంటున్న దీనావస్థ సీమ రైతాంగానిది.

ఇక..ఆపదలో ఆదుకునే 108 వాహనాలు పడకేశాయని, వాటి సేవలు సరిగా అందడం లేదని ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి విమర్శలు చేస్తుంటే….ఆయనపై ప్రతిదాడి చేస్తున్నారు టిడిపి నేతలు. 108 వాహనాలు బాగానేవున్నాయని చెప్పేందుకు… విజయనగరం జిల్లాలో జగన్‌ సభ జరుగుతుండగా…108 వాహనాన్ని జనం మధ్యలోకి పంపిచింది హడావుడి చేసిన సంగతి తెలిసిందే. రాజకీయ విమర్శలు, ప్రతివిమర్శలు; వ్యూహాలు, ప్రతివ్యూహాల సంగతి ఎలావున్నా…. క్షేత్రస్థాయి పరిస్థితిని కళ్లకు కట్టింది ఈనాడు కథనం. వాహనాలు మరమ్మతులకు నోచుకోక కదలలేని స్థితిలో ఉన్నాయని ఈ కథనం ఆధారాలతో సహా వెల్లడిచింది.

ఈ రెండు కథనాలు కచ్చితంగా ప్రభుత్వానికి చెంపపెట్టు వంటివే. పాలకులు రాజకీయ అంశాలపైన దాబాయిస్తే ఫర్వాలేదుగానీ…క్షేత్రస్థాయి పరిస్థితిని మరుగుపరచాలని అనుకుంటే సాధ్యంకాదు. ప్రతిపక్షాలు, పత్రికలు ఎత్తిచూపే లోపాలను సరిద్దాలి తప్ప ఎదురుదాడితో నోళ్లు మూయించా లనుకోవడం సరైనదికాదు. మా పద్ధతి మాదే అనుకుంటే…అందుకు భారీ మూల్యమే చెల్లించాల్సివస్తుంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*