చంద్రబాబు చెబుతున్నది నిజమా?

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బిజెపిపైన తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మోడీ పేరెత్తితేనే అందరూ భయపడేవారని, తెలుగుదేశం తిరగబడిన తరువాతే అందరికీ ధైర్యం వచ్చిందని గొప్పగా చెప్పుకున్నారు. అదేవిధంగా పార్లమెంటులో అన్ని పార్టీలనూ సంఘటితపరచి ఎదుర్కోవడంతో మోడీ ఏమీచేయలేకపోయారని కూడా చంద్రబాబు చెప్పారు. ఈ రెండు అంశాల్లో నిజమెంత?

తెలుగుదేశం పార్టీ గత ఎన్నికల్లో బిజెపితో జతకట్టి, నిన్న మొన్నటి దాకా ఆ పార్టీతోనే ప్రయాణించారు. మోడీపైన, బిజెపిపైన ఈగ వాలనీకుండా చూసుకున్నారు. రాష్ట్రానికి మేలు జరుగుతుందన్న ఉద్దేశంతోనే తాము బిజెపితో స్నేహంగా ఉన్నామని చెప్పుకున్నారు. తెలుగుదేశం పార్టీ బిజెపితో ఎలావున్నా అభ్యంతరం లేదుగానీ….బిజెపిపైన తానే మొదటగా తిరుగుబాటు చేశానని చెప్పుకొచ్చారు. వాస్తవంగా మోడీ దూకుడుపైన, కేంద్రంలోని బిజెపి విధానాలపైన కమ్యూనిస్టులు యుద్ధమే చేస్తున్నారు. గోవధ నిషేధంతో మొదలుపెడితే…రాష్ట్రానికి ప్రత్యేక హోదా దాకా బిజెపి విధానాలపైన పోరాడుతున్నారు. అదేవిధంగా ఢిల్లీ ముఖ్యమంత్రి పీఠాన్ని దక్కించుకున్న ఆమ్‌ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్‌ కేంద్రంపై తొలి నుంచి పోరాడుతున్నారు. ఇక బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బిజెపికి వ్యతిరేకంగా ఉన్నారు. ఉత్తర ప్రదేశ్‌లో బిజెపిని ఎదుర్కొనేందుకు బద్ధ శత్రువుల్లాంటి ఎస్‌పి, బిఎస్‌పి ఒక్కటయ్యాయి. ఇటీవలకే తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌ కేంద్రంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఇక వ్యక్తులుగా పోరాడిన, పోరాడుతున్న వారూ ఉన్నారు. ప్రముఖ సినీనటుడు ప్రకాష్‌ రాజ్‌ ‘ప్రశ్నస్తా’ అంటూ బిజెపి విధానాలను నిలదీస్తూనే ఉన్నారు. కొందరు రచయితలు, సాహితీవేత్తలు దేశంలో నెలకొన్న అసహనానికి నిరసనగా తమకు వచ్చిన అవార్డులను వెనక్కి ఇచ్చారు. ఈ విధంగా నాలుగేళ్లుగా చాలామంది బిజెపిపైన, మోడీపైన పోరాడుతుంటే…ఏరోజూ చంద్రబాబు గొంతుకలపలేదు. గోవధ నిషేధం, గోసంరక్షణ పేరుతో హత్యలు వంటి అంశాలపైనా స్పందించిన దాఖలాలు లేవు. అలాంటిది ఇప్పుడు తానే బిజెపిని మొదట ఎదురించానని నిస్సంకోశంగా చెప్పేస్తున్నారు. ఇక పార్లమెంటు వ్యవహారానికికొస్తే…. ఏ పార్టీ మద్దతును చంద్రబాబు కూడగట్టారో తెలియదు. పార్లమెంటు జరిగినన్ని రోజులూ ఆంధ్రప్రదేశ్‌ ఎంపిలు తప్ప ఇంకో రాష్ట్రానికి చెందిన ఎంపిలు ఆందోళనకు దిగింది లేదు. అయినా…బిజెపి పట్ల ప్రజల్లో వస్తున్న వ్యతిరేకతను దృష్టిలో ఉంచుకుని, బిజెపిపై పోరాటంలో తానే ముందున్నానని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*