చంద్రబాబు చేయలేని సాహసం…లోకేష్‌ చేయగలరా?

ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు స్వస్థలమైన చంద్రగిరి నియోజకవర్గంలో ఈసారి ఆయన తనయుడు నారా లోకేష్‌ పోటీ చేస్తారని చెబుతున్నారు. లోకేష్‌ చంద్రగిని ఎంచుకోవడం సాహసమే అవుతుంది. ఎందుకంటే ఇక్కడ తెలుగుదేశం పార్టీకి కుప్పంలాగానో, హిందూపురం మాదరిగానో గెలుపు గ్యారెంటీ లేదు. గత ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి మాజీ మంత్రి గల్లా అరుణ కుమారి, వైసిపి నుంచి చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి తలపడ్డారు. వైసిపినే విజయం వరించింది. గత చరిత్ర చూసినా తెలుగుదేశం పార్టీ తిరుగులేని విజయాలేవీ ఇక్కడ నమోదు చేయలేదు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన మొదటి ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు కాంగ్రెస్‌ తరపున పోటీ చేశారు. తెలుగుదేశం అభ్యర్థి వెంకట్రామనాయుడు చేతిలో ఓటమి పాలయ్యారు. ఆ తరువాత జయదేవనాయుడు గెలుపొందారు. ఆ తరువాత 1985 ఎన్నికల్లో జయదేవ నాయుడు టిడిపి తరపున గెలిచారు. 1989లో కాంగ్రెస్‌ తరపున గల్లా అరుణ కుమారి విజయం సాధించారు. 1994లో చంద్రబాబు సోదరుడు రామ్మూర్తి నాయుడు గెలిచారు. ఆ తరువాత 1999, 2004, 2009 ఎన్నికల్లో వరుసగా మూడు పర్యాయాలు గల్లా అరుణ కుమారి కాంగ్రెస్‌ అభ్యర్థిగా గెలిచారు. 2014లోనూ టిడిపి ఓటమిపాలయింది. 1983 నుంచి ఇప్పటిదాకా చూస్తే….నాలుగు పర్యాయాలు టిడిపి ఓడిపోతూనే ఉంది. 20 ఏళ్లుగా టిడిపి గెలిచింది లేదు. ఇటువంటి చోట నుంచి లోకేష్‌ బరిలోకి దిగాలనుకోవడం సాహసమే అవుతుంది.

చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ ఆ విర్భావానికి ముందు చంద్రగిరి నుంచి పోటీచేసి గెలిచారు. ఆ తరువాత ఆయన కుప్పంను ఎంచుకుని అక్కడి నుంచే పోటీచేస్తున్నారు. వరుసగా గెలుస్తున్నారు. 2019 ఎన్నికల్లో తెలుగుదేశం గెలిస్తే లోకేష్‌ ముఖ్యమంత్రి అవుతారన్నది బహిరంగ రహస్యం. అటువంటప్పుడు సునాయాసంగా గెలవడానికి అవకాశమున్న నియోజకవర్గాన్ని ఎంచుకోవాలి. వాస్తవంగా కృష్ణా జిల్లా నుంచి పోటీ చేస్తారని చాలాకాలంగా ప్రచారం జరిగింది. ఏమయిందోగానీ ఆయన చంద్రగిరిని ఎంచుకున్నట్లు వార్తలొస్తున్నాయి. చంద్రబాబు నాయుడు కుప్పంకు వెళ్లడపై ప్రతిపక్షాలు ప్రతిసారీ విమర్శలు చేస్తూనే ఉన్నాయి. స్వస్థలంలో గెలుస్తారన్న నమ్మకం లేక…అక్కడికి వెళ్లారని ఎద్దేవా చేస్తుంటారు. అయినా ఏనాడూ చంద్రబాబు కుప్పాన్ని వదిలి….చంద్రగిరికి వచ్చేందుకు సాహసించలేదు. చంద్రబాబు చేయలేని సాహసం…లోకేష్‌ చేస్తారా? అనేది ప్రశ్న. ఇక్కడ పోటీ చేయాలనే ఉద్దేశంతోనే…ఆయన స్థానిక నాయకత్వాన్ని దగ్గరకు తీసుకుంటున్నారని, వారితో సంబంధల్లో ఉన్నారని చెబుతున్నారు. చంద్రగిరి నియోజకవర్గంలో చంద్రబాబు సామాజిక వర్గానికి ఎంత బలముందో….జగన సామాజిక తరగతికీ అంతకన్నా బలం ఉంది. గత ఎన్నికల్లో ఎంత గట్టిగా ప్రయత్నించినా అరుణ కుమారి టిడిపి తరపున గెలవలేకపోయారు. లోకేష్‌ ప్రస్తుతం మంత్రిగా ఉన్నప్పటికీ…ఆయన దొడ్డిదారిన ఎంఎల్‌సి అయ్యారని, ప్రత్యక్ష ఎన్నికల్లో గెలవలేక ఆయన్ను ఎంఎల్‌సిని చేశారని వైసిపి విమర్శలు చేసింది. 2019 ఎన్నికలు లోకేష్‌ ఎదుర్కొనే మొదటి ప్రత్యక్ష ఎన్నికలు అవుతాయి. ఇలాంటప్పుడు విజయం సాధించగలమని ఢంకా మోగించి చెప్పగల నియోజకవర్గాన్ని ఎంచుకోవడం ఉత్తమంగా ఉంటుంది. ఈ అంశంలో తుది నిర్ణయం ఎలావుంటుందో చూడాలి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*