చంద్రబాబు జుట్టు మోడీ చేతిలో…అంతా బాబు స్వయంకృత అపరాధమే..!

విశాఖపట్నం విమానాశ్రయంలో కొన్ని నెలల క్రితం వైసిపి అధినేత జగన్‌ మోహన్‌ రెడ్డిపై జరిగిన హత్యాయత్నం కేసులో రాష్ట్ర ప్రభుత్వం సరైన రీతిలో స్పందించి చర్యలు తీసుకునివుంటే….ఇప్పుడు ఆ కేసు కేంద్రం చేతికి వెళ్లేది కాదు. రాష్ట్ర ప్రభుత్వ పెద్దల స్వయంకృత అపరాధం వల్లే ఈ కేసు తమ జుట్టు కేంద్రం చేతిలో చిక్కుకుంది.

ప్రతిపక్ష నేత జగన్‌ మోహన్‌ రెడ్డిపై హత్యాయత్నం జరిగిన మాట వాస్తవం. రాజకీయాలను పక్కనపెట్టి ఈ అంశాన్ని ప్రభుత్వం సీరియస్‌గా పరిగణించి విచారణ జరిపించి, నిందితులను న్యాయస్థానం ముందు నిలబెట్టివుండాలి. అయితే…ఈ కేసులో మొదటి రోజు నుంచి రాష్ట్ర ప్రభుత్వం తీరు వివాదస్పదంగా, అనుమానితంగా ఉంది.

దాడి జరిగిన కొన్ని గంటల్లోనే…ఇది జగన్‌ అభిమాని చేసిన దాడిగా డిజిపి ప్రకటించారు. స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు టివి తెరపైకి వచ్చి…జగన్‌కు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారు. దాడి ఘటనను రాజకీయం చేశారు. జగన్‌ చికిత్స కోసం హైదరాబాద్‌ వెళ్లడాన్ని తప్పుబట్టారు. ఈ సందర్భంగా కాస్త ఎగతాళిగానూ మాట్లాడారు.

ఇక తెలుగుదేశం నాయకులు వరుసుగా….జగన్‌ను అవహేళన చేయడం మొదలుపెట్టారు. ఒక హత్యాయత్నం కేసును కోడికత్తి కేసు అంటూ తక్కువచేసే ప్రయత్నం చేశారు. ఆఖరికి టిడిపి అనుకూల కూడా కోడికత్తి అనితప్ప జగన్‌పై దాడి కేసు అనిగానీ, హత్యాయత్నం కేసు అనిగానీ చెప్పడానికి ఇష్టపడలేదు.

ఈ కేసులో విచారణ సక్రమంగా జరగడం లేదని వైసిపి ఆరోపిస్తే…టిడిపి సమర్థించుకుంటూ వచ్చింది. సిట్‌ దర్యాప్తు ముగిసినా…చాలా అంశాలపై స్పష్టత రాలేదు. ఎయిర్‌పోర్టులోని రెస్టారెంట్‌ యజమాని, టిడిపి నేతను లోతుగా విచారించలేదన్న విమర్శలు వచ్చాయి.

ఇవన్నీ పక్కనపెడితే….ఇందులోని టెక్నికల్‌ అంశాలనూ టిడిపి తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేసింది. ‘విమానాశ్రయంలో దాడి జరిగితే మనకేం సంబంధం తమ్ముళ్లూ…’ అంటూ సభల్లో చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ వచ్చారు. అంటే విమానాశ్రయం కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంటుంది కాబట్టి, అక్కడ జరిగిన దాడికి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేదన్నట్లు మాట్లాడుతూ వచ్చారు.

ఇప్పుడు ఆ మాటల వల్లే ఇబ్బందులు ఎదురయ్యాయి. కేసును జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ)కి అప్పగించాలని వైసిపి నేతలు హైకోర్టును ఆశ్రయించారు. విమానాశ్రయంలో దాడి జరిగితే కేంద్ర విచారణ సంస్థ ఎందుకు విచారణ చేపట్టలేదని కోర్టు కేంద్రాన్ని ప్రశ్నించింది. దీంతో కేంద్రమూ స్పందించి…తాము విచారణ చేపడతామని కోర్టుకు నివేదించింది.

ఇక ఈ కేసును ఎన్‌ఐఏకి అప్పగించే విషయంలో రాష్ట్ర పోలీసులూ అభ్యంతరం చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే…విమానాశ్రయం తమ పరిధిలోనికి కాదని రాష్ట్ర ప్రభుత్వమే చెబుతూ వచ్చింది. దీంతో కేసు ఎన్‌ఐఏ పరిధిలోకి వెళ్లింది.

ఇన్నాళ్లూ విమానాశ్రయంలో జరిగిన దాడికి, తమకూ ఏమిటి సంబంధం అని ప్రశ్నిస్తూ వచ్చిన రాష్ట్ర ప్రభుత్వం…తీరా ఎన్‌ఐఏ విచారణ చేపట్టేసరికి మాటమార్చింది. ఎన్‌ఐఏ విచారణ చేపట్టడమంటే రాష్ట్రంలో జోక్యం చేసుకోవడమే అనే ప్రచారాన్ని తెరపైకి తెస్తోంది. తెలుగుదేశం అనుకూల మీడియా కూడా ఇదే వాదనను తెరపైకి తెచ్చే ప్రయత్నం చేస్తోంది. అయినా…న్యాయవాదులు ఎన్‌ఐఏ దర్యాప్తు సరైనదేనని చెప్పడంతో మింగలేక కక్కలేక అవస్థపడుతోంది. ఏమైనా రాష్ట్ర ప్రభుత్వ వాదన చెల్లేది కాదు.

అందుకే…ఈ కేసును ఆషామాషీగా తీసుకోకుండా, జగన్‌ హైకోర్టును ఆశ్రయించాల్సిన అవసరం లేకుండా సరైన పద్ధతిలో విచారణ జరిపించివుంటే…ఇప్పుడు బంతి కేంద్రం కోర్టులోకి వెళ్లేది కాదు. చట్టాల్లోని సాంకేతికమైన అంశాలను అడ్డుపెట్టుకుని సిబిఐ రాష్ట్రంలోకి రావడానికి వీల్లేదని ఆదేశాలు ఇచ్చిన రాష్ట్రం…ఎన్‌ఐఏ దర్యాప్తునూ అడ్డుకునే అవకాశం లేదు.

ఎన్‌ఐఏ దర్యాప్తును అడ్డుకోలేకపోవచ్చుగానీ….ఈ అంశాన్ని టిడిపి రాజకీయంగా వాడుకునేందుకు ప్రయత్నిస్తుంది. కేంద్రం తమపై కక్షసాధింపుతోనే ఎన్‌ఐఏ దర్యాప్తునకు పూనుకుందని ప్రచారం చేస్తుంది. చంద్రబాబు నాయుడు ఇటువంటి ప్రచారం చేస్తారని ముందే ఊహించిన బిజెపి…తగిన జాగ్రత్తలు తీసుకుంది. తమ చేతికి మట్టి అంటకుండా కోర్టు ద్వారా ఆదేశాలు వచ్చేదాకా ఆగింది. హైకోర్టు చెప్పిన తరువాతే ఎన్‌ఐఏ దర్యాప్తునకు ఆదేశించింది. ఈ పరిస్థితుల్లో టిడిపి చేసే ప్రచారానికి అంత విశ్వసనీయత లభించకపోవచ్చు. ఏమైనా చంద్రబాబు నాయుడు తన జుట్టును తానే మోడీ చేతికి అందించారు!

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*