చంద్రబాబు డిమాండు ఈనాడుకే సమంజసంగా అనిపించలేదు…!

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మీడియా సమావేశం నిర్వహించినా, ప్రెస్ నోట్ విడుదల చేసినా, ట్విట్ చేసినా…అక్షరం పొల్లుపోకుండా ప్రచురిస్తాయి తెలుగుదేశం అనుకూల పత్రికలు. అగ్రశ్రేణి పత్రికగా ఉన్న ఈనాడుకూ ఇందులో మినహాయింపు లేదు.

అయితే… రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉద్దేశించి చంద్రబాబు తాజాగా చేసిన ఒక డిమాండ్, ఈనాడు పత్రికకూ అసమంజసంగా అనిపించినట్లు ఉంది. అందుకే బాబుగారు ఏ ఉద్దేశంతోనైతే ప్రెస్ నోట్ విడుదల చేశారో…దాన్ని మరుగుపరచి, ఆ నోట్ లోని ఇతర అంశాలను లీడ్ లోకి తీసుకొచ్చి ప్రచురించారు.

ఇంతకీ విషయం ఏమంటే…గడచిన 15 రోజులుగా పెట్రోలు ధరలు రోజూ పెరుగుతూనే ఉన్నాయి. ఈ కాలంలో పెట్రోల్ మీద పది రూపాయలు దాకా పెరిగింది. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు ప్రెస్ నోట్ విడుదల చేశారు. జగన్ ప్రభుత్వం పెంచిన పెట్రోలు ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు. ధరలు తగ్గించేలా కేంద్రం మీద ఒత్తిడి తేవాలని కూడా బాబు సూచించారు.

అయినా పెట్రోలు ధరలు పెంచేది, తగ్గించేది కేంద్ర ప్రభుత్వం. ‌ఇందులో రాష్ట్రాలకు ఎటువంటి ప్రమేయమూ ఉండదు. నలభై ఏళ్లుగా రాజకీయాల్లో ఉంటూ, 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పని చేసిన చంద్రబాబుకు తెలియదనుకోలేం.‌ అయినా ఇవన్నీ ప్రజలకు ఏమి తెలుస్తాయిలే అనుకు న్నారేమో… జగన్ పెంచిన పెట్రోలు ధరలు తగ్గించాలని‌ డిమాండ్ చేశారు.

చంద్రబాబు ప్రకటనలోని అసంబద్ధతను గమనించిన ఈనాడు పత్రిక…ఆ ప్రకటనను జాగ్రత్తగా ప్రచురించింది. వార్త మొదటి పేజీలో వేసినప్పటికీ…పెట్రో ధరల అంశాన్ని లీడ్ తీసుకోలేదు. కక్ష సాధింపు రాజకీయాలు ఆపండి..అనే జనరల్ శీర్షికతో వార్త ప్రచురించింది. పెట్రోలు ధరలు తగ్గించాలన్న డిమాండుకు చివరి ప్రాధాన్యత ఇచ్చింది. మిగతా పత్రికలు పెట్రోలు ధరలు తగ్గించాలన్న డిమాండునే లీడ్ చేసుకుని వార్తలు ప్రచురించాయి.

చంద్రబాబు డిమాండును యాధాతథంగా ప్రచురిస్తే పాఠకులు నవ్వుకుంటారన్న ఉద్దేశంతో, బాబు పరువు కాపాడాలన్న భావనతోనే ఈనాడు వార్త లీడ్ మార్చి ప్రచురించిందని అనుకోవాలి.

అయినా, తెలుగుదేశం జాతీయ పార్టీ. పెట్రోలు ధరలు తగ్గించమని డిమాండ్ చేయాల్సింది కేంద్ర ప్రభుత్వాన్ని. అలా డిమాండ్ చేస్తే మోడీకి‌ కోపం వస్తుందనని అనుకున్నారో ఏమో…ఆయన జోలికి వెళ్లలేదు. అలాంటప్పుడు ఈ అంశంపై స్పందించకుండా వదిలేస్తే పరువుగా ఉండేది. మనం ఏమి చెప్పినా ప్రశ్నించేవాళ్లు ఎవరున్నారులే అనుకున్నారో ఏమో… పెట్రోలు ధరలు తగ్గించాలని జగన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇటువంటి డిమాండ్ తో బాబు మరోసారి అభాసుపాలయ్యారు. – ధర్మచక్రం ప్రతినిధి

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*