చంద్రబాబు ఢిల్లీ ఎందుకు వెళ్లినట్లు?

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుక్రవారం ఢిల్లీ ఎందుకు వెళ్లారు? చంద్ర గిరి నియోజకవర్గంలో రీ పోలింగ్ పై తాడో పేడో ఎన్నికల సంఘం వద్ద తేల్చుకొనేందుకు వెళ్లారని ప్రకటించబడినా కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేస్తున్న ప్రతి పక్ష పార్టీలు సమావేశం గురించి కూడా కాంగ్రెస్ నాయకులతో చర్చలు జరుపు తారని ప్రకటించబడిండి.

ఇక్కడే అసలు మెలిక వుంది. గత నాలుగు రోజులుగా కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ప్రతిపక్ష పార్టీల సమావేశం ఎన్నికల ఫలితాలు వెలువడిన రోజునే ఏర్పాటు చేస్తున్నట్లు వార్తలు షికారు చేస్తున్నాయి. ఇక్కడ గమనించాలసిన అంశమేమంటే చంద్రబాబు నాయుడు ప్రతి పాదించిన సమావేశం పురిటిలోనే సంధి కొట్టింది. కాగా ప్రస్తుతం వార్తలు షికారు చేస్తున్న ప్రకారం కెసిఆర్ ను వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డిని ఈ సమావేశానికి తీసుకు వచ్చే బాధ్యత మధ్య ప్రదేశ్ ముఖ్యమంత్రి కమల నాథ్ కు సోనియా గాంధీ అప్ప గించారని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి

గమనార్హం మైన అంశమేమంటే వైసిపి కెసిఆర్ కి ఎంత మంది సభ్యులు ఎన్నికౌతారో ఇంకా నిర్థారణ కాని పూర్వ రంగంలో సోనియా గాంధీ ఈ రెండు పార్టీల మద్దతుకు ఒక వేళ నిజంగానే సిద్ధమైతే ఎపిలో వైసిపి ఎక్కువ స్థానాల్లో గెలుపొందుతుందనే భావన కాంగ్రెస్ అధిష్ఠానం వర్గంలో వున్నట్లు భావించాలి. ఎపిలో టిడిపి కి పెద్ద గా స్థానాలు దక్కవనే భావన వుంటేనే వైసిపి వైపు చూడటం జరుగుతుంది.

నిన్న మొన్నటి వరకు రాహుల్ గాంధీ ని ప్రధానిని చేయాలని ఆరాటపడి ముఖ్యమంత్రిచంద్రబాబుకు నిజంగా ఇది అశనిపాతంగా వుంటుంది. ఇది వరలో చంద్రబాబునాయుడు ను పత్రిక వారు ఈ ప్రశ్న కూడా వేసి వున్నారు. ఎన్నికల ఫలితాలు వెల్లడి కాక ముందే సోనియా గాంధీ 23 తేదీ సమావేశానికి జగన్మోహన్ రెడ్డి( వెళతారో లేదో పక్కన బెడితే) ని ఆహ్వానించితే మాత్రం నిజంగానే ఇది ఆశ్చర్యం కలిగించే వార్త. చంద్రబాబు నాయుడు చేదు గుళిక గా మిగులు తుంది.

మరో విశేషం ఏమంటే ఎపి ప్రత్యక హోదా ఇస్తామని రాహుల్ గాంధీ ఈ పాటికే ప్రకటించి వున్నారు. జగన్మోహన్ రెడ్డి హోదా ఇచ్చే వారికి తన మద్దతు అని స్పష్టం చేసి వున్నారు. రేపు ఏంజరుగు తుందో ఏమో గాని ఇద్దరూ ఒకే రహదారిలో పయనించే సూచనలు ఉన్నాయి. రేపు వాస్తవంలో ఫలితాలు ఏలా వుంటాయో ఎవరు రాజు ఎవరు బంటో ఇప్పుడు ఏమీ చెప్ప లేము గాని పరిణామాలు మాత్రం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యతిరేకంగా సంభవించుతున్నాయి.

సోనియా గాంధీ ఏర్పాటు చేస్తున్నదని ప్రచారం జరుగుతున్న అంశాలపై తేల్చు కొనేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రధానంగా ఢిల్లీ వెళ్లారని భావించేందుకు ప్రాతిపదిక వుంది.
ఏది ఏమైనా ఒక వేళ సోనియా గాంధీ ఏర్పాటు చేసే సమావేశానికి వైసిపి నేత జగన్మోహన్ రెడ్డిని ఆహ్వానించితే చంద్రబాబు నాయుడు కు చెంది రామేశ్వరం పోయినా శనేశ్వరం తప్ప లేదన్న సామెత చక్కగా సరిపోతుంది

– వి. శంకరయ్య, 9848394013

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*