చంద్రబాబు తిరుపతిలో నడచి వెళుతున్నా..!

ఒకప్పుడు ఎన్‌టిఆర్‌ తిరుపతి మున్సిపల్‌ హైస్కూల్‌ గ్రౌండ్‌లో మీటింగ్‌ పెట్టారు. ఆయన ఓపెన్‌ టాప్‌ వాహనంలో ఎక్కి బస్టాండు నుంచి సభా వేదిక వరకు ప్రయాణించారు. ఆ వాహనం వెనుక వేలాది మంది పరుగులు తీస్తే…దారి పొడవునా రోడ్డుకు ఇరువైపులా వేలాది మంది గుమికూడి ఆయన్ను చూశారు. మిద్దెలు మేడలు నిండా జనమే.

ఈరోజు (22.09.2018) తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అదే స్కూల్‌ గ్రౌండ్‌లో మీటింగ్‌ పెట్టారు. ఎన్‌టిఆర్‌ విగ్రహం నుంచి నడచుకుంటూ సభావేదిక వరకు వెళ్లారు. పచ్చదనం కార్యక్రమాన్ని ప్రమోట్‌ చేయానికి ఆయన 1.5 కిలోమీటర్ల దూరం నడిచారు. ఆయన వెనుక పాఠశాలల నుంచి వచ్చిన విద్యార్థులు ఉన్నారు తప్ప…బాబును ఆసక్తిగా చూడటనాకంటూ రోడ్డుపై నిలబడిన జనం కనిపించలేదు. ఒకటిన్నర కిలోమీటరు దూరానికి కొన్ని వందల మంది కూడా కనిపించకపోవడం ఆశ్చర్యం కలిగించింది. ఈనాటి ఎన్‌టిఆర్‌ ర్యాలీకీ, ఈ ర్యాలీకీ ఎంత తేడానో అనిపించింది!

తిరుపతిలో 22.09.2018న నిర్వహించిన కార్యక్రమం ఆకస్మికంగా ఏర్పాటు చేసినదే. మూడు రోజుల క్రితం మాత్రమే దీన్ని ఖరారు చేశారు. అందువల్ల జనం లేరనుకోవాలా? రెండు రోజులుగా చంద్రబాబు కార్యక్రమం గురించి పత్రికల్లో, ఎలాక్ట్రానిక్‌ మీడియాలో వస్తోంది. అయినా రోడ్డు పక్కన జనం కనిపించలేదు. కనీసం మిద్దెలపై నిలబడి చూసేవారు కూడా కానరాలేదు.

చంద్రబాబు నడచుకుంటూ వెళుతూ…రోడ్డుకు అటూ ఇటూ మిద్దెలపైకి చూశారు. జనం కనిపించలేదు. అక్కడక్కడా ఒకరిద్దరు కనిపిస్తే చెయ్యి ఊపారు. స్విమ్స్‌ కూడలిలో మాత్రం ట్రాఫిక్‌ ఆపేయడంతో కొద్దిగా జనం కనిపించారు. ముఖ్యమంత్రి నేరుగా బహిరంగ సభకు హజరైవుంటే…ఇవన్నీ పట్టించుకోవాల్సిన అవసరం వుండేది కాదు. ఒక పార్టీకి, అదీ అధికారి పార్టీకి అగ్రనాయకుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి ఒకటిన్నర కిలోమీటరు నడచి వెళుతుంటే…ఆయన్ను చూడటానికి రోడ్డుపైన జనం కనిపించకపోవడమే ఆశ్చర్యం అనిపించింది.

స్థాని తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా జనాన్ని తీసుకొచ్చి రోడ్డుకు ఇరువైపులా నిలబట్టాలని అనుకున్నట్లు లేదు. ఆఖరికి ఎంఎల్‌ఏ సుగుణమ్మ ఇంటి వద్ద కూడా జనం కనిపించలేదు. దీనికి సంబంధించి పార్టీ నాయకులకు ఏమైనా అనిపించిందో లేదోగానీ…ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాత్రం ఆలోచనలో పడివుంటారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*