చంద్రబాబు తిరుపతి నుంచి పోటీచేసే సాహసం చేస్తారా…!

తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వచ్చే ఎన్నికల్లో తిరుపతి నుంచి పోటీ చేస్తారన్న వార్తలు వస్తున్నాయి. ఇప్పటిదాకా తాను ప్రాతినిథ్యం వహిస్తున్న కుప్పం నుంచి నారా లోకేష్‌ పోటీ చేస్తారని చెబుతున్నారు. కుప్పంలో లోకేష్‌ పోటీ చేయడానికి ఇబ్బందులు లేకపోవచ్చుగానీ…తిరుపతి నుంచి చంద్రబాబు నాయుడు పోటీ చేయడమంటే సాహసమే అవుతుంది.

తిరుపతి తెలుగుదేశం పార్టీకి పట్టున్న నియోజకవర్గమే. అందులో అనుమానం లేదు. అయితే…తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో చంద్రబాబు వంటి నేతకు తిరుపతి అంత సురక్షితమైన నియోజకవర్గం కాదు. తిరుపతిలో కాపు సామాజిక తరగతి ఓట్లు గణనీయంగా ఉన్నాయి. సాధారణంగా ఆ సామాజికవర్గానికి చెందినవారే ఇక్కడ ఎంఎల్‌ఏగా ఎన్నికవుతూ వస్తున్నారు. చదలవాడకృష్ణమూర్తి, మోహన్‌, వెంకటరమణ, చిరంజీవి…అందరూ కాపు కులానికి చెందినవారే.

ఈసారి జనసేన రంగంలోకి తిగుతున్న సంగతి తెలిసిందే. ఆ పార్టీ గట్టి ఆశలు పెట్టుకున్న నియోజకవర్గంలో తిరుపతి ఒకటి. ఇక్కడి నుంచి కాపు సామాజిక తరగతికి చెందిన వ్యక్తే జనసేన అభ్యర్థిగా ఉంటారనడంలో సందేహం లేదు. ఇప్పటిదాకా ఈ సామాజికవర్గం తెలుగుదేశంతోనే ఉంది. జనసేన రంగంలోకి వస్తే…ఆ ఓట్లన్నీ అటువైపు వెళ్లడం ఖాయం. కాపు ఓట్లతో చీలిక నామమాత్రంగానే ఉంటుంది. ఎందుకంటే….రాష్ట్రంలో అధికార పీఠాన్ని దక్కించుకోవాలనుకుంటున్న మూడో సామాజికవర్గంగా ఉన్న కాపులు…వచ్చే ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నారు. చిరంజీవి రూపంలో వచ్చిన అవకాశం చేజారిపోవడంతో…ఇప్పుడు పవన్‌పై ఆశలు పెట్టుకున్నారు. అందుకే ఏదిఏమైనా జనసేకు తప్ప ఇంకో పార్టీకి కాపుల మద్దతు ఉండే అవకాశం లేదు. కాపుల ఓట్లు లేకుండా టిడిపి గెలవడం అసాధ్యం. కాస్త అటూ ఇటూ అయితే…ఓటమి తప్పదు. ఈ పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు తిరుపతి నుంచి బరిలోకి దిగే సాహసం చేయగలరా? అనేది ప్రశ్న.

చంద్రబాబు నాయుడు కుప్పం నుంచి కాకుండా మరే ఇతర నియోజకవర్గం నుంచి పోటీ చేసినా….ప్రజల్లోకి వెళ్లే సంకేతాలు ఆ పార్టీకి నష్టం కలిగిస్తాయనడంలో సందేహం లేదు. వచ్చే ఎన్నికల్లో టిడిపి గెలిస్తే లోకేష్‌ ముఖ్యమంత్రి అవుతారనేది బహిరంగ రహస్యం. అయితే…ఈ మాటను టిడిపి అధికారికంగా ప్రకటించే పరిస్థితి లేదు. అందుకే…ఇటీవల కుప్పంలో టిడిపి నాయకులు ఓ ముఖ్యమైన ప్రకటన చేశారు. చంద్రబాబు నాయుడు కుప్పం నుంచే బరిలోకి దిగుతారని, తూర్పున సూర్యుడు ఉదయించడం ఎంత సహజమో కుప్పంలో చంద్రబాబు పోటీ చేయడం అంతే సహజమని పనిట్టుకుని చెప్పుకున్నారు. లోకేష్‌ను ముఖ్యమంత్రి చేసే అవకాశం ఉన్నా…చంద్రబాబు మాత్రం కుప్పం నియోజకవర్గం మారకపోవచ్చునని పరిశీలకుల అంచనా.

లోకేష్‌ కోసం చంద్రగిరి, పెనమలూరు, గుడివాడ నియోజకవర్గాలను పరిశీలించినా… ఎక్కడా అనుకూలత లేకపోవడంతో ఆ ఆలోచన విడిచిపెట్టారు. అందుకే చంద్రగిరికి పులివర్తి నానిని ఇన్‌ఛార్జిగా ప్రకటించారు. ఇక కర్నూలు జిల్లాలో ఏదోఒక నియోజకర్గం నుంచి లోకేష్‌ పోటీ చేయవచ్చని తెలుస్తోంది. లోకేష్‌కు మరింత పటిష్టమైన స్థానం ఇవ్వాలనుకుంటే…కుప్పం నుంచి ఆయన్ను బరిలోకి దింపి…కర్నూలు జిల్లా నుంచి బాబు తలపడే అవకాశాలున్నాయి. అంతేతప్ప తిరుపతి నుంచి బాబు పోటీ చేయకపోవచ్చునని రాజకీయ పండితుల విశ్లేషణ. తిరుప‌తి టికెట్టు కాపు సామాజిక త‌ర‌గ‌తికిగానీ, బిసిల‌కుగానీ ఇచ్చే అవ‌కాశాలున్నాయి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*