చంద్రబాబు దారి రహదారి కాదు..!

– జాతీయ స్థాయిలోనూ అన్నీ ప్రతిబంధకాలే

ఒక వేళ అయితే గియితే ఎపిలో టిడిపి అధికారంలోకి వచ్చినా కేంద్రంలో బిజెపి ప్రభుత్వం గాని లేక మిత్రపక్షాల సహకారంతో యుపిఏ ప్రభుత్వం గాని అధికారం చేజిక్కించుకొంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిస్థితి అడవిని కాచిన వెన్నెల అవుతుంది. కథ తిరిగి మొదటి కొస్తుంది. ఎపిలో అధికారంలోనికి రావడం ఎంత అవసరమో కేంద్రంలో బిజెపియేతర ప్రభుత్వం రావడం ముఖ్యమంత్రి చంద్రబాబుకు అంతే అవసరం. అందుకే కాలికి బలపం కట్టుకొని దేశం నలుమూలల ఎన్నికల ప్రచారం చేస్తున్నారు.

అయితే జాతీయ స్థాయిలో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆశిస్తున్నంతగా పరిస్థితి ఆశాజనకంగా లేదు. జాతీయ స్థాయిలో పలు వురు నేతలు ప్రధాని మోదీ ని వ్యతిరేకిస్తున్నారు – గాని వీరి మధ్య ఏకీభావం లేదు. ఎన్నికల్లోనే వీరు పరస్పరం పోటీ పడుతున్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ రెండు దఫాలు ఎపికి వచ్చి టిడిపికి అనుకూలంగా ప్రచారం చేసి వెళ్లారు. కాని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాత్రం కేజ్రీ వాల్ కు అనుకూలంగా ఢిల్లీ వెళ్లి ప్రచారం చేసే అవకాశాలు కనిపించడం లేదు. ఎందుకంటే ఢిల్లీలో కాంగ్రెస్ – అప్ పార్టీల మధ్య సఖ్యత లేదు. పరస్పరం పోటీ పడుతున్నాయి. అప్ కు అనుకూలంగా వెళ్లితే కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ప్రచారం చేయాలి. అదే జరిగితే జాతీయ స్థాయిలో ముఖ్యమంత్రి చంద్రబాబు కాంగ్రెసు అధ్యక్షులు రాహుల్ గాంధీ రూపొందించుతున్న మోదీ వ్యతిరేక కూటమి ఒక భ్రమగా మిగిలి పోతుంది.
అదేవిధంగా బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఎపి వచ్చి టిడిపి కి ప్రచారం చేసి వెళ్లారు. కాని బెంగాల్ లో కాంగ్రెస్ పార్టీ దీదీకి వ్యతిరేకంగా పోటీ చేస్తోంది. పోలింగ్ సందర్భంగా రెండు పార్టీల మధ్య హింసాత్మక సంఘటనలు సంభవించాయి… కొందరు మృతి చెందారు – కూడా.

తమాషా ఏమంటే కొందరు నేతలు తమ రాష్ట్రంలో కాంగ్రెస్ తో హోరా హోరీగా పోరాడుతూ ఎపి కి వచ్చి మోదీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ తో కలసి తామంతా జాతీయ స్థాయిలో జట్టు కడతామని చెప్పి మనల్ని నమ్మ మంటున్నారు. వీరంతా తమ రాష్ట్రాల్లో పోట్లాడుతూ కర్నాటక లాంటి రాష్ట్రాల్లో ఒకే వేదికపై చేరి మోదీని అధికారం నుండి దింపుతామని ప్రగల్బాలు పలుకుతున్నారు. నేడు దేశానికి మోదీని ప్రధాని పదవి నుండి దింపడం ఎంత అవసరమో కలగూరగంప లాగా చేరి దేశ ప్రజల దైనందిక సమస్యలపై సూత్రబద్దమైన ఏకీభావం లేని ఈ నేతల వ్యవహార శైలి ప్రజాస్వామ్యానికి అంతే అపకారం చేస్తుంది.

అంతెందుకు? ఎనభై స్థానాలు గల యుపిలో దేశంలో ఎవరితో సంబంధం లేకుండా రెండు పార్టీలు కూటమి కట్టాయి. కాంగ్రెస్ను కడ గాటన కట్టాయి. ఈ రెండు పార్టీలు యాభై అరవై స్థానాలు గెలుచుకున్నా వీరిలో మాయావతి లేక ములాయం సింగ్ ఎవరు ప్రధాని అభ్యర్థిగా వుంటారో, పరిణామాలు ఏలా వుంటాయో పైగా జాతీయ పార్టీ కాంగ్రెస్ వైఖరి దాని బలం ఏలా వుంటుందో ఇప్పటి కప్పుడు చెప్పడం కుదరదు.

ఇవన్నీ అటుంచి జాతీయ స్థాయిలో పటిష్టమైన స్థిరమైన ప్రభుత్వం కేంద్రంలో ఏర్పడక పోతే నేడు అంతర్జాతీయంగా వున్న పరిస్థితులలో దేశ సమైక్యతకే ప్రమాదం పొంచి వుంటుంది. లంక పరిణామాలు పాక్ కవ్వింపు చర్యలు పరిగణనలోకి తీసుకోవాలి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేస్తున్న పోరాటంలోనూ విశ్వసనీయ కాగడా పెట్టి వెతికినా ఇసుమంత కనిపించడం లేదు.

ముఖ్యమంత్రి ప్రసంగాలు పరిశీలించితే ప్రధాని మోదీ వ్యతిరేకత తప్ప గత ఐదు ఏళ్లుగా కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అవలంభించిన మత దురహంకార విధానాలను కించిత్ కూడా ముఖ్యమంత్రి ప్రస్తావనకు తేవడం లేదు. బిజెపి విధానాలను ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ఒకవేళ మోదీ స్థానంలో మరొక నేత ఎవరైనా వస్తే ముఖ్యమంత్రి అటు వేపు మొగ్గు తారనేందుకు అవసరమైనంత సమాచారం ఆయన ప్రసంగాలలో మనకు లభ్యమౌతుంది. ఇదే పరిస్థితి దేశంలో పలువురు నేతల్లో చూడ గలం. అంతా అవకాశవాదంతో అధికారం పరమావధిగా వున్నారు.

అందుకే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎంత చెమటోడ్చుతున్నా ఆయన సాగిస్తున్న పోరాటానికి అవసర మైనంత మేర రాష్ట్ర స్థాయిలోను జాతీయ స్థాయిలోను ఇంధనం లభ్యం కావడం లేదు. ప్రధానంగా జాతీయ స్థాయిలోగల పలువురు నేతలు ఆయా రాష్ట్రాల్లో తమ పార్టీల ప్రయోజనాలు పరస్పరం విరుద్ధంగావడంతో ఘర్షణ పడుతున్నాయి. ఫలితంగా మోదీ వ్యతిరేక కూటమిలో సూత్ర బద్ద మైన ఏకీభావం లేక పోతోంది. ఈ ప్రభావం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కు తీవ్ర ప్రతి బంధకంగా ఎదురౌతోంది.

ఆ మాట కొస్తే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు జాతీయ స్థాయిలో సూత్రబద్దమైన వైఖరి లేదు. మోదీని విమర్శించు తారు. కాని బిజెపిని అంతగా అటాక్ చేయరు. కాని కాంగ్రెస్ అంశానికొస్తే మోదీని అటాక్ చేసినంతగా బిజెపిని దుయ్య బడుతుంది. ఈ వైఖరి దేశంలోని బిజెపి యేతర అన్ని పార్టీల నేతల్లో కనిపిస్తోంది. ఇదే మోదీకి ఒక విధంగా బలం.

ఇదిలావుండగా కాలం కర్మం కలసి రాక పోతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవలసి వుంటుంది. జాతీయ స్థాయిలో నేతల మధ్య పొర పచ్చాలు వున్నా భవిష్యత్తులో తనకు అవసరమైనపుడు జాతీయ స్థాయిలో అండగా నిలబడేందుకు పలువురితో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెలిమి సాగిస్తున్నారు. వారి మధ్య విభేదాలు వున్నా కేంద్రంలో అధికారంలోనికి రాకున్నా కనీసం తనకు అవసరమైనపుడు అండగా వుంటారని ముఖ్యమంత్రి సఖ్యతగా వున్నారు.

– వి.శంకరయ్య, 9848394013

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*