చంద్రబాబు నిజంగా ఏపీకి రావాలని అనుకుంటున్నారా…కరోనా భయంతో వెనకడుగు వేస్తున్నారా..!

Nara Chandrababu Naidu

ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు హైదరాబాదులో ఉంటూ‌ రాజకీయాలు నడిపిస్తున్నారు. కరోనా కష్టకాలంలో ప్రజలను కలుసుకోవాలని ఉన్నా లాక్ డౌన్ వల్ల…హైదరాబాద్ నుండి ఏపీకి రాలేకపోతున్నానని పదేపదే చెబుతున్నారు. విశాఖపట్నంలో జరిగిన విష వాయువు లీక్ ఉదంతం నేపథ్యంలోనూ ఆయన ఇదే మాట చెప్పారు. విశాఖ వెళ్లి బాధితులను పరామర్శించడానికి అనుమతి ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరినా….అనుమతి లభించలేదని చంద్రబాబు అంటున్నారు.

చంద్రబాబుకు నిజంగా ఏపీకి రావాలని ఉందా, కరోనా పీడిత ప్రజలను ఆదుకోవాలని ఉందా, విశాఖ గ్యాస్ ఘటన బాధితులను పరామర్శించాలని ఉందా…? నిజంగా రావాలన్న మనసు ఉంటే, అది పెద్ద సమస్యే కాదు. చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత. ఆయనకు కేబినెట్ హోదా ఉంటుంది. ఆయన ఎక్కడికైనా వెళ్లవచ్చు. ఆపేవాళ్లు ఉండరు. రాజకీయ దురుద్దేశంతో ఎవరైనా ఆపితే…అదే విషయాన్ని ప్రజలకు చెప్పవచ్చు. ప్రభుత్వాలు వలస కూలీలకూ అనుమతులు ఇచ్చి స్వస్థలాలకు పంపుతున్నాయి. ప్రతిపక్ష నేత చంద్ర బాబును ఆపేది ఏముంటుంది..?

కరోనా కష్టకాలంలో నేను ప్రజలను కలుసుకోడానికి బయలుదేరు తున్నాను…విశాఖ బాధితులను పరామర్శించడానికి వెళుతున్నాను అని అటు తెలంగాణ డిజిపికి, ఇటు ఏపీ డిజిపికి‌ సమాచారం ఇచ్చి…బయలుదేరుతే సరిపోయేది. ఇప్పటిదాకా చంద్రబాబు అటువంటి ప్రయత్నం చేయలేదు. పైగా లాక్ డౌన్ నిబంధనలను గౌరవిస్తూ ఇంట్లో ఉంటున్నానని గొప్పగా చెప్పుకుంటున్నారు. విశాఖ సంగతికి వచ్చేసరికి, అనుమతి కావాలంటూ కేంద్ర హోంశాఖకు లేఖ రాశారు. ఇక్కడి ప్రభుత్వాలను‌ అడగకుండా కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయడంలో అర్థముందా…! అలా రాయడానికి నామూషానా..! జగన్ కు నేను లేఖ రాయడం ఏంది అనుకున్నారా..! నిజంగా ఏపీకి రావాలన్న ఆలోచన చంద్రబాబుకు ఉందా…! ఇటువంటి అంశాలన్నీ చర్చకు వస్తున్నాయి.

అయినా…చంద్రబాబు ప్రతిపక్ష నేతగా ఏపీలో ఉండాల్సిందిపోయి హైదరాబాదులో ఎందుకుంటున్నారు. గతంలో జగన్ హైదరాబాదులో ఉన్నందుకు ఎన్ని విమర్శలు చేశారో…! మరి ఆ బాధ్యత బాబుకు లేదా..? పేరుకు అమరావతిలో ఇల్లు ఉన్నా చంద్రబాబు కుటుంబం ఎక్కువ కాలం హైదరాబాదులోనే ఉంటోంది. కరోనా విజృంభిస్తున్న సమయంలోనూ ఏపీలో ఉండకుండా హైదరాబాదు వెళ్లిపోయారు. కనీసం తన సొంత నియోజకవర్గం కుప్పం ప్రజల బాధనూ ఆయన పట్టించుకోలేదు.

ప్రతిపక్ష నేతగా ఏపీలో ఉండి తాను నిర్వర్తించాల్సిన బాధ్యత వదిలేసి… అయినదానికి కానిదానికి రాద్ధాంతం‌ చేస్తున్నారు. ఒకరోజు టెలి కాన్ఫరెన్స్ ప్రెస్ మీట్,‌ ఒకరోజు పార్టీ నాయకులతో సమావేశం, ఒక రోజు బహిరంగ లేఖ…ఇలా ఏదో ఒక పేరుతో విమర్శలు గుప్పిస్తున్నారు. జగన్ ఏమి చేసినా విమర్శలు గుప్పించడమే పనిగా పెట్టుకున్నారు. కరోనా విషయంలో ఏదో మాట్లాడు తున్నారులే అనుకుంటే…విశాఖ విషాదంపైనా అటువంటి‌ విమర్శలకే పూనుకున్నారు.‌ బాధితులకు కోటి పరిహారం ప్రకటించినా… అది సరిపోతుందా అని మాట్లాడు తున్నారు. తాను అధికారంలో ఉన్నపుడు ఏం మాట్లాడిందీ ప్రజలకు గుర్తుండదని అనుకుంటారో లేక ఏమి మాట్లాడినా అడిగేదెవరు అనుకుంటారో గానీ… నోటికొచ్చింది మాట్లాడుతున్నారు. ఆయన చెప్పేదాన్ని అనుకూల మీడియా గంటలు గంటలు చూపించవచ్చుగానీ…అవి ఆయన ప్రతిష్టను దిగజార్చుతున్నాయన్న వాస్తవాన్ని గ్రహించలేకున్నారు.

మళ్లీ, అసలు విషయానికొస్తే…ఏపీకి రావాలన్న చిత్తశుద్ధికంటే కరోనా ముగిసేదాకా హైదరాబాదులోనే ఇంట్లో సురక్షితంగా ఉండాలన్న ఆలోచన‌ ఉన్నట్లు కనిపిస్తోంది. అలా ఉండాలనుకోవడం తప్పుకూడా కాదు. ఎందుకంటే చంద్రబాబు వయసు ఏడు పదులు అవుతోంది.‌ ఈ వయసులో కరోనా ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఈ పరిస్తితుల్లో ఇంట్లో ఉండటాన్ని తప్పుపట్టలేం. అయితే…తాను ఏపీకి వచ్చి జనంలో జనంలోకి వెళ్లాలనుకుంటే ప్రభుత్వం అనుమతి‌ ఇవ్వలేదని చెప్పడం ప్రజలను మభ్యపెట్టడమే అవుతుంది.

  • ఆదిమూలం శేఖర్, ఎడిటర్, ధర్మచక్రం

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*