చంద్రబాబు నిర్వేదానికి పరమార్థముందా? చరిత్ర గతి మరచితే ఇంతే..!

పట్టుబట్టి పట్టి సీమ పూర్తి చేసి కృష్ణా డెల్టాకు గోదావరి నీళ్లు ఇస్తే జిల్లాలో రెండు సీట్లు గెలిపించాలని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు కృష్ణ జిల్లా పార్టీ సమావేశంలో ప్రజలపై నింద వేసి వాపోయారని ఒక పత్రిక వార్త ప్రచురించింది. ముప్పయి సంవత్సరాల రాజకీయానుభవం రెండుసార్లు ఎన్నికల్లో ఓటమి చెందిన అనుభవం కళ్ల ముందు వున్నా చంద్రబాబు నాయుడు ఈ లాంటి వ్యాఖ్య చేశారంటే నమ్మ శక్యంగాలేదు. తప్పంతా ప్రజలపై వేస్తున్నారంటే ఇది నిర్వేదమా? లేక అమాయకత్వమా?

చంద్రబాబు నాయుడు గత చరిత్ర ఒక మారు సింహావలోకనం చేస్తే ఈ యక్ష ప్రశ్నకు తప్ప కుండా ఆయనకు జవాబు దొరుకు తుంది. ఆంధ్రప్రదేశ్ అన్న పూర్ణగా వుందంటే కోస్తా జిల్లాలు పచ్చదనంతో తళతళ
లాడుతున్నాయంటే పండిట్ నెహ్రూ చేత ఆధునిక దేవాలయంగా కొనియాడింప బడిన నాగార్జున సాగర్ ప్రాజెక్టు విద్యుత్ కొరత తీర్చిన శ్రీ శైలం భారీ ప్రాజెక్టులను కాంగ్రెస్ పార్టీ అధికారంలో వుండి నిర్మించినవే. ఆ ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుంది. వీటితో పట్టిసీమను పోల్చే సమస్యే లేదు.ఇది కేవలం తాత్కాలిక ఎత్తిపోతల పథకం. మరీ సాగర్ కుడి కాలువ ఆయకట్టు రైతులు కాంగ్రెస్ పార్టీని కలకాలం గుండెల్లో పెట్టుకొని వుండాలి. అంతెందుకు? వరదలకు కొట్టుకు పోయిన ఆనకట్ట స్థానంలో కృష్ణ బ్యారేజీ కట్టి డెల్టాకు శాశ్వత సాగునీటి వసతి పునరుద్ధరణ జరిగింది- కాంగ్రెస్ హయాంలోనే.

కాని 1983 లో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ నెల కొల్పిన నెలల వ్యవధిలోనే ఈ ప్రాంత ప్రజలు కాంగ్రెస్ పార్టీని చిత్తు చిత్తు గా ఓడించారు. భారీ నీటి ప్రాజెక్టులు నిర్మించి సామాజిక ఆర్థిక భౌతిక పరిస్థితులను పూర్తిగా మార్చి వేసిన కాంగ్రెస్ పార్టీని ఆ రోజుల్లో ఎందుకు ఓడించారో చంద్రబాబు నాయుడు ఈ రోజు కైనా
సునిశితంగా పరిశీలించితే పట్టి సీమ ఘనత గురించి మదిలో కూడా వుంచుకోలేరు. ప్రజలు నాణేనికి ఒక వేపు మాత్రమే చూడరు.రెండు వేపులా సమగ్రంగా దృష్టి సారించి తరచి చూచి తీర్పు ఇస్తారు. 2014 లో జగన్మోహన్ రెడ్డిని ఎందుకు ఓడించారో ఇప్పుడు ఎందుకు గెలిపించారో చంద్రబాబు నాయుడు ఆత్మావలోకనం చేసుకుంటే తనలోనూ తన పార్టీలోనూ తలెత్తిన అవలక్షణాలు బోధ పడతాయి. ప్రజల తీర్పు గురించి సరైన అంచనాకు రాగలరు. ఎన్టీఆర్ రాజకీయ ప్రవేశానికి ముందు కాంగ్రెస్ పార్టీ గురించి ఈ ప్రాంత ప్రజలు ఏ విధంగా ఆలోచించారో మొన్న ఎన్నికల మునుపు టిడిపి గురించి అదే విధంగా ప్రజలు భావించారు – కాబట్టే జగన్మోహన్ రెడ్డి కూడా ఊహించని గెలుపు ఆయనకు లభ్యమైంది.
ఎప్పుడు కూడా చరిత్ర నిర్మాతలు ప్రజలే. కాని ఇటీవల కాలంలో రాజకీయ పార్టీల నేతలు చరిత్ర సృష్టించుతామని చెప్పి బోల్తా పడుతున్నారు. అందులో భాగమే టిడిపి ఓటమి. ప్రస్తుతం వైసిపి ప్రభుత్వ ఎదుర్కొంటున్న ఎదురు దెబ్బలు. .

వి. శంకరయ్య విశ్రాంతి పాత్రికేయులు

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*