చంద్రబాబు – మమత బెనర్జీ ఒక గూటి పక్షులే

కోలకతాలో దీక్ష చేపట్టిన బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చేత దీక్ష విరమించడానికి ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు వెళ్లారు. ఇందుకు బలమైన ప్రాతి పదిక లేక పోలేదు. ఇద్దరు ఒక గూటి పక్షులే. అనేక అంశాలలో వీరిద్దరికీ సారూప్యం వుంది.
1)ఇద్దరూ ప్రాంతీయ పార్టీల నేతలు.
2)ఇద్దరూ రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో ఎవరీతోనూ పొత్తు పెట్టుకునే స్థితిలో లేరు.
పొత్తు అంటూ పెట్టు కొంటే కాంగ్రెస్ ఒక్కటే వుంది. కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుంటే ఇద్దరు మునిగి పోతారు. అందువలన కాంగ్రెస్ తో కాపురం చేయరు. గాని సహజీవనం చేస్తున్నారు.
3)బెంగాల్ లో ఒక వేపు వామపక్షాలు మరో వైపు బిజెపి రాజకీయ ముట్టడిలో మమత బెనర్జీ వున్నారు. ఫలితంగా పాపులారిటి కోసం ఏదో ఒక హంగామా హడావుడి చేయవలసి వుంది. మరో వైపు ఎపిలో ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఏకాకి అయ్యారు. కాంగ్రెస్ పార్టీ తప్ప మరో పార్టీ లేదు. కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుని తెలంగాణలో తలకు బొప్పి కట్టింది. ఒక వేపు వైసిపి మరో వైపు జనసేన వామపక్షాల కూటమి ముఖ్యమంత్రికి నిద్ర లేని రాత్రులను తెచ్చి పెట్టింది. జన సేన వామపక్షాల కూటమి టిడిపి ఓటు బ్యాంకుకు పెద్ద కన్నంవేయ బోతోంది..
4)ఈ సారూప్యాలకంటే మించి మరో కీలక మైన అంశం ఇద్దరి మధ్య వుంది. రెండు రాష్ట్రాలలో అధికార పార్టీల నేతలు అధికారులు పీకల్లోతు అవినీతి ఊబిలో కూరుకుపోయి వున్నారు.
పది లక్షల మందికి చెందిన పదివేల కోట్లు కొల్ల గొట్టిన కుంభకోణంలోమమత పార్టీ నేతలే కాకుండా అధికారులు చిక్కు కొని వున్నారు. దీనికి తోడు 40 వేల కోట్లుతో రోజ్ వ్యాలీ మరో కుంభకోణం విచారణలో వుంది. ఈ కేసులు దర్యాప్తు చేసిన సమయంలో సిట్ అధికారిగా వుండిన ప్రస్తుత డిజిపి రికార్డులు ధ్వంసం చేసిన నేరం పై సిబిఐ అధికారులు అరెస్టుకు వస్తే ముఖ్యమంత్రి మమత బెనర్జీ అడ్డు కొని దీక్ష కు దిగారు.
సరిగ్గా ఎపిలో లో కూడా టీడీపీ నేతల ఇళ్ల పై సిబిఐ దాడులకు దిగే ప్రమాదం గమనించిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఆ అవకాశం లేకుండా సిబిఐ ప్రవేశం లేకుండా చేశారు.
5)క్రమేణా పెరుగుతున్న వామపక్షాల బలం బిజెపి ప్రాబల్యం చూచిన మమత బెనర్జీ హడలి పోయి దేశంలో అందరు నేతలను పిలి పంచుకొని భారీ బహిరంగ సభను నిర్వహించారు. అంత వరకు బాగానే ఉంది. ఈ లోపు మార్క్సిస్టు పార్టీ నిర్వహించిన సభ మమత బెనర్జీ గుండెల్లో బాంబులు పేల్చింది. ఇదే పరిస్థితి ఎపిలో మరో రూపంలో వ్యక్తం అవుతోంది. ఇటీవల పలు జాతీయ సర్వే లలో టిడిపి చిత్తు చిత్తు గా ఓడి పోతుందని వెల్లడి కాగానే ముఖ్యమంత్రి నాలుగున్నర ఏళ్ల కాలం మిన్న కుండి మహిళలను టార్గెట్ చేయడానికి పసుపు కుంకుమ కార్య క్రమం చేపట్టారు. ముఖ్యమంత్రిలో ఏ స్థాయిలో ఓటమి భయం వుందో ఈ కార్యక్రమాలు పరిశీలించితే తెలుస్తుంది.

6)మరో ముఖ్య మైన అంశమేమంటే ఇద్దరూ గతంలో బిజెపి తో అంట కాగి విడాకులు తీసుకున్న వారే. వీరిద్దరూ పలు పార్టీలతో రాజకీయ ప్రయోజనాల కోసం పలు మార్లు వియ్య మందటం తిరిగి వదిలేయడం అనుభవ మున్న వారే. అందుకే ఇద్దరూ ఒక గూటి పక్షులైనందున ఏదో ఒక రూపంలో బయట పటానికి ముఖ్యమంత్రి చంద్రబాబు కోలకతా వెళ్లారు.

– వి. శంకరయ్య 9848394013

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*