చంద్రబాబు యాగీ దేనికి సంకేతం?

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సరి కొత్త చరిత్ర సృష్టించుతున్నారు. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వున్న నేత అదే రాష్ట్రానికి చెందిన ప్రధాన ఎన్నికల అధికారిని కలసి వినతిపత్రం అందించడం ఇంతవరకు సంభవించ లేదు. ఒకవేళ వినతిపత్రం సమర్పించినా ఆ అధికారి ఆఫీసు ముందు ధర్నా నిర్వహించిన సంఘటన కూడా అరుదు. ఈ సంఘటనలన్నీ భారత దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఇంత వరకు జరగ లేదు. నేడు ఎపిలో చూస్తున్నారు. ఇవన్నీ దేనికి సంకేతం?

ఈ సంఘటనల వెనుక మరో ట్విస్ట్ వుంది. అది కూడా అపూర్వమే. నాలుగైదు రోజుల క్రితం ఎన్నికల ప్రధాన అధికారి ద్వివేది మాట్లాడుతూ ఎపిలో అధికారంతో పాటు ధనబలం ఎక్కువగా వుందని, తదనుగుణంగా చర్యలు చేపట్టామని యధాలాపంగా నైనా ప్రకటన చేశారు. ఆరోజు ఎన్నికల ప్రధాన అధికారి నోటి నుండి వచ్చిన అధికారం ధనబలం ఎక్కువ అన్న ప్రకటనకు, ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు ధర్నా కు లింకు తప్పక వుంది. కాబట్టే ముఖ్యమంత్రి స్థాయిగల నేత అరుదైన చర్యలుకు తెర దీశారు.ఇందుకు బలమైన నేపథ్యం వుంది.

అయిదు ఏళ్లు పరిపాలన సాగించినా ఇచ్చిన హామీలు ముఖ్యమంత్రి అమలు చేయలేదు. ఎన్నికలు ముంచు కొచ్చిన సమయంలో పసుపు కుంకుమ ఇత్యాది జిమ్మిక్కులకు తెర దీశారు. అయిదు ఏళ్లు పూర్తి చేయలేని రుణమాఫీ నాలుగో కంతు ఇప్పుడు జమ చేశారు.పీకల మీదకు వస్తే గాని ముఖ్యమంత్రికి ప్రజలు గుర్తుకు రాని తేలి పోయింది. ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టి లో ప్రజలు మేకలు గొర్రెలతో సమానం. కసాయి వానికి అప్పగించే సమయంలో మేత వేస్తే చాలని ఇన్నాళ్లు భావించారు. ఇందులో భాగమే ఈ ఆపద మొక్కలు.

అయితే పోలింగ్ దగ్గర పడే కొద్ది పసుపు కుంకుమ గట్రా కాపాడుతుందనే నమ్మకం ముఖ్యమంత్రికి ప్రస్తుతం కలగడం లేదు. మరో వేపు 2014 లో ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత రాష్ట్రంలో పార్టీకి ప్రభుత్వానికీ తేడా లేకుండా పోయింది. ప్రభుత్వం సమాచారంతా పార్టీ ఆఫీసుకు చేరింది. ఇంకేమి? అడ్డే వుండదని భావించారు. కాని ఎన్నికల సమయంలో కథ అడ్డం తిరిగింది. ఎన్నికల సంఘం అంతా బిగించేసింది. అందులో భాగంగానే రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి రాష్ట్రంలో అధికారం దబ్బు బలం ఎక్కువని వ్యాఖ్యానించారు. ఫలితంగా గుక్క తిప్పుకోలేని ముఖ్యమంత్రి తన హోదా ఇతర లాంఛనాలు పక్కన బెట్టి ఏకంగా ధర్నాకు దిగారు.

సాధారణంగా రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ కి వెసులుబాటు వుంటుంది. అయితే ఎపిలో మితిమీరీ పోయి అజీర్తి పట్టుకోవడంతో కథ అడ్డం తిరిగింది. . ఫలితంగా ముఖ్యమంత్రి డిఫెన్స్ లో పడి యాగీకి దిగారు. ధర్నా రాస్తారోకో నిర్వహించాలసిన ప్రతిపక్షం తన పని తాను క్షేత్రస్థాయిలో గుట్టు చప్పుడు కాకుండా చేసుకుని పోతుండగా ఎన్నికల తతంగం గాలికి వదలి పెట్టి ఆందోళన కార్యక్రమాలకు ముఖ్యమంత్రి పరిమిత మౌతున్నారు.

రేపు ఎన్నికల తీర్పు ఏలా వుంటుందో ఏమో గాని ముఖ్యమంత్రి మాత్రం డిఫెన్స్ లో పడ్డారని పిస్తోంది. ఇప్పటి నుండే అందుకు గ్రౌండ్ తయారు చేసుకుని మొత్తం నెప మంతా ప్రధాని మోదీ పైకి నెట్టేందుకు తలపడు తున్నారు. ఇంకా మోదీని తిడితే ఓట్లు వస్తాయని ముఖ్యమంత్రి భావించు తున్నందుకు సానుభూతి చూపక తప్పదు. ప్రస్తుతం ప్రజలకు ప్రధాని మోదీ ముఖ్యమంత్రి చంద్రబాబు కనిపించడం లేదు. ఈ అయిదు ఏళ్లు తమ బతుకు ఎట్లా తెల్లారిందో నెమరు వేసుకొని తీర్పు ఇచ్చేందుకు సిద్ధంగా వున్నారు. అది ఎటైనా కావచ్చు.

– వి.శంకరయ్య, 9848394013

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*