చంద్రబాబు యాగీ ప్రభుత్వోద్యోగుల మెడ మీద కత్తి కానుందా? 

భారత దేశంలో ఎన్నికల సంఘం స్వతంత్ర ప్రతిపత్తి కలిగివున్నా ఎన్నికల నిర్వహణకు ఆయా రాష్ట్రాల ప్రభుత్వోద్యోగులపై ఆధార పడవలసినదే. ఎన్నికల సంఘం ఆదేశాలతో పాటు రాష్ట్ర అధికారుల పని తీరు బట్టి ఫలితాలు వుంటాయి. ఎన్నికల సమయంలో ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు వీరు పని చేయ వలసినదే. ఆ సమయంలో అధికారంలో వున్న మంత్రివర్గం ఆదేశాలను వీరు పాటించ నవసరం లేదు. ఎన్నికల ప్రకటన వెలువడే వరకు మంత్రివర్గం ఆదేశాలు పాటించి అధికారంలో వున్న పార్టీ ఆదేశాల మేరకు వ్యవహరించుతుండిన ఉద్యోగులు ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత అతి కొద్ది రోజులు ఎన్నికల సంఘం ఆదేశాలు అమలు చేయడం కత్తి మీద సామే.
సహజంగా ప్రభుత్వ సిబ్బందిలో వుండే నిర్లక్ష్యం సాచివేత వైఖరి ఎన్నికల సమయంలో కూడా పునరావృతం అయితే  మొన్న ఎపి ఎన్నికల సందర్భంగా చోటు చేసుకున్న పరిణామాలు ఇబ్బిడి కిబ్బిడిగా చవిచూడ వలసివుంటుంది. ఒక వేపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇవియంల పనితీరు ఎన్నికల సంఘం వ్యవహార సరళి పై దేశ వ్యాప్తంగా ఉద్యమం సాగిస్తున్నారు. ఇవియంల మొరాయించి నందున ఓటర్లు ఇబ్బందులు పడ్డారని ముఖ్యమంత్రి ఆరోపించారు. ఇవియంల మొరాయించి ఓటింగ్ అర్థరాత్రి వరకు జరిగిన సంఘటనల మాటున ఎన్నికల సంఘం రాష్ట్ర అధికారులను బదలీ చేసిన అంశాన్ని పెద్దది చేసి ముఖ్యమంత్రి చూపుతున్నారు.
అయితే ఈ సందర్భంగా పలు కీలకాంశాలు తెర మీదకు వస్తున్నాయి. ఎపి ఎన్నికల తర్వాత దేశం మొత్తం మీద పలు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ రాష్ట్రాల్లో కూడా ఇవియంల ఇదే విధంగా మొరాయించాయా? ఇతర రాష్ట్రాల్లో ఎపిలో లాగా ఇవియంల మొరాయించ లేదని ప్రస్తుతానికి వార్తలు వస్తున్నాయి. మరి ఎపిలోనే ఇవియంలు భారీ ఎత్తున ఎందుకు మొరాయించాయి?
ఎపిలో కూడా ఆచరణలో పెద్ద ఎత్తున ఇవియంలు మొరాయించి పోలింగ్ కు అంత రాయం కలిగినా ఎన్నికల ప్రధాన అధికారి ప్రకటన మేరకు 45 ఇవియంలు మాత్రమే మొరాయించాయి. అయితే మిగిలిన వాటి మాట ఏమిటి?
అందుకే ఎన్నికల సంఘం రాష్ట్రంలో పోలింగ్ రోజు సాయంకాలం 6 గంటలు తర్వాత కూడా పోలింగ్ జరిగిన కేంద్రాల రిపోర్టులు పంపాలని జిల్లా కలెక్టర్ల ను కోరింది. పోలింగ్ ఆలస్యమైన కేంద్రాల రిపోర్టులు ఎన్నికల సంఘానికి చేరి ఎందుకు వలన ఆలస్యం జరిగిందో వెల్ల డైతే అసలు వాస్తవం వెలుగు చూచే అవకాశం వుంది. పలు కేంద్రాల్లో పోలింగ్ ఆలస్యం కావడానికి ఇవియంలు కారణమా? లేక సిబ్బంది అసమర్థత లేక నిర్లక్ష్యం కారణమా? వెలుగు చూచే అవకాశముంది.
ఒక వేపు ఎన్నికల సంఘం అతి కొద్ది ఇవియంలు సాంకేతికంగా మొరాయించాయని చెప్పడం మరో వేపు ప్రతి నియోజకవర్గానికి ముగ్గురు ఇంజనీర్లు పంపిన జిల్లా కలెక్టర్లు వారి సేవలు ఉపయోగించు కోలేదని ఎన్నికల ప్రధాన అధికారి ప్రకటించిన నేపథ్యంలో పోలింగ్ ఆలస్య మైన కేంద్రాల్లో ఇంజనీర్లు సేవలు సకాలంలో ఉపయోగించుకోక పోతే నేరం అంతా సదరు జిల్లా కలెక్టర్లు ఇతర తత్సంబంధిత అధికారులు మోయ వలసి వస్తుందేమో.
ఒక వేపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల సంఘం మీద యుద్ధం ప్రకటించిన పూర్వరంగంలో ఎన్నికల సంఘం కూడా అంతకు రెండు రెట్లు ఎక్కువగా తమ ఆదేశాలను అమలు చేయని రాష్ట్ర అధికారులను బోనులో నిలబెట్టే అవకాశముంది. ఇప్పటికే కొందరిపై క్రిమినల్ కేసులు నమోదు చేయడం కొందరిని సస్పెండ్ చేయడం జరిగింది.
ఇప్పటికే అందిన వార్తల ప్రకారం కొన్ని జిల్లాల్లో ఉద్దేశపూర్వకంగా అధికారులు వ్యవహరించారని ఈ జాబితాలో జిల్లా కలెక్టర్లు కూడా వున్నారని వెలుగు చూస్తున్న వార్తలు ఆందోళన కరంగా వున్నాయి. రెండవ మూడవ దశ పోలింగ్ ల్లో ఎపి లాంటి సంఘటనలు చోటు చేసుకోక పోతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సాగిస్తున్న పోరాటం ఎదుర్కొనేందుకు ఎన్నికల సంఘం పోలింగ్ సందర్భంగా తమ ఆదేశాలను అమలు చేయని అధికారులపై చర్యలు తీసుకొనే అవకాశం వుంది.
వాస్తవం చెప్పాలంటే పలు ప్రాంతాల్లో అధికారుల అసమర్థత నిర్లక్ష్యం వలన సకాలంలో పోలింగ్ ప్రారంభం కాలేదు. ఇందుకు పలు కారణాలున్నాయి. ఇవియంలు తీసుకుని పోలింగ్ కేంద్రాలకు వెళ్లిన సిబ్బందికి వసతులు లేవు. అందునా మహిళా ఉద్యోగుల ఇబ్బందులు పడ్డారు. అందుకోసమని పరిసర ప్రాంతాల్లో తల దాచుకున్న సిబ్బంది పోలింగ్ కేంద్రాలకు వచ్చే సరికి భారీ స్థాయి ఓటర్లు క్యూలో వున్నారు.
నేను ఓటు వేయడానికి 7 గంటలు బూతుకు వెళ్లాను. అప్పటికే బూతు వద్ద వంద మంది వున్నారు. నన్ను సీనియర్ సిటిజన్ గా ముందుగా లోనికి పంపారు. ఇవియంలు ఏమాత్రం మొరాయించ లేదు. గాని వివి పాట్ సీలువేయడానికి సిబ్బంది తికమక పడ్డారు. తుదకు పక్క బూతు నుండి ఒకరు వచ్చి వేశారు. ఇందుకు గాను 8.00 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. ఈ లాంటి సంఘటనలు చాలా జరిగాయి. జిల్లా అధికారులు సిబ్బందికి అవసరమైన శిక్షణ ఇవ్వక పోవడం వలన పలు ప్రాంతాల్లో పోలింగ్ ఆలస్యం అయింది.
రేపు పోలింగ్ ఆలస్యం అయిన బూతుల వారీగా పరిశీలిస్తే ఎక్కువ పోలింగ్ కేంద్రాల్లో అధికారుల నిర్లక్ష్యం బహిర్గతం కావచ్చు. అట్లని ఇవియంలు మొరాయించ లేదని ఎన్నికల సంఘం తప్పులు చేయ లేదని కాదు గాని ఇంచు మించు అధికారులుకూడా బాధ్యత వహించాల్సి వస్తుందేమో. ప్రస్తుతం ఎపిలో సాగుతున్న ఒక రకమైన యుద్ధం పరిశీలించితే క్షేత్ర స్థాయిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల సంఘం మధ్య పోరాటంలో పలువురు అధికారులు బలి పశువులు అయ్యే అవకాశం ఉంది.
                                                                                             – వి.శంకరయ్య, 9848394013

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*