చంద్రబాబూ నేను మూడో కన్ను తెరిస్తే నవ్వు ఏమవుతావో : మరోసారి విరుచుకుపడిన కెసిఆర్‌

తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌ మరోసారి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడిపై విరుచుకుపడ్డారు. నేను మూడో కన్ను తెరిచానంటే నీ బతుకు ఏమవుతుందో చూసుకో అని హెచ్చరిక స్వరంతో మాట్లాడారు. తెలంగాణలో కాంగ్రెస్‌తో కలిసి కూటమి కడుతున్న తెలుగుదేశంపైన చంద్రశేఖర్‌రావు తన దాడిని తీవ్రం చేశారు. కాంగ్రెస్‌ కంటే తెలుగుదేశం పార్టీనే టార్గెట చేసి మాట్లాడుతున్నారు. ఈ క్రమంలో తీవ్రమైన పదజాలంతో చంద్రబాబుపై ధ్వజమెత్తుతున్నారు.

తెలంగాణ ఎన్నికల ప్రచారంలో దూకుడుగా ఉన్న టిఆర్‌ఎస్‌ వరుసగా బహిరంగసభలు నిర్వహిస్తోంది. బుధవారం నిజామాబాద్‌లో భారీ బహిరంగ సభలో మాట్లాడిన కెసిఆర్‌….చంద్రబాబు నాయుడిని తెలంగాణ ద్రోహిగా అభివర్ణించారు. తెలంగాణ ప్రభుత్వాన్ని అస్థిరపరచడనికి చంద్రబాబు ప్రయత్నించారని, ఆ ప్రయత్నాల్లోనే ఓటుకు నోటు కేసులో దొరికిపోయారని అన్నారు. అటువంటి పార్టీతో పొత్తు ఎలా పెట్టుకుంటారంటూ కాంగ్రెస్‌ను నిలదీశారు కెసిఆర్‌. దీనిపై చంద్రబాబు నాయుడు స్పందించక మునుపే మరోసారి మాటల దాడికి దిగారు కెసిఆర్‌. నల్గొండలో గురువారం జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ….మరింత సూటిగా, ఘాటుగా బాబుపై వ్యాఖ్యలు చేశారు.

చావునోట్లు తలపెట్టి తెలంగాణ సాధించుకుంటే…అవకాశం వస్తే రెండు తెలుగు రాష్ట్రాలను కలుపుతానని చంద్రబాబు మాట్లాడారు. చంద్రబాబు నమ్మదగ్గ వ్యక్తికాదు. దుర్మార్గుడు. బొడ్డులో కత్తిపెట్టుకుని తిరుగుతున్నారు. అవకాశం వస్తే తెలంగాణను పొడిచేస్తారు. మోడీతో నేను కలిసిపోయానని చంద్రబాబు విమర్శిస్తున్నారు. నాలుగేళ్లు మోడీ సంకన ఎక్కింది నువ్వుకాదా….మోదీని అడ్డుపెట్టుకుని ఏడు మండలాలను ఆంధ్రాలో కలుపుకోలేదా? మోడీ సాయంతో సీలేరు విద్యుత్‌ ప్రాజెక్టును నువ్వు తీసుకోలేదా? మోడీని అండతో హైకోర్టు విభజన జరగకుండా అడ్డుపడలేదా? అంటూ బాబును చండాడారు. ఎన్‌కౌంటర్ల పేరుతో వెయ్యి మందికిపైగా తెలంగాణ బిడ్డలను పొట్టునపెట్టుకున్న దుర్మార్గుడు చంద్రబాబు….చంద్రబాబూ…నేను మూడో కన్ను తెరిస్తే నువ్వు ఏమైపోతావో…నేను నీ జోలికి రావట్లేదు…నువ్వు తెలంగాణ జోలికి రావొద్దు…అంటూ చంద్రబాబును తీవ్ర స్వరంతో హెచ్చరించారు.

ఇదిలావుండగా…బుధవారం నాటి కెసిఆర్‌ వ్యాఖ్యలపై చంద్రబాబు నాయుడు ఎలా స్పందిస్తారోనని అందరూ ఎదురుచూస్తుండగా….ఆశ్చర్యంగా ఆయన గురువారం రాత్రి దాకా ఆ ప్రస్తావనే ఎత్తలేదు. తిరుపతిలో జరిగిన మీడియా సమావేశంలో కెసిఆర్‌ విమర్శల గురించి పాత్రికేయులు బాబును ప్రశ్నించగా…నేను ఏం తప్పుచేశాను. రెండు తెలుగు రాష్ట్రాలు బాగుండాలని కోరుకోవడం తప్పా…బాబ్లీ కోసం పోరాడటం తప్పా…హైదరాబాద్‌ను డెవలప్‌ చేయడం నేను చేసిన తప్పా…అంటూ ఆచితూచి మాట్లాడారు. కెసిఆర్‌ నోటికొచ్చినట్లు మాట్లాడుతుంటే….అవి తన గురించి కాదన్నట్లు చంద్రబాబు వ్యవహరించడం ఆశ్చర్యం కలిగిస్తోంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*