చంద్ర‌బాబు ఓటు మాట‌లు….ప‌ద‌విపై సింగ‌పూర్ ఆశ‌లు!

నెల్లూరులో జరిగిన గృహ ప్రవేశాల కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడిన మాటలు ఒకింత విడ్డూరంగా ఉన్నాయి. తెలుగుదేశం పార్టీని గెలిపించకుంటే అభివృద్ది ఆగిపోతుందని ఆయన చెప్పారు. గత ఎన్నికల్లో నెల్లూరు జిల్లాలో నాలుగు స్థానాల్లో మాత్రమే టిడిపిని గెలిపించినప్పటికీ…వేల కోట్లు ఖర్చు చేసి జిల్లాను అభివృద్ధి చేశానని చెప్పారు. ఈ ఎన్నికల్లో మంచి అభ్యర్థులను నిలబెడతానంటూనే…తన కష్టాన్ని చూసి వాళ్లకు ఓట్లు వేయాలని కోరారు. వచ్చే ఎన్నికల్లో టిడిపికి ఓట్లు వేయకుంటే ఇబ్బంది పడతారని అన్నారు. సింగపూర్‌లో ఒకే ప్రభుత్వం 54 ఏళ్ళుగా అధికారంలో ఉందని, అందుకే అంతగా అభివృద్ధి చెందిందని చెప్పుకొచ్చారు.

వాస్తవంగా 2004 ఎన్నికల ముందు కూడా చంద్రబాబు నాయుడు ఇదే విధంగా మాట్లాడారు. ఆ ఎన్నికల్లో టిడిపి గెలవకుంటే విజన్‌ 2020 లక్ష్యం నెరవేరదని ప్రచారం చేసుకున్నారు. తీరా ఆ ఎన్నికల్లో టిడిపి ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. కాంగ్రెస్‌ ఘన విజయం సాధించింది వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు.

2004 ఎన్నికల్లో టిడిపి ఓడిపోబట్టే రాష్ట్రంలో అభివృద్ధికి కొత్త మార్గాలు ఏర్పడ్డాయి. 2004 ముందు చంద్రబాబు అధికారంలో ఉన్న తొమ్మిదిన్నర ఏళ్లు…..అభివృద్ధి అంటే టూరిజం, ప్రపంచ బ్యాంకు మాత్రమే. విద్యుత్‌ ఛార్జీలు మోయలేనంతగా పెంచారు. ప్రాజెక్టుల్లో నీరు వాడుకున్నా మీటర్లు బిగించారు. ప్రతిదానికీ యూజర్‌ ఛార్జీలంటూ ప్రజల నెత్తి పగలగొట్టారు. అసలు సాగునీటి ప్రాజెక్టులు, వ్యవసాయం వ్యర్థం అన్నట్లు వ్యవహరించారు.

వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తరువాత….సాగునీటి ప్రాజెక్టులకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారు. ఇప్పుడు చంద్రబాబు గుమ్మడికాయ కొడుతున్న అనేక ప్రాజెక్టులు వైఎస్‌ హయాంలో కొబ్బరికాయ కొట్టి ఎక్కువ భాగం పూర్తి చేసినవే. ఆరోగ్యశ్రీ వంటి పథకం అమల్లోకి వచ్చింది. పేదలకు కొండంత భరోసానిచ్చింది. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పేద విద్యార్థుల చదవులకు ఆలంబన అయింది. ఇక ఉచిత విద్యుత్‌ పథకం….సాగునీటి కోసం బోర్లపైనే ఆధారపడిన రైతాంగం ఇళ్లలో వెలుగులు నింపింది.

2004 ఎన్నికల్లో టిడిపి గెలిచివుంటే…ఈ పథకాలను ఊహించివుండలేం. తన యూజర్‌ ఛార్జీల ఆలోచనకు, టూరిజం భావనలకు ప్రజల మద్దతు ఉందని చంద్రబాబు వాదించివుండేవారు. ప్రజల నడ్డి మరింతగా విరిచేవారు. అంతకు మించి 2014 ఎన్నికల్లో గెలిచిన చంద్రబాబు….ప్రాజెక్టుల జపం చేస్తున్నారన్నా, రైతు రుణమాఫీ వంటి పథకాలు తెచ్చారన్నా ఆనాటి ఓటమి ప్రభావమే. వైఎస్‌ ప్రవేశపెట్టిన పథకాలను రద్దు చేయలేని పరిస్థితి ఉన్నా….ఆనాడు టిడిపి ఓడిపోయి ఇంకో ప్రభుత్వం అధికారంలోకి రావడమే కారణం.

ఒకే ప్రభుత్వం అధికారంలో ఉన్నంత మాత్రాన ప్రజలు మేలు జరుగుతుందన్న గ్యారెంటీ ఏమీ లేదు. ఆ మాటే నిజమైతే….దీర్ఘకాలం దేశాన్ని, రాష్ట్రాన్ని పాలించిన కాంగ్రెస్‌ పార్టీనే ఇప్పటికీ అధికారంలో ఉండేది. ఆ పార్టీ పాలన నచ్చలేదు కాబట్టే…చాలా రాష్ట్రాల్లో కొత్త పార్టీలు పుట్టుకొచ్చాయి. వాటికి పట్టంగట్టారు. తెలుగుదేశం కూడా ఆ విధంగా ఆవిర్భవించినదే. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు. అందుకే ఒకే ప్రభుత్వం ఉండటం వల్లే అభివృద్ధి జరుగుతుందనడంలో వాస్తవం లేదు. చంద్రబాబు స్థానంలో కమ్యూనిస్టులో, పవన్‌ కల్యానో, జగనో అధికారంలోకి వస్తే….ఇంకా మెరుగైన పాలన అందిచవచ్చునేమో. తాను తప్ప ఎవరూ రాష్ట్రాన్ని పాలించలేరని, అభివృద్ధి చేయలేరని ఎవరైనా అనుకుంటే…అది హాస్యాస్పదమే అవుతుంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*