చిత్తూరు ఎంఎల్ఏలూ… నీళ్లు‌ కావాలని అడగండి!

రాయలసీమ అన్ని జిల్లాల్లో అధికార ప్రతిపక్షాలు ప్రధానంగా యువత సాగునీటి అంశంపై సభలు సమావేశాలు నిర్వహించి తమకు జరుగుతున్న అన్యాయం గురించి చెబుతుంటారు. న్యాయం కోసం పోరాడుతూ వుంటారు. అదేమో ఏమో గాని చిత్తూరు జిల్లాలో టిడిపి హయాంలో గాని, ప్రస్తుతం వైసిపి పాలనలో గాని జిల్లాకు సాగునీటి రంగంలో జరుగుతున్న అన్యాయం గురించి పట్టించుకొనే వారు లేరు. ఏ ఒక్క ఎమ్మెల్యే స్పందించడం లేదు.


ఒకవేపు కృష్ణ నదికి వరదలు రెండు మార్లు వచ్చినా తుదకు పెన్నా నదికి అనూహ్యంగా వరద వచ్చి సోమశిల జలాశయం నిండుతున్నా తిరుపతి తాగునీటికి జిల్లాలో తూర్పు ప్రాంతంలో సాగునీటి సరఫరాకు ఉపకరించే కండలేరు రిజర్వాయర్ కు నామ మాత్రంగా నీళ్లు వదులు తుంటే చిత్తూరు జిల్లాకు చెందిన ఒక్క ఎమ్మెల్యే పట్టించు కోవడం లేదు.

ఈ నెల 19 వతేదీ మధ్యాహ్నం 2 గంటలకు సోమశిల జలాశయంలో51. 75 టియంసిల నీరు వుంది. ఇంకా పైనుండి 69,391 క్యూసెక్కుల నీరు వస్తోంది. కానీ కండలేరుకు మాత్రం 6,925 క్యూసెక్కులు మాత్రమే కిందకు వదులు తున్నారు.

వాస్తవంలో సోమశిల జలాశయం నీటి నిల్వ సామర్థ్యం 78 టియంసిల అయినా 48 టియంసిలు మాత్రమే ప్రతి నీటి సంవత్సరంలో ఉపయోగించుతారు. సోమశిల ఆయకట్టు, నెల్లూరు టవున్ తాగునీటికి కలిపి 48 టియంసిలు నీరు మాత్రమే ఉద్దేశించి జలాశయం నిర్మించారు. మిగిలిన నీరు మరు సంవత్సరం వాడుకొనేందుకు క్యారీ ఓవర్ కింద పెట్టారు. ప్రస్తుతం 50 టియంసిల నీరు చేరి నందున కండలేరుకు పూర్తి సామర్థ్యంతో 12 వేల క్యూసెక్కులు విడుదల చేయ వచ్చు. కాని అధికారులు అందుకు సిద్దం కావడం లేదు. బహుశా ఆ జిల్లాకే చెందిన ఇరిగేషన్ మంత్రి ఆదేశాలు ఇవ్వలేదేమో. అదలావుండగా కనీసం చిత్తూరు జిల్లా కు చెందిన ఎమ్మెల్యేలు కూడా ఏ మాత్రం పట్టించు కోవడం లేదు. కండలేరు పూర్తి నిల్వ సామర్థ్యం 68 టియంసిలైతే ప్రస్తుతం కేవలం 8 టియంసిల నీరు మాత్రమే వుంది. కడప కర్నూలు జిల్లాలో భారీ వర్షాలు పడుతున్నందున సోమశిల జలాశయానికి భారీగా వరద వస్తోంది. ఈ పరిస్థితుల్లో చిత్తూరు జిల్లా శాసన సభ్యులు ముఖ్యమంత్రి లేదా ఇరిగేషన్ మంత్రి తో మాట్లాడి కండలేరు ప్లడ్ ప్లో కెనాల్ పూర్తి స్థాయిలో 12 వేల క్యూసెక్కులు విడుదల చేయించుకలసి వుంది. కాని ఆ దిశగా ఎట్టి ప్రయత్నాలు జరగడం లేదు. కండలేరు కింద చిత్తూరు జిల్లాలో లక్ష ఎకరాలకు సాగునీరు అందించాలి. తిరుపతి, శ్రీకాళహస్తి పట్టణాలకు తాగునీరు అందించాలి. ఈ లోపు చెన్నయ్ తాగునీటికి తమిళ నాడు ప్రభుత్వం పట్టుబడితే వారికి నీళ్లు ఇవ్వాలి. ఈ పద్దతిలో నీళ్లు వదలితే ఇంతే సంగతులు. ఈ సంవత్సరం కూడా చిత్తూరు జిల్లా రైతులు తెలుగు గంగ నీటి గురించి మరచి పోవలసినదే. దురదృష్టం ఏమంటే ఇటీవల తిరుపతి మున్సిపాలిటీ తాగునీటి కోసం లక్షలు వ్యయం చేసి కండలేరులో డెడ్ స్టోరేజి నుండి పంపింగ్ చేసుకున్నారు. ప్రస్తుతం వరద వున్న రోజుల్లో జాగ్రత్త పడి కండలేరు నింపుకుంటే ఎంతో వెసులు బాటు వుంటుంది. ఆలాంటి ప్రయత్నాలు అధికారుల నుండి ప్రజా ప్రతినిధులు నుండి ఏవీ జరగడం లేదు.

వి. శంకరయ్య, విశ్రాంత పాత్రికేయులు 9848394013

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*