చిత్తూరు జిల్లాకు కృష్ణ జలాలు ఒక భ్రమ మాత్రమే!

వి.శంకరయ్య 9848394013

హంద్రీనీవా ప్రాజెక్టు నుండి కృష్ణ జలాలు తీసుకు వచ్చి చిత్తూరు జిల్లా పశ్చిమ ప్రాంతంలో బంగారం పంటలు పండే అవకాశం కల్పించుతామని గత రెండేళ్లుగా ముఖ్యమంత్రి మొదలు కొని జిల్లా కలెక్టర్ వరకు ప్రకటనలు గుప్పించుతున్నారు. జిల్లా కలెక్టర్ అయితే ఎన్ని సమీక్ష సమావేశాలు నిర్వహించారో లెక్క లేదు. అయితే క్షేత్రస్థాయి పరిస్థితి ఏ మాత్రం అనుకూలంగా లేదు. అసలే నీళ్లు లేవు. తాజాగా ఈ నెలలో క్రిష్ణ జలాలు వస్తాయని జిల్లా మంత్రి ప్రకటించారు.

అయితే ఎన్ని నీళ్లు వస్తాయి. దీని కథ ఒక సారి పరిశీలించితే ఎవరికైనా విభ్రాంతి కలుగక మానదు. పొలాలకు నీళ్లు అయితే రావు. తుదకు తాగునీరైనా ఇస్తారేమో చూడాలి. అయితే ఎన్నికల మొక్కు మాత్రం చెల్లించుకుంటారు. దౌర్భాగ్యమేమంటే ఈ ఉత్సవాలుకు కొన్ని లక్షల రూపాయలు ప్రజా ధనం మంచి నీళ్ల ప్రాయంగా దుర్వినియోగం చేయ నున్నారు.

2018 ఆగష్టు 16 వ తేదీ నుండి 2019 జనవరి 15 వతేదీ వరకు హంద్రీనీవా ప్రాజెక్టు ద్వారా కేవలం 29.73 టియంసిలు నీరు మాత్రమే పంపింగ్ చేశారు. మల్యాల నుండి జీడి పల్లి జలాశయం వరకు 216 కిలోమీటర్ల కాలువ విస్తరణ పనులు పూర్తి అయివుంటే మరొక 10 టియంసిలు పంపింగ్ జరిగేది. గొంతు ఎండి పోతున్న రాయలసీమకు ఎప్పుడూ అన్యాయమే. ఇదిలా వుంచితే మల్యాల నుండి ఈ ఏడు 29.73 టియంసిలు పంపింగ్ జరిగితే 144 కిలోమీటర్ల వరకు గల కర్నూలు జిల్లాకు 10 టియంసిలు ఇచ్చారు. అనంతపురం జిల్లా సరిహద్దుల వద్దకు వచ్చే సరికి 19.93 టియంసిలు మాత్రమే మిగిలాయి. గమనార్హ మైన అంశమేమంటే గత ఏడాది అనంతపురం జిల్లా కు 25 టియంసిలు ఇవ్వగా ఈ ఏడాది 20 టియంసిలు కూడా ఇవ్వలేదు. అందు వలన అనంతపురం జిల్లాలో నీటికి పోట్లాట సాగు తోంది. ఈ కథ ఆలా వుంచితే చిత్తూరు జిల్లా వ్యధ పరిశీలించుదాం.

చిత్తూరు జిల్లాకు హంద్రీనీవా జలాలు రావాలంటే అనంతపురం జిల్లాలోని గొల్లపల్లి తదుపరి చెర్లో పల్లి జలాశయాల నుండి నీళ్లు రావాలి. మధ్యలో మారాల జలాశయం వున్నాఅది ఆఫ్ లైనులో వుంది. అది చాలా చిన్నది. నీటి సామర్థ్యం 0.465 టియంసిలు మాత్రమే.అందులో ప్రస్తుతం 0.214 టియంసిలు వున్నాయి. గొల్లపల్లి జలాశయం నీటి సామర్థ్యం 1.91 టియంసిలు అయినా జనవరి 15 వతేదికి 0.75 టియంసిలు మాత్రమే వున్నాయి. మొరటు గా చెప్పాలంటే ముక్కాలు టియంసిలు అన్న మాట. పైగా 65 క్యూసెక్కులు పైనుండి వస్తున్నాయి. చిత్తూరు జిల్లా కు నీళ్లు సరఫరా చేసే చెర్లో పల్లి జలాశయం నీటి సామర్థ్యం 1.60 టియంసిలు అయినా ప్రస్తుతం . 0.586 టియంసిలు అంటే అర్థ టియంసిల నీరు వుంది. కాగా గొల్లపల్లి కి 65 క్యూసెక్కులు వస్తుంటే చెర్లో పల్లి కి 240 క్యూసెక్కులు ఇన్ ఫ్లో వుంది.ఈ నీటిని చిత్తూరు జిల్లాకు వదులు తున్నారు.

ఈ గణాంకాలు పరిశీలించితే గొల్లపల్లిలో వుండే ముక్కాలు (0.75)టియంసి చెర్లో పల్లిలో వుండే అర్థ టియంసిలో ఆవిరి పారుదల నష్టం పోగా మొత్తం ఇంచు మించు ఒక టియంసి జలాలు వుండగా ఇందులో అనంతపురం జిల్లాకు ఇవ్వగా చిత్తూరు జిల్లాకు దక్కే నీరు ఎంత? మహా అయితే 0.75 అంటే ముక్కాలు టియంసి ఇవ్వ గలరు. కాని కాలువలు లైనింగ్ లేక పోవడం పారుదల ఆవిరి నష్టం తీసి వేయగా అర్థ టియంసిలు నీరు బలవంతంగా ఈ ఏడు ఇవ్వగలరేమో.

ప్రస్తుతం జీడి పల్లి జలాశయంలో 1.1

9 టియంసిలు వున్నా అనంతపురం అవసరాలు తీరి కిందకు వచ్చే అవకాశం వుండదు.ఈ పరి స్థితి లో కుప్పం కు ఏమేరకు నీరు ఇస్తారో అంతా మిధ్య. అసలు జిల్లాకు నీరు రావడం ఒక భ్రమ మాత్రమే.

చారణా కోడికి బారణా మసాల అన్నట్లు ఈ అతి కొద్ది నీరు జిల్లాకు వచ్చేందుకు ఈ పాటికే జిల్లా కలెక్టర్ ముఖ్య మంత్రి ఎన్ని సమీక్ష సమావేశాలు నిర్వహించారో లెక్క లేదు. కాగా రేపు ఈ ఉత్సవాలకు ఎన్ని లక్షలు వ్యయ మౌతుందో. అదీగాక ముఖ్యమంత్రి సభకు జనాలను తోలేందుకు బస్సులు మళ్లించితే ఎంత మంది ప్రయాణికులు ఎన్ని ఇబ్బందులు పడాలనో. గోడ దెబ్బ చెంప దెబ్బ అంటే ఇదేనేమో.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*