చిత్తూరు జిల్లాకు హంద్రీనీవా ఎండ మావుల్లో నీటిని వెతకడమే? (రెండవ భాగం)

  • పాలకుల నిర్లక్ష్యంకు తోడు కృష్ణమ్మకు 500 కిలోమీటర్ల దూరమే శాపం

చిత్తూరు జిల్లాలో తూర్పు. ప్రాంతం కన్నా పశ్చిమ ప్రాంతంలో ప్రజలు తీవ్ర దుర్భిక్షంతో సాగునీరు అటుంచి తాగునీటికి కూడా కటకటలాడి పోతుంటారు. నైరుతి రుతుపవనాల కాలంలో అడపాదడపా పడే కొద్దిపాటి వర్షాలు తప్ప ఈశాన్య రుతుపవనాల జాడ ఈ ప్రాంతంలో ఏ మాత్రం కన్పించదు. ఈ కాలంలో చలి ఎక్కువగా వుండి వర్షాలు పడవు. భూగర్భ జలాలు అంతంత మాత్రమే. కేవలం వర్షాధారంగా పంటలు సాగు చేస్తుంటారు. ఖరీఫ్ లో పెట్టిన మెట్ట పంటలు కూడా ఒక్క పదిహేను రోజులు చినుకులు పడక పోతే మొలక దశలోనే ఎండిపోతాయి. చెరువుల కింద సాగు కూడా తక్కువగా వుంటుంది. ఒకటి రెండు మధ్య తరహా ప్రాజెక్టులు వున్నా దుర్భిక్షంతో ఎప్పుడూ ఎండి పోయి వుంటాయి.


ఈ దుర్భర పరిస్థితుల్లో హంద్రీనీవా ప్రాజెక్టు ఎన్టీఆర్ హయాంలో ముప్పయి ఏళ్ల క్రితం ప్రతి పాదించ బడితే చచ్చీచెడి గత ఏడాది జిల్లా సరిహద్దుల వరకు కృష్ణ జలాలు వచ్చి ఆగిపోయాయి. రాష్ట్రంలో ప్రభుత్వం మారినా ఈ ఏడాది కూడా అంతకు మించి జిల్లాకు కృష్ణ జలాలు వస్తాయనే నమ్మకం లేదు. వచ్చే సంవత్సరానికీ నమ్మకం పెట్టుకోనక్కర లేదు. ఎందుకంటే కర్నూలు జిల్లా మల్యాల నుండి జీడిపల్లి రిజర్వాయర్ వరకు ప్రధాన కాలువ విస్తరణ లైనింగ్ జరగాలి. అదేవిధంగా అనంతపురం జిల్లా చెర్లో పల్లి జలాశయం నుండి చిత్తూరు జిల్లా వరకు కాలువ లైనింగ్ జరగాలి. పైగ టన్నెల్స్ పూర్తి కావాలి. ఈ రెండు పనులు వచ్చే నీటి సంవత్సరానికి కూడా పూర్తి కావు.

ఇంకా ఈ దుర్దశకు అనేక కారణాలు ఉన్నాయి. కృష్ణ నదికి చిత్తూరు జిల్లా 500 కిలోమీటర్ల దూరంలో వుండటం మొదటి కారణం. రెండు. జలయజ్ఞంలో చేపట్టిన ప్రాజెక్టులన్నీ చిత్తూరు జిల్లాకు చెంది రెండవ దశలో వుండటంతో తొలి దశ పనులే అంతంత మాత్రంగా వున్నపుడు రెండవ దశ పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉండి పోయాయి. ఈ క్రమంలోనే గాలేరు నగరి రెండవ దశ తట్టెడు మట్టి లేకుండా అంగలార్చుతోంది . . మూడు. ఇది నిజంగా చేదుమాత్ర. ఇతర రాయలసీమ జిల్లాలతో పోల్చుకుంటే ఈ జిల్లాలో ఏ రాజకీయ పార్టీ నేతలకు సాగునీటి అవసరాలు పట్టవు. ఈ జిల్లానుండి ముఖ్యమంత్రి గా పని చేసిన చంద్రబాబు నాయుడుకు అంతకన్నా పట్టలేదు. ఇన్ని దురదృష్టాలు వెన్నాడి నందున ఈ దుస్థితి నెలకొంది.

ఇక హంద్రీనీవా పథకం పరిశీలించితే కృష్ణ నది వద్ద మల్యాల ఎత్తిపోతల పాయింట్ నుండి 483 కిలోమీటర్లు కర్నూలు అనంతపురం జిల్లాలో ప్రధాన కాలువ వచ్చిన తర్వాతనే చిత్తూరు జిల్లాకు నీళ్లు వస్తాయి. ఈ మధ్యలో పలు ఎత్తిపోతలు వున్నాయి. దాదాపు 500 కిలోమీటర్ల దూరం కాలువ లో నీళ్లు ప్రవహిస్తుండగా అనంతపురం జిల్లా అవసరాలు పూర్తిగా తీర్చకుండా వున్న నేపథ్యంలో చిత్తూరు జిల్లాకు నీళ్లు తరలించడం జలవనరుల శాఖకు కత్తిమీద సామే. అంతెందుకు? నీటికి కరవు లేని కృష్ణ డెల్టాలో చివర ఆయకట్టుకు నీరు అందలేదనే వార్తలు మనకు తెలుసు. పైగా కర్నూలు అనంతపురం జిల్లాలో కూడా అచ్చట రైతుల అవసరాలు తీర్చే విధంగా ఈ పథక నిర్మాణం పూర్తి కాలేదు.

హంద్రీనీవా పథకం అనంతపురం జిల్లాలో 216 కిలోమీటర్లలో గల జీడిపల్లి వరకు ఫేస్ ఒకటిగా నిర్మాణం చేపట్టారు. 14 టియంసిల నీరు కేటాయించారు. ఫేస్ రెండు అచ్చట నుండి మొదలై చిత్తూరు జిల్లాలో ఆఖరౌతుంది. 26 టియంసిల నీరు కేటాయించారు. అంటే అనంతపురం జిల్లాలో కొంత భాగం చిత్తూరు కడప జిల్లాలో ఫేస్ రెండుగా ఈ పథకం వుంటుంది. గాని కడప జిల్లా ఊసే ఇంతవరకు పట్టించుకోలేదు. .

ఫేస్ ఒకటిలో 2.973 టియంసిల నీటి నిల్వ సామర్థ్యంతో కృష్ణగిరి, పత్తికొండ, జీడిపల్లి మూడు రిజర్వాయర్ లు నిర్మించారు. ఫేస్ రెండులో మొత్తం నీటి నిల్వ సామర్థ్యం 5.572 టియంసిలతో అనంతపురం జిల్లాలో గొల్లపల్లి చెర్లోపల్లి మారాల(3.503), కడపజిల్లాలో (0.980) శ్రీనివాసపురం(ఇంత వరకు దీని ఊసే లేదు), చిత్తూరు జిల్లాలో అడవి పల్లి(1.089) అయిదు రిజర్వాయర్లు ప్రతిపాదించారు. గమనార్హమైన అంశమేమంటే ఈ 30 సంవత్సరాల కాలంలో అనంతపురం జిల్లాలోని చెర్లోపల్లి రిజర్వాయర్ వరకు కూడా పనులు అరకొరగా జరిగాయి. ఇటీవల కాలంలో ఈ పథకం కుప్పం వరకు పొడిగించి నందున చంద్రబాబు నాయుడు చెర్లోపల్లి నుండి పనులు వేగవంతం చేసి ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని గత నవంబర్ లో జిల్లా సరిహద్దుల వరకు నీళ్లు తీసుకు వచ్చారు. అదే సమయంలో అనంతపురం జిల్లాలో కొందరు తమ అవసరాలు తీర్చకుండా కిందకు నీళ్లు తీసుకు వెళ్లుతున్నారని ధర్నాలు చేశారు. ఈ సంవత్సరం కూడా ఇవి తప్ప వేమో.

చిత్తూరు జిల్లాలో అడవి పల్లి జలాశయ నిర్మాణం అరకొరగా వుంది. అది పూర్తి అయితేనే ఈ కాలువ నీవా నదితో అనుసంధానం జరుగుతుంది. వాస్తవంలో తుంగభద్ర పాలారు నదుల అనుసంధానం దృష్టిలో పెట్టుకొని శ్రీ రామకృష్ణయ్య ఈ పథకం రూపకల్పన చేశారు. అయితే ఈ రెండు నదులు అంతర్ రాష్ట్ర నదులు కాబట్టి ఇతర రాష్ట్రాలు అభ్యంతరాలు పెడతాయని…. తుంగభద్ర ఉపనది హంద్రీ, పాలారు ఉప నది నీవా రెండు పేర్లు కలిపి పెట్టి ఇతర రాష్ట్రాల నుండి అభ్యంతరాలు లేకుండా శ్రీ రామకృష్ణయ్య జాగ్రత్త పడ్డారు. దురదృష్టం ఏమంటే ఈ పథకం శ్రీ రామకృష్ణయ్య ఆశించినట్లు నీవా నదితో కలిసే అవకాశాలు ఇప్పట్లో కన్పించడం లేదు. ఇప్పుడు అసలు విషయాని కొద్దాం.

ప్రస్తుతం మల్యాల నుండి 2,026 క్యూసెక్కులు నీరు మాత్రమే ఎత్తిపోతలు సాగిస్తున్నారు. ఈ నెల 5 వ తేదీ ప్రభుత్వం గణాంకాల ప్రకారం 216 కిలోమీటర్లలో గల జీడిపల్లి రిజర్వాయర్ కు 800 క్యూసెక్కులు మాత్రమే వస్తున్నాయి. మిగిలిన నీరు కర్నూలు జిల్లాలో ఉపయోగిస్తున్నారు. జీడిపల్లి నుండి 1,100 క్యూసెక్కులు కిందకు వదులుతున్నారు. మధ్యలో వుండే గొల్లపల్లి రిజర్వాయర్ నీటి నిల్వ సామర్థ్యం 1.61 టియంసిలు కాగా ప్రస్తుతం 1.02 టియంసిలు మాత్రం నీళ్లు వున్నాయి. ఆ తర్వాత మారాల జలాశయం వున్నా అది ఆఫ్ లైన్ లో వుంది. ప్రధాన కాలువతో దానికి సంబంధం లేదు. వాస్తవంలో చిత్తూరు జిల్లాకు హంద్రీనీవా జలాలు రావాలంటే అనంతపురం జిల్లా కదిరి సమీపంలో గల చెర్లో పల్లి జలాశయం నుండి నీళ్లు రావలసి వుంది.

చెర్లోపల్లి జలాశయం నీటి నిల్వ సామర్థ్యం 1.425 టియంసిలు. ప్రభుత్వం గణాంకాల ప్రకారం ఈ నెల 5వ తేదీ నాటికి కేవలం 0.63 టియంసిలు నీరు మాత్రం వున్నది. మరో విశేషమేమంటే పైనుండి కేవలం 220 క్యూసెక్కులు నీరు వచ్చి చేరుతోంది. కిందకు నీళ్లు వదలడం లేదు. ఈ పరిస్థితుల్లో చిత్తూరు జిల్లాకు హంద్రీనీవా నీళ్లు ఏలా తీసుకువస్తారు? అక్కడ నుండి కిందకు ఒక్క చుక్క నీరు వలడంలేదు. ఈ పరిస్థితుల్లో నవంబర్ 15 తేదీకి కాదు కదా ఆఖరుకు కూడా హంద్రీనీవా జలాలు చిత్తూరు జిల్లా వచ్చే అవకాశం లేదు. ఒక వేళ మంత్రి రామచంద్రారెడ్డి ఎంత ప్రయత్నించినా ఏడాది కన్నా ఒక్క బొట్టు అధికంగా అదీ జిల్లా సరిహద్దుల వరకు తరలించ లేరు. కాగా హంద్రీనీవా ఫేస్ రెండులో 4 ,04, 500 ఎకరాలకు సాగునీరు ఇవ్వాలని పథకం రూప కల్పన చేశారు. ఇందులో అనంతపురం జిల్లాలో 2,27,000 ఎకరాలు, కడప జిల్లాలో 37, 500 ఎకరాలు, చిత్తూరు జిల్లాలో 1,40,000 ఎకరాలకు సాగునీరు అందించేందుకు పథకం రూపొందించినా అంతా కూడా కాగితాలకే పరిమితం అయింది.

  • వి.శంకరయ్య, విశ్రాంత పాత్రికేయులు

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*