చిత్తూరు జిల్లాలోని సహకార చక్కెర కర్మాగారాలు గుర్తు రాలేదా- ముఖ్యమంత్రి గారూ..!

చిత్తూరు జిల్లాలోని ప్రైవేటు చెక్కర ఫ్యాక్టరీలకు రు. 47.54 కోట్ల పన్ను రాయితీలు ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు తాను అధికారంలోనికి వచ్చినప్పటి నుండి మూతపడిన సహకారరంగంలో గల చిత్తూరు రేణిగుంట చక్కెర కర్మాగారాలు గుర్తురాకపోవడం ఆశ్చర్యమేమీ కాదు.

ముఖ్యమంత్రి స్వతహాగా వ్యవసాయాధారిత పరిశ్రమలకు బ‌ద్ద వ్య‌తిరేకి. గుత్త పెట్టుబడుదారులు నిర్మించే ఫ్యాక్టరీలు వేపే ఆయన మొగ్గు చూపుతున్నారు. గతంలో 9 ఏళ్లు ముఖ్యమంత్రిగా వున్న సమయంలో నష్టాలు వస్తున్నాయని పేరు చెప్పి తెలంగాణలోని నిజాం షుగర్ ఫ్యాక్టరీని అమ్మేయడం అందరికి తెలుసు. అంతే కాదు. ప్రభుత్వ రంగ అన్నా ముఖ్యమంత్రి కి గిట్టదు. అందుకే రాష్ట్రంలో విద్య వైద్య రంగాలు పూర్తిగా ప్రైవేటు పరం చేశారు. తుదకు చిత్తూరులోని జిల్లా ఆసుపత్రి అపోలోకు అప్పగించారు. భవిష్యత్తులో మంత్రి పదవులు తప్ప మిగతా అంతా ప్రైవేటు పరం చేసినా ఆశ్చర్యం ఏమీ కాదు.

ఒకప్పుడు చిత్తూరు సహకార చక్కెర కర్మాగారం రాష్ట్రంలో నెంబర్ వన్ గా వుండేది. కారణాలు ఏవైనా అందరూ కలిసి నష్టాల బాట పట్టించారు. ఇది గతం.2014 వరకు మూత పడుతూ తిరిగి తెరిచి పనిచేస్తున్న అంశం కొత్త కాదు.

2014 లో తెలుగుదేశం పార్టీ అధికారంలోనికి వచ్చే సమయానికి సహకార రంగంలో గల చిత్తూరు రేణిగుంట రెండు ఫ్యాక్టరీలు కుంటి నడక నడుస్తుండగా వెంటనే మూత వేయించారు. కొందరు టిడిపి నేతలు ముఖ్యమంత్రిని కలసి రాష్ట్ర ప్రభుత్వం కొంత ఆర్థిక సాయం చేసి తోడుగా ప్రభుత్వం హామీ ఇస్తే జాతీయ సహకార అభివృద్ధి సంస్థ రుణం ఇస్తుందని ఫ్యాక్టరీలు నిర్వహించ వచ్చిని కోరారు. అయినా ముఖ్యమంత్రి అంగీకరించ లేదని ఆ రోజుల్లో ప్రైవేటు చర్చల్లో జిల్లా టీడీపీ నేతలు ఆవేదన వెలుబుచ్చిన అంశం కొందరికి తెలుసు.

సహకార రంగంలో గానీ ప్రభుత్వరంగంలో గానీ ఏ సంస్థ వుండ కూడదన్న‌ ఆయన విధానమే ఇందుకు కారణం. కాకుంటే బిజెపితో అంటకాగిన నాలుగేళ్ల కాలంలో ఏ నాడైనా మన్నవరం ఫ్యాక్టరీ గురించి కేంద్ర వద్ద మాట్లాడిన సందర్భం ఉందా? మన్నవరం వద్ద భూములు పడావుగా పడివుండగా శ్రీ కాళహస్తి నియోజకవర్గంలో దళితులు నిరు పేద రైతులను డికెటి భూముల పేరుతో30 వేల ఎకరాల నుండి వెళ్ల గొట్టిన పాపం రేపు కట్టి కుడపక మానదు.

2014 లో టిడిపి అధికారంలోకి వచ్చే సమయంలో జిల్లాలో 46839 హెక్టార్లలో చెరకు సాగు విస్తీర్ణం వుంటే 2017-18 నాటికి 35363 హెక్టార్లకు పడిపోయింది. వాస్తవంలో అన్ని పంటల కన్నా చెరుకు సాగు లాభ దాయక మైన పంట. జిల్లాలోనే కాదు. జాతీయస్థాయిలోకూడా అన్ని పంటల కన్నా లాభ దాయకంగా వుంటుంది. అన్నీ తెలిసి ముఖ్యమంత్రి జిల్లాలోని చెరుకు సాగు చేసే రైతుల నడ్డి విరిచారు. రైతులు పూర్తిగా ప్రైవేటు ఫాక్టరీలపై ఆధార పడు నట్లు చేయడంతో ఎక్కువ మంది రైతులు చెరకు సాగు చేయడం మానేశారు.

ముఖ్యమంత్రి పదవి చేపట్టిన చంద్రబాబు ఈ మధ్య కాలంలో జిల్లాలో ఉత్పత్తేతర వ్యయానికి ఖర్చు చేసిన నిధులలో పాతిక శాతం ఈ రెండు ఫ్యాక్టరీల పునరుద్దరణకు వ్యయంచేసి వుంటే జిల్లాలోని ఈ రెండు ఫ్యాక్టరీలు పని చేసేటివి. వేలాది మంది రైతులకు మేలు జరిగేది. ఆ దిశగా ముఖ్యమంత్రి ఆలోచనలు లేవు. తుదకు స్వతంత్రంగా చెరుకు సాగు చేసి జీవనం గడిపే రైతు కుటుంబాలకు చెందిన మహిళలు సెల్ ఫోన్ కంపెనీలో పగలు రాత్రి లేకుండా కార్మికులుగా పని చేయ వలసిన దుస్థితి కల్పించ బడింది. అంతేకాదు. ఈ రెండు ఫ్యాక్టరీలకు చెంది కోట్లాది రూపాయల ఆస్తులు వున్నాయి. విలువ కలిగిన ఈ భూములు ఎవరు కారు చౌకగా కొట్టే స్టారో భవిష్యత్తు తేల్చ వలసి వుంది.

జిల్లాలోని ప్రైవేటు చెక్కర ఫ్యాక్టరీలకు పన్ను రాయితీలను ఈ ప్రభుత్వం ఇచ్చింది గానిరైతులకు అండగా వుండే సహకార చక్కెర కర్మాగారాలు తిరిగి పని చేసేందుకు ఇచ్చ గించలేదు.

                                                                                            – వి.శంక‌ర‌య్య‌, 9848394013

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*