చిత్తూరు జిల్లా సాగునీటి ప్రాజెక్టులు యథాతథంగా పూర్తిచేయాలి

 • మిషన్‌ శ్రీకృష్ణదేవరాయ పేరుతో జిల్లాలో చెరువుల అభివృద్ధికి ప్రత్యేక పథకాన్ని ప్రకటించాలి
 • చిత్తూరు జిల్లా సాగునీటి అవసరాలు-ఆకాంక్షలు సమావేశం డిమాండ్‌

సాగునీరు పరంగా రాయలసీమలోని అన్ని జిల్లాల కంటే తీవ్రంగా నష్టపోతోంది చిత్తూరు జిల్లా. ఒక టిఎంసి నదీ జలాలు కూడా నోచుకోని జిల్లాలో సాగునీటికే కాదు…రానురానూ తాగునీటికీ కటకటలాడాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. తిరుపతి వంటి ప్రాంతాల్లోనూ తాగునీటి ఎద్దడి తలెత్తింది.

దశాబ్దాల పాటు ఎదురుచూసిన హంద్రీ-నీవా కాలువ ఎట్టకేలకు…పడమటి మండలాలకు వచ్చినా…కాలువల్లో నీళ్లు మాత్రం లేవు. హంద్రీ-నీవాకు విడుదల చేస్తున్న జలాలు అనంతపురం అవసరాలు తీరి జిల్లాలోకి రాలేని పరిస్థితి. ఇక తూర్పు మండలాలకు వరప్రసాదినిగా భావించే గాలేరు-నగరి ప్రాజెక్టు రెండో దశ అతీగతీ లేకుండాపోయింది. ఆ ప్రాజెక్టును కడప జిల్లా వరకే పరిమితం చేసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. మూడున్నర దశాబ్దాలైనా తెలుగుగంగ పూర్తికాలేదు. ఒక మాటలో చెప్పాలంటే ఒక సాగునీటి ప్రాజెక్టు కూడా సంపూర్ణం కాలేదు.

ఇక జిల్లాలో వంద ఎకరాలకుపైగా ఆయకట్టు కలిగిన చెరువులు 700 ఉన్నాయి. వంద ఎకరాల కంటే తక్కువ ఆయకుట్ట కలిగిన చెరువులు 6000కుపైగా ఉన్నాయి. వీటి కింద 3 లక్షల ఎకరాల ఆయకట్టు ఉన్నట్లు చూపుతున్నా….ఇందులో సగానికిపైగా చెరువులు కనుమరుగయ్యాయి. ఉన్నవాటి సప్లై ఛానళ్లు ఆగ్రమణకు గురికావడంతో వాటిలోకి నీళ్లు రావడం లేదు. దీంతో చెరువుల కింద ఉన్న ఆయకట్టుకు నీళ్లులేని దుస్థితి. అంతిమంగా వ్యవసాయానికి బోర్లు తప్ప….మరోమార్గం లేని పరిస్థితి ఏర్పడింది.

ఈ నేపథ్యంలో ఇక్కడి మేధావులు, ఆలోచనాపరుల్లో ఆందోళన తీవ్రమవుతోంది. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి జిల్లాకు సాగునీరు, తాగునీరు సాధించుకోవాలన్న ఆలోచన మొదలయింది. రాయలసీమ అధ్యయనాల సంస్థ అధ్యక్షులు భూమన్‌ నేతృత్వంలో శుక్రవారం తిరుపతి యూత్‌ హాస్టల్‌లో ‘చిత్తూరు జిల్లా తాగునీటి అవసరాలు – ఆకాంక్షలు’ అనే పేరుతో రౌండ్‌టేబుల్‌ సమావేశం జరిగింది. ఇటు శ్రీకాళహస్తి, నగరి, అటు బి.కొత్తకోట, మదనపల్లె, పలమనేరు ప్రాంతాల నుంచి పలువురు ప్రజాసంఘాల నేతలు, సామాజిక కార్యకర్తలు, రాజకీయ పార్టీల నేతలు సమావేశంలో పాల్గొన్నారు.

ఈ సమావేశం పలు తీర్మానాలు చేసింది.

 1. చిత్తూరుకు జిల్లాకు హామీ ఉన్న హంద్రీ-నీవా, గాలేరు-నగరి, తెలుగుగంగ ప్రాజెక్టులను యథాతధంగా, యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలి.
 2. తుంగభద్ర నీటితో ఒక సమాంతర కాలువను చిత్తూరు వరకు వచ్చేలా చర్యలు తీసుకోవాలి.
 3. చిత్తూరు జిల్లాలోని అన్ని చెరువుల అభివృద్ధి కోసం మిషన్‌ శ్రీకృష్ణదేవరాయ పేరుతో ఒక ప్రత్యేక ప్రాజెక్టు చేపట్టాలి.
 4. తిరుపతికి వస్తున్న లక్షలాది యాత్రీకులను దృష్టిలో ఉంచుకుని కండలేరు నుండి తిరుపతిలోని బాలాజీ రిజర్వేయర్‌కు 5 టిఎంసిల నీటిని తీసుకురావాలి.
 5. శ్రీశైలం నుంచి చిత్తూరు జిల్లాకు నీరు రావడానికి ఆటంకంగా ఉన్న జిఓ నెం.69ను రద్దు చేయాలి. శ్రీశైలంలో నీటిమట్టం 854 అడుగులు ఉంచాలి.
 6. పోతిరెడ్డిపాడు సామర్థ్యాన్ని 90,000 క్యూసెక్కులకు పెంచాలి.
 7. ఈ డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడానికి….సెప్టెంబర్‌లో రచ్చబండ కార్యక్రమంలో భాగంగా జిల్లాకు రానున్న ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డిని కలిసి వినతిపత్రం సమర్పించాలి.
 8. చిత్తూరు జిల్లాలోని జర్నలిస్టులు, పార్టీలు, ప్రజాసంఘాల నేతలు, రైతు సంఘాల నేతలు, కవులు, రచయితల్లో జల చైతన్యం కలిగించడం కోసం ‘జల చైతన్య యాత్ర’ పేరుతో యాత్ర చేపట్టి అన్ని సీమలోని అన్ని ప్రాజెక్టులు సందర్శించాలి.
 9. కండలేరు నుండి కుశసప్థలి, కుశస్థలి నుంచి నీవా నది వరకు పాదయాత్ర చేపట్టాలి.

ఈ సమావేశంలో సీనియర్‌ జర్నలిస్టు శంకరయ్య, రైతు నాయకులు మాంగాటి గోపాల్‌ రెడ్డి, సిపిఎం నేతలు .పుల్లయ్య, కందారపు మురళి, సిపిఐ నేత పెంచలయ్య, సిపిఐ(ఎంఎల్‌) హరిక్రిష్ణ, వెంకటరత్నం, ఆర్పీఐ నాయకులు అంజయ్య, తెలుగుదేశం నుంచి నరసింహయాదవ్‌, బిజెపి నుంచి సామంచి శ్రీనివాస్‌, రాయలసీమ మేధావుల ఫోరం పురుషోత్తం రెడ్డి, రాయలసీమ పోరాట సమితి నేత నవీన్‌ కుమార్‌ రెడ్డి, ఆర్‌ఎస్‌పి నేత బాలాజీ, అధ్యాపకులు చక్రవర్తి గోవిందరాజులు, సీనియర్‌ జర్నలిస్టులు రాఘవశర్మ, పివి రవికుమార్‌, ఎన్.బి.సుధాకర్ రెడ్డి, పాశం జనార్థన్ నాయుడు పాల్గొన్నారు.

 • ఆదిమూలం శేఖర్‌, సంపాదకులు, ధర్మచక్రం వారపత్రిక

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*