చిత్తూరు పాల డెయిరీపై శ్రీవారి కటాక్షం..!

  • మూతపడిన డెయిరీ తెరిచే యోచనలో టిటిడి
  • లడ్డూలు, ప్రసాదాల తయారీకి అవసరమయ్యే నెయ్యిని, పాలను సొంతంగా సమకూర్చుకునే ఆలోచన
  • డిపిఆర్‌ తయారు చేయాల్సిందిగా అధికారులకు బోర్డు ఆదేశాలు

ఒకప్పుడు దేశంలోనే రెండో స్థానంలో ఉంటూ, చిత్తూరు జిల్లా పాడి రైతులకు ఆలంబనగా నిలిచి, ఆ తరువాత మూతపడి, ఏళ్ల తరబడి కునారిల్లుతున్న చిత్తూరు పాల డెయిరీపై తిరుమల శ్రీవారి కరుణా కటాక్షాలు ప్రసరించేలా ఉన్నాయి. ఈ డెయిరీని స్వాధీనం చేసుకుని, పున: ప్రారంభించే బాధ్యతను చేపట్టాలన్న మహత్తరమైన ఆలోచనలో టిటిడి ఉంది. చిత్తూరు డెయిరీని టేక్‌ ఓవర్‌ చేసి, నిర్వహించడానికి ఉన్న అవకాశాలపై డిపిఆర్‌ (డిటైల్డ్‌ ప్రాజెక్టు రిపోర్టు) తయరు చేయాల్సిందిగా గత నెలలో జరిగిన పాలక మండలి సమావేశం అధికారులను ఆదేశించింది.

చిత్తూరు జిల్లా ప్రజలకు వ్యవసాయం తరువాత పాడి పరిశ్రమ జీవనాధారంగా ఉంది. జిల్లాలో రోజూ దాదాపు 40 లక్షల లీటర్ల పాలు ఉత్పత్తి అవుతున్నాయి. పాల రైతులను ఆదుకోడానికి ఒకప్పుడు సహకార రంగంలో చిత్తూరు పాల డైరీని ప్రారంభించారు.

అప్పట్లో రోజుకు రెండు లక్షల లీటర్ల పాలను సేకరిస్తూ, గుజరాత్‌ ఆనంద్‌ డైరీ తరువాత దేశంలోనే రెండో అతిపెద్ద డైరీగా ఉండేది. ఆ తరువాతి కాలంలో హెరిటేజ్‌ వంటి ప్రైవేట్‌ డైరీల పుణ్యమా అని చిత్తూరు సహకార డైరీ మూతపడింది. ఈ డెయిరీని తెరిపించాలంటూ రైతులు చేయని ఉద్యమాలు లేవు. వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి ముఖ్యమంత్రి అయినపుడు కొంత ప్రయత్నం జరిగినా ఫలించలేదు.

ఇదిలావుండగా…మొన్నిటి ఎన్నికల ప్రచారం సందర్భంగా వైసిపి అధినేత జగన్‌ మోహన్‌ రెడ్డి చిత్తూరు జిల్లాకు వచ్చినపుడు….పాడి రైతులను ఆదుకుంటామని చెప్పారు. సహకార డైరీలకు పాలు సరఫరా చేసే రైతులకు లీటరుకు రూ.2 బోనస్‌గా ఇస్తామని హామీ ఇచ్చారు. ఈ క్రమంలో చిత్తూరు డైరీని తెరిపించాలని స్థానిక రైతులు కోరారు.

ఇదిలావుండగా…ఇదే జిల్లాలోని తిరుమల తిరుపతి దేవస్థానం….పాలను, నెయ్యిని విరివిగా ఉపయోగిస్తోంది. శ్రీవారి లడ్డూల తయారీ కోసం ఏడాదికి 40 లక్షల కిలోల ఆవు నెయ్యి వినియోగిస్తోంది. అదేవిధంగా అన్న ప్రసాదాల తయారీ కోసం ఏడాదికి ఒకటిన్నర లక్షల కిలోల నెయ్యిని వాడుతోంది. మొత్తంగా నెయ్యి కోసమే టిటిడి రూ.125 కోట్లకుపైగా ఖర్చు చేస్తోంది. దీనికి తోడు….అన్నప్రసాద వితరణ కేంద్రానికి, టిటిడి నిర్వహిస్తున్న విద్యాసంస్థలకు, తిరుమల క్యూలైన్లలోని భక్తులకు ఇవ్వడానికి రోజూ వేల లీటర్ల పాలు సేకరిస్తోంది. దీనికీ కోట్ల రూపాయలు వ్యయం చేస్తోంది.

ఇప్పటిదాకా టిటిడి తనకు అవసరమైన పాలు, నెయ్యిని టెండర్ల ద్వారా డైరీల నుంచి సేకరిస్తోంది. అయితే…టిటిడి సొంతంగా డైరీని ఏర్పాటు చేసుకుని పాలు, నెయ్యి సమకూర్చుకుంటే ఎలావుంటుందన్న ఆలోచన చేస్తోంది. టిటిడికి గోసంరక్షణ శాల కూడా ఉంది. దీనికి అనుబంధంగా డైరీని నిర్వహించాలని యోచిస్తోంది. తిరుపతిలోని గోసంరక్షణ శాలను పలమనేరులో 450 ఎకరాల సువిశాల ఆవచణకు మార్చబోతోంది. ఈ క్రమంలోనే….చిత్తూరు పాల డైరీని టేక్‌ ఓవర్‌ చేయాలని భావిస్తోంది.

గతంలో ధర్మచక్రం ఇదే సూచన చేసింది. టిటిడినే డైరీ ఏర్పాటు చేస్తు ఉభయతారకంగా ఉంటుందని తన కథనాల్లో వివరించింది. పాడి రైతులను ఆదుకోవడంతో పాటు టిటిడికి నాణ్యమైన నెయ్యి అందుబాటులోకి వస్తుంది. ఆలస్యంగానైనా టిటిడి సరైన ఆలోచన చేస్తోంది. ఇది కచ్చితంగా చిత్తూరు జిల్లా పాడి రైతాంగాన్ని శుభవార్తే అవుతుంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*