చిల్లర సమస్యకు నోట్లతో పరిష్కారం..! ధర్మారెడ్డి వినూత్న ఆలోచన..!

వడ్డీకాసుల వాడిగా పిలవబడే తిరుమల వెంకన్నకు ఆ కాసులే పెద్ద తలనొప్పిగా మారుతున్నారు. గుట్టలుగా పడుతున్న చిల్లర నాణేలను బ్యాంకుల్లో డిపాజిట్‌ చేయడమూ కష్టమవుతోంది. చిల్లర నాణేలను బ్యాంకులు తీసుకోకపోవడంతో రూ.20 కోట్ల విలువైన నాణేలు టిటిడి ట్రెజరీలో గుట్టగాపడివున్నాయి.

తిరుమల శ్రీవారికి హుండీ ద్వారా కానుకల రూపంలో రోజూ రూ.2.50 కోట్ల నుంచి రూ.3 కోట్ల వస్తుంటుంది. ఇందులో చిల్లర నాణేలను మూటలుగా కట్టి తిరుపతికి తరలించి చిల్లర పరకామణిలో లెక్కిస్తుంటారు. ఆ తరువాత బ్యాంకుల్లో డిపాజిట్‌ చేస్తారు. నెలకు చిల్లర నాణేల రూపంలో రూ.5 కోట్లు వస్తున్నట్లు చెబుతున్నారు.

గతంలో పలు బ్యాంకులు ఈ చిల్లరను తీసుకెళ్లేవి. టిటిడి అకౌంట్‌లో జమ చేసేవి. ఆ తరువాత చిత్తూరు జిల్లాకు లీడ్‌ బ్యాంకుగా ఉన్న ఆంధ్రాబ్యాంకులో మాత్రమే చిల్లర జమ చేయాలని రిజర్వు బ్యాంకు సూచించింది. దీంతో చాలాకాలంగా ఆంధ్రబ్యాంకులో చిల్లర జమ చేస్తూ వస్తున్నారు. అయితే…తమ బ్యాంకులో చిల్లర నిల్వవుంచుకోడానికి స్థలం లేదంటూ….2018 ఏప్రిల్‌ నుంచి చిల్లర నాణేలను తీసుకెళ్లడాన్ని ఆంధ్రాబ్యాంకు ఆపేసింది.

ఈ విషయాన్ని ఆర్‌బిఐకి తెలియజేసినా స్పందన లేదు. దీంతో 2018 నుంచి ఇప్పటిదాకా 49 వేల బ్యాగులు నాణేలు టిటిడి ఖజానాలో నిల్వవుండి పోయాయి. వీటి విలువ రూ.20 కోట్లు. ఇంత మొత్తం టిటిడి వద్దే ఉండిపోవడం వల్ల ఇప్పటిదాకా వడ్డీ రూపంలో రూ.80 లక్షల మేర టిటిడి నష్టపోయింది.

ఈ నేపథ్యంలో పరకామణిలో పోగుబడే చిల్లర నాణేలను తాము తీసుకెళ్లి టిటిడి అకౌంట్‌లో జమ చేస్తామని ఫెడరల్‌ బ్యాంకు ముందుకొచ్చింది. అయితే…చిల్లర తరలించడానికి అయ్యే ఖర్చులకు గాను, తరలించిన మొత్తంలో 5 శాతం ఇవ్వాలని కోరింది. అంటే రూ.20 కోట్లకు రూ.10 లక్షలు దాకా ఇవ్వాల్సి వుంటుంది. అదీ ఏప్రిల్‌ 1, 2019 నుంచి దశలవారీగా నాణేలు తరలించడానికి అంగీకరించారు.

ఆ బ్యాంకు కూడా బలవంతంగా నాణేలను తీసుకెళుతోంది. ఈ నేపథ్యంలో తిరుమల ప్రత్యేక అధికారిగా వచ్చిన ధర్మారెడ్డి వినూత్న ఆలోచన చేశారు. చిల్లర నాణేలు తీసుకునే బ్యాంకుల్లోనే నోట్లు డిపాజిట్‌ చేస్తామని షరతు విధించారు. టిటిడి డిపాజిట్ల కోసం బ్యాంకులు వెంపర్లాడుతుంటాయి. ఎందుకంటే రోజూ ఇంత మొత్తంలో నగదు పోగయ్యే సంస్థలు లేవు. అందుకే…డిపాజిట్ల కోసం బ్యాంకులు పోటీ పడుతుంటాయి. వడ్డీ ఎక్కువగా ఇస్తామంటూ ఆఫర్లు ఇస్తుంటాయి. నోట్లు తీసుకోడానికి ఇష్టపడే బ్యాంకులు చిల్లర నాణేలు తీసుకోడానికి మాత్రం ఇష్టపడటం లేదు. ఈ నేపథ్యంలో చిల్లర నాణేలు తీసుకునే బ్యాంకులకే నోట్లు కూడా ఇస్తామన్న కొత్త నిబంధనను ముందుకు తెచ్చారు ధర్మారెడ్డి. ఉదాహరణకు కోటి రూపాయల డిపాజిట్‌ కావాలంటే….అంతే మొత్తంలో చిల్లర నాణేలనూ ఆ బ్యాంకు తీసుకోవాలన్నమాట. ఈ నిర్ణయం వల్ల నాణేల సమస్య పరిష్కారం అవుతుందనడంలో సందేహం లేదు.

చిల్లరను నెలల తరబడి పరకామణిలోనే గుట్టలుగా వేసుకోవడం వల్ల నెలనెలా లక్షల రూపాయల వడ్డీ నష్టపోవాల్సి వస్తోంది. తాజా నిర్ణయం వల్ల ఎప్పటి చిల్లర అప్పుడు బ్యాంకులకు చేరిపోతుంది. తెలివైన నిర్ణయం తీసుకున్న తిరుమల స్పెషల్‌ ఆఫీసర్‌ ధర్మారెడ్డిని ధర్మచక్రం అభినందిస్తోంది.

ఆదిమూలం శేఖర్‌, ఎడిటర్‌, ధర్మచక్రం వారపత్రిక

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*