చివరంజీవి కుటుంబం జనసేనతోనేనా?

ప్రజారాజ్యం పార్టీ స్థాపించి, ఒక ఎన్నికను మాత్రమే ఎదుర్కొన్ని, ఆఖరికి పార్టీని నడపలేక కాంగ్రెస్‌లో విలీనంచేసి, మంత్రి పదవి చేపట్టి, ప్రస్తుతం ఆ పార్టీలో ఉన్నారో లేదో కూడా తెలియకుండా ఉన్న సనీనటుడు చిరంజీవి రాజకీయ భవిష్యత్తుపై అందరిలోనూ ఆసక్తివుంది. పవన్‌ కల్యాణ్‌ స్థాపించిన జనసేనలో పనిచేస్తారా లేక కాంగ్రెస్‌లోనే కొనసాగుతారా అనేదానిపై స్పష్టత రాలేదు. చిరంజీవి ప్రజారాజ్యం స్థాపించినపుడు ఆయన ఇద్దరు తమ్ముళ్లు నాగబాబు, పవన్‌ కల్యాణ్‌ పార్టీ కోసం తీవ్రంగా శ్రమించారు. చిరంజీవి మామ అల్లు అరవింద్‌ కూడా చిరంజీవితోనే ఉన్నారు. ఒక మాటలో చెప్పాలంటే మెగా ఫ్యామిలీ మొత్తం చిరు వెనుక నడిచింది.

ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్‌లో విలీనం చేయడాన్ని జీర్ణించుకోలేకపోయిన పవన్‌ కల్యాణ్‌ అన్న చిరంజీవితో విభేదించినట్లు వార్తలొచ్చాయి. ఆ తరువాత ఆయన సొంతంగా పార్టీని స్థాపించారు. చిరంజీవితో కుటుంబ సంబంధాలు కూడా తెగిపోయాయన్న ప్రచారం జరిగింది. వాస్తవంగా కూడా పవన్‌ కల్యాణ్‌ చిరంజీవితో అంటీముట్టనట్లే ఉంటున్నారు. ఏదో సినిమా ఫంక్షన్లలో కలుసుకోవడం మినహా రోజువారీ రాకపోకలు సాగుతున్నట్లు కనిపించదు. పవన్‌ కల్యాణ్‌ పూర్తి స్థాయి రాజకీయాల్లోకి వచ్చిన తరువాత కూడా చిరంజీవి, నాగబాబు తమ మనోగతం ఏమిటో ప్రకటించలేదు.

తాజా పరిణామాలు చూస్తుంటే….చిరంజీవి సహా మెగా కుటుంబం మొత్తం పవన్‌కు బాసటగా నిలిచే సూచనలు కనిపిస్తున్నాయి. శ్రీరెడ్డి వ్యవహారంతో తెరపైకి వచ్చిన నాగబాబు…పవన్‌కు కొండంత అండగా నిలబడ్డారు. తెలుగు సినిమాల్లో లైంగిక వేధింపులపై పోరాడుతున్న శ్రీరెడ్డి….అదుపుతప్పి పవన్‌ కల్యాణ్‌పై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఈ పరిస్థితుల్లో నాగబాబు నేరుగా తెరపైకి వచ్చారు. ‘మా కుటుంబం జోలికి రాకండి…తేలిగ్గా మాట్లాడకండి’ అంటూ గట్టి హెచ్చరిక జారీ చేశారు. ‘మా తమ్ముడు కోట్లు సంపాదించే అవకాశాన్ని వదులుకున్ని…మంచి పని కోసం జనంలోకి వెళ్లిపోయాడు…అతన్ని ఇబ్బంది పెట్టడానికి మా కుటుంబాన్ని లాగకండి..’ అని ఘాటుగా మాట్లాడారు. నాగబాబు మాట్లాడిన ప్రతిమాటలోనూ మెగా ఫ్యామిలీ మొత్తం పవన్‌తో ఉందన్న అర్థం వచ్చేలావుంది. రాంచరణ్‌ నటించిన రంగస్థలం విజయోత్సవ సభకు పవన్‌ హాజరవడం కూడా గనమించదగ్గ పరిణామం.

ప్రస్తుతం పవన్‌కు మెగా ఫ్యామిలీ సపోర్టు అవసరం ఉంది. చిరంజీవి, నాగబాబు, చరణ్‌ తదితరులంతా ఒకటైతే ప్రజారాజ్యం స్థాయిలో జనసేన పార్టీ ఊపందుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అయితే…ఇప్పుడు చిరంజీవి కీలక నిర్ణయం తీసుకోవాల్సివుంది. కాంగ్రెస్‌తోనే కొనసాగడమా…తమ్ముడు పవన్‌ పార్టీకి అండగా నిలబడటమా అనేది ఆయన తేల్చుకోవాల్సివుంది. పరిణామాలు మాత్రం జనసేనకు మెగా ఫ్యామిలీ దగ్గరవుతున్న దిశగా సాగుతున్నాయి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*