చెత్తతో నింపేసి పాఠకులపై భారం వేస్తానంటే ఎలా?

తెలుగు దినపత్రికల ధరలు పెరగబోతున్నట్లు వార్తలొస్తున్నాయి. ప్రధాన పత్రికల ధరలు చాలాకాలం రెండు రూపాయలే ఉండేది. కొన్నేళ్ల క్రితమే ధర పెంచారు. వారంలో ఆరు రోజుల ఐదు రూపాయలు, ఆదివారం మాత్రం రూ.6గా నిర్ణయించారు. మళ్లీ ఇప్పుడు ఆదివారం రూ.10, మిగతా రోజుల్లో రూ.8 దాకా ధర నిర్ణయించాలన్న ఆలోచనలో యాజమాన్యాలు ఉన్నట్లు కొన్ని రోజులుగా వార్తలొస్తున్నాయి. న్యూస్‌ ప్రింట్‌ ధరలు పెరుగుతున్నందన దినపత్రికల ధరలు పెంచాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు.

న్యూస్‌ ప్రింట్‌ ధర పెరిగిన మాట వాస్తవమేగానీ…ఆ భారం పాఠకులపై మోపాలనుకోవడం సమంజసమా…అనేది ప్రశ్న. ప్రముఖ దినపత్రికలు ఏవైనా ఇప్పుడు ఇస్తున్న ధర కూడా వాస్తవ ధర (అయ్యే ఖర్చు)తో పోల్చితే తక్కువే. అయినా పత్రిక కొనుగోలు పాఠకులకు భారంగా మారుతోంది. ఒకప్పుడు నెలకు రూ.60తో పోయేది ఇప్పుడు రూ.155 చెల్లించాల్సివస్తోంది. అదే రెండు పత్రికలు వేసుకునేవారు రూ.300పైగా వ్యయం చేయాల్సిన పరిస్థితి. మళ్లీ ధర పెంచితే…పత్రికలకే నెలకు రూ.400 నుంచి రూ.500 ఖర్చు చేయాల్సిన పరిస్థితి దాపురిస్తుంది.

ధర పెంచకుండా దినపత్రిక నిడిపే మార్గ లేదా? ఎందుకు లేదూ..వుంది. పోటీపడి చెత్తంగా పాఠకుల నెత్తిన వేయకుండా, ఎంత అవసరమో అంతే ఇవ్వగలిగితే….గతంలో లాగా పత్రికను రూ.2కు కూడా ఇవ్వొచ్చు. ప్రస్తుతం ప్రధాన ప్రవంతి తెలుగు దినపత్రికలు 16 పేజీల మెయిన్‌, 15 పేజీల టాబ్‌లాయిడ్‌ ఇస్తున్నాయి. ఇన్ని పేజీలు అవసరమా? అనేది ప్రశ్న. మెయిన్‌ 10 పేజీలకు పరిమితం చేసినా సరిపోతుంది. అవసరమైతే….సినిమా, ఆధ్యాత్మికం, స్టోర్ట్స్‌ వంటి పేజీలను అర్థపేజీకి తగ్గించుకోవచ్చు.

ఇక జిల్లా పేజీల విషయానికొస్తే…16 పేజీలు జిల్లా అంతటా ప్రచురితం అవుతాయి. ఇవి కాకుండా…ప్రతి నియోజకవర్గానికి రెండు పేజీల వంతున ఇస్తున్నాయి. అసలు ఒక నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో రోజూ రెండు పేజీల వార్తలు ఏముంటాయనేది ఆలోచించాల్సిన అంశం. ఈ పేజీలు నింపడానికి చెత్తంతా తీసుకొచ్చి పోస్తున్నారు. ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్పుకోవాలి. ఆ మధ్య సాక్షి ఒక ప్రయోగం చేసింది. నియోజకవర్గానికి రెండు పెద్ద పేజీలు….అంటే జిల్లా పేజీల్లో చూస్తే 8 పేజీలు ఇచ్చింది. ఆ సమయంలో విలేకరులు….ఆ పేజీలు నింపలేక తలపట్టుకున్నారు. ఒక రోజు రోడ్డుకు అటువైపు అపరిశుభ్రంగా ఉందంటూ వార్త ఇస్తే…ఇంకో రోజూ రోడ్డుకు అటువైపు ఫొటో తీసి అదే వార్త పంపేవారు. దీనికి కోట్ల రూపాయలు ఖర్చయ్యాయి. దీనివల్ల ప్రయోజనం లేదని…మళ్లీ పాత పద్ధతికి వచ్చారు. ఇప్పుడు కూడా నియోజకవర్గానికి రెండు పేజీలు అవసరం లేదు. ఒక పేజీ సరిపోవచ్చు. మొత్తంగా 16 పేజీలకు పరిమితం చేయవచ్చు. అవసరమైతే ఇంకా తగ్గించవచ్చు కూడా.

ఇటువంటి ప్రత్యామ్నాయాల గురించి ఆలోచించకుండా, పోటీలు పడి పేజీలు పెంచి, ఇప్పుడు ధరలు పెంచడమంటే పాఠకులను పత్రికలకు దూరం చేయడమే అవుతుంది. ఏ పత్రిక యాజమాన్యమైనా తమ పత్రికలో ప్రచురితమైన వార్తలపై తులనాత్మక అధ్యయనం చేయగలిగితే…ఎంత చెత్త తగ్గించవచ్చో అర్థమవుతుంది. అలాకాకుండా ధరలు పెంచుతామంటూ మొండిగా ముందుకెళితే…సర్క్యులేషన్‌ పడిపోవడం ఖాయం. రెండు పత్రికలు తీసుకునేవారు ఒక పత్రికకు పరిమితం అవుతారు. ఒక పత్రిక కూడా వొద్దనుకుని ఆపేసేవారూ ఉంటారు.

డిజిటల్‌ మీడియా విస్తృతం అవుతున్న తరుణంలో ఆన్‌లైన్‌లో పత్రికలు చూసేవారి సంఖ్య పెరుగుతోంది. అసలు ఈ-పేపర్‌ కంటే న్యూస్‌ పోర్టల్‌లో (వెబ్‌సైట్‌) వార్తలు చూడటానికే ఇష్టపడుతున్నారు. ఈ-పేపర్‌ కంటే ఈ వార్తలు చదవడానికి అనుకూలంగా ఉండటమే కారణం. అందుకే అన్ని పత్రికలు వెబ్‌పోర్టల్స్‌ నడుపుతున్నాయి. చెప్పేదేమంటే ….న్యూస్‌ ప్రింట్‌ పెరిగిందన్న పేరుతో పత్రిక ధరలు పెంచడం సమంజసం కాదు. అవసరమైతే పేజీలు తగ్గించాలి. అదనపు సమాచారం ఇవ్వాలనుకుంటూ దాన్ని వెబ్‌లో ఇవ్వాలి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*