చెన్నైలో రిపోర్టింగ్ భాగ్యం…ఎందరో సినీ, సంగీత మహామహుల సాంగత్యం…! ఈ తరం జర్నలిస్టుల్లో అరుదైన అవకాశం..!

  • చెన్నైలో దీర్ఘకాలం పని చేసిన సీనియర్ పాత్రికేయులు మోహన్ రావు చెబుతున్న ఆసక్తికర విషయాలు

ఉద్యోగ రీత్యా 1996లో చెన్నైలో అడుగు పెట్టాను. చెన్నైలో దాదాపు 17 సంవత్సరాలు గడిపాను. ఎన్నో అనుభవాలు చవి చూశాను. ముఖ్యంగా తెలుగు సినీ పరిశ్రమ అప్పటికే అక్కడి నుంచి హైదరాబాద్ చేరుకున్నా, సీనియర్ నటులు అనేక మంది చెన్నై లోనే ఉండిపోయారు. అనేక మంది సీనియర్ నటీనటులు, దర్శకులు, సాంకేతిక నిపుణులతో పరిచయ భాగ్యం కలిగింది. సినీ నటులంటే ఎలా ఉంటారో చూడాలనే తాపత్రయం, క్రేజ్ ఉన్న నాకు వారితో అత్యంత సన్నిహితంగా మెలిగే అవకాశం కలిగింది. సినిమా కళాకారులే కాదు, ప్రఖ్యాత సంగీత కళాకారులతో కూడా పరిచయం ఏర్పడింది.

ఈనాడులో విలేకరిగా నా చెన్నై ప్రస్థానం ప్రారంభమయ్యిందని చెప్పవచ్చు. నేను చేరిన కొద్దిరోజుల్లోనే అంటే 1998 జూన్ 4వ తేదీన ప్రముఖ రచయిత ఆరుద్ర గారు పరమపదించారు. ఆయన పార్థివ దేహాన్ని ఆసుపత్రి నుంచి ఇంటికి తీసుకుని రావడం, అంత్యక్రియలు నిర్వహించడం వెంటవెంటనే జరిగిపోయాయి. ఈనాడు స్టాఫర్ సాంబశివరావుతో కలసి నేను ఆరుద్ర గారి ఇంటికి వెళ్లాను. చెన్నై బీ.నగర్‌లోని పాండి బజార్లో ఉన్న ఫ్లవర్ మార్కెట్ వీధిలో ఉండేవారు. ఆయన సతీమణి రామలక్ష్మి గారిని పరామర్శించి, ఆరుద్రగారి జీవిత విశేషాలు తెలుసుకుని వచ్చాము. ఆయన మరణ వార్తను సాంబశివరావుతో కలసి నేను కూడా రాశాను. నడిచే విజ్ఞాన సర్వస్వం అని పేర్కొంటూ వార్త రాశాము. ఆ విధంగా నాకు రామలక్ష్మి గారితో పరిచయం ఏర్పడింది. రెండు నెలల్లోనే అంటే ఆగస్టు 31వ తేదీన ఆయన జయంతి రావడం జరిగింది. ఆఫీసులో ఆరుద్ర గురించి ఒక ఆర్టికల్ రాయాలని అనుకున్నాము. ఆ బాధ్యతలు నేను తీసుకున్నాను. నేరుగా రామలక్ష్మి గారి వద్దకు వెళ్లాను. ఆరుద్ర జయంతికి ఒక ఆర్టికల్ రాయాలని అనుకుంటున్న విషయాన్ని ఆమెకు చెప్పాను. ఆమె కొద్దిసేపు ఆలోచించి ఏమి రాద్దామనుకుంటున్నావు అని అడిగారు. ఆయన జీవితంలో జరిగిన ప్రత్యేక విషయాలు ఏమైనా ఉంటే చెబుతారని వచ్చాను అన్నాను. సమయం రెండు రోజులే ఉందని కూడా ఆమెకు గుర్తు చేశాను. ‘మోహన్‌రావు నువ్వు రేపు రాగలవా’ అన్నారు. సరేనని వచ్చేశాను. మరుసటి రోజు ఆమె వద్దకు వెళ్లాను. ‘నేనే రాసేశాను. ఈ ఆర్టికల్ వేయించు సరిపోతుంది’ అని ఒక పేపరు నా చేతిలో పెట్టారు. ఆ పేపరు తీసుకుని వచ్చేశాను. ఆఫీసుకు వచ్చి ఆ పేపరు చూశాను. అందులో ఆమె స్వర్గాన ఉన్న ఆరుద్రకు క్షేమ సమాచారాలు అడుగుతూ రాసిన లేఖ అది. డియర్ ఆరుద్ర అంటూ మొదలు పెట్టి తాను క్షేమంగా ఉన్నానని, ఇంకా తన జీవితంలో ఆయనతో గడిపిన జ్ఞాపకాలను గుర్తు చేస్తూ రాసిన ఆ లేఖ. ఈ లేఖను యధాతథంగా డెస్క్ కు పంపగా, ఆ లేఖను ఎడిట్ పేజీలో ప్రచురించారు. తరువాత ఆమెతో చాలాసార్లు మాట్లాడాను. ఆమె రాసిన కొన్ని పుస్తకాలు కూడా నాకు ఇచ్చారు. నాకు ఏదైనా సందేహాలు కలిగితే ఆమెను అడిగి తెలుసుకునే వాడిని. ఆరుద్రకు సంబంధించిన కొన్ని జ్ఞాపకాలను ఆమె నాతో పంచుకునే సందర్భం కలిగింది. ఆరుద్ర సశేషంగా మిగిల్చిన సమగ్రాంధ్ర సాహిత్యాన్ని పూర్తి చేసి ఆమె హైదరాబాద్ వెళ్లిపోయారు.

మాదవపెద్ది సత్యం గారితో…
చెన్నైలో మాధవపెద్ది సత్యం గారి ఇంటికి కూడా తరుచూ వెళ్లేవాడిని. మాధవపెద్ది సత్యం అనేక సినిమాల్లో పాటలు పాడారు. ఆయనను గుర్తుకు తెచ్చుకోవాలంటే “మాయాబ జార్” సినిమాలో ‘వివాహ భోజనంబు’ పాట. ఆయన చాలా సన్నగా ఉన్నా, గంభీరంగా ఆ పాటను పాడారు. వారి అబ్బాయి మాధవపెద్ది మూర్తి కూచిపూడి నృత్య కళాకారుడు, ప్రముఖ బాలీవుడ్ తారలు హేమమాలిని, మీనాక్షి శేషాద్రిలతో కలసి నాట్య కార్యక్రమాలు చేస్తుంటాడు. అతను శివ ఫౌండేషన్ అనే నాట్య కళాశాల నడిపేవాడు. అతని వద్దకు పలువురు సినీ నటీమణులు వచ్చి నాట్యం నేర్చుకునేవారు. మూర్తి పరిచయం కావడంతో, నటులను ఇంటర్వ్యూ చేసే అవకాశం కలిగింది. వారిలో సీత, ఈశ్వరిరావు (రాంబంటు – ఖమ్), తనూజ ( రాఘవేంద్రరావు గారి దర్శకత్వంలో వచ్చిన పరదేశి -1998 ఫేమ్), సులోచన తల్లి బేబి, శ్రీప్రియ లాంటి నటీమణులు ఉన్నారు. ఈ విధంగా నేను వాళ్ల ఇంటికి
వెళుతూ ఉండేవాడిని. అప్పుడు మాధవపెద్ది సత్యం గారు పలుపాత జ్ఞాపకాలను నాతో పంచుకునేవారు. స్వర్గీయ ఎన్.రామారావు అప్పట్లో విజయ వారి బ్యానర్ లో చేరినపుడు మాధవపెద్ది సత్యం గారు పలకరించారట. నువ్వేనా నిమ్మకూరు నుంచి వచ్చింది అని అడిగారట. అప్పుడు ఎన్.రామారావు అవునని చెపుతూ మాధవపెద్ది సత్యం గురించి అడిగి తెలుసు కున్నారట. ఎటి.రామారావు చాలా వినయంగా ఉండేవారని, అయితే గొంతులో గాంభీర్యం
అప్పట్లోనే ఉండేదని చెప్పేవారు. వీళ్లు తరుచూ కలుసుకుంటూ, సినిమా వ్యవహారాలు మాట్లాడుకునే వారంట. విజయా స్టుడియోలో ప్రతి రోజు టిఫిన్లో భాగంగా అక్కడ ఉన్న నటీనటులు, సాంకేతిక నిపుణులకు రెండు ఇడ్లీలు పెట్టేవారట. ఎన్టీ రామారావు మాత్రం తనకు రెండు ఇడ్లీలు సరిపోవడం లేదని నాగిరెడ్డి గారికి చెబితే, రామారావుకు మాత్రం మూడు ఇడ్లీలు పెట్టాలని ఆయన ఆదేశించారట. ఈ విషయం నాకు మాధవపెద్ది సత్యం గారి ద్వారానే ముందుగా తెలిసింది. మాయాబజార్ సినిమాలో భళిభళి భళి దేవా అనే పాటను పాడి, ఆ పాటకు ఆయనే నటించారు. అభిమన్యుడు, సుభద్రలు ఘటోత్కచుడి ఆశ్రమానికి వెళ్లేటపుడు ఈ పాటను చిత్రీకరించారు. రథసారథిగా నటించాల్సిన వ్యక్తి రాకపోవడంతో, విజయా నాగిరెడ్డి గారు. ఆ వేషాన్ని వేయాలని మాధవపెద్ది సత్యం గారిని కోరారట. పాటను మీరే పాడారు కాబట్టి, మీరే నటిస్తే బాగుంటుందని అన్నారట. దీంతో నాటకానుభవం ఉన్న సత్యం గారు, ఆ వేషాన్ని వేశారట. పలు నాటకాలు వేసేవారమని, ఎస్వీరంగారావు, చిత్తూరు నాగయ్య లాంటి వారితో కలసి అనేక నాటకాలు వేశామని చెప్పేవారు. వాణిశ్రీ కూడా అప్ప ట్లో నాటకాలు వేశారని, ఒక నాటకానికి హీరోయిన్ కావాల్సి రావడంతో, తనే వాణిశ్రీ ఉంటున్న ఇంటిని వెతుక్కుంటూ వెళ్లినట్లు చెప్పారు. ఆమెను తీసుకుని వచ్చి నాటకంలో హీరోయిన్ గా నటింప చేశామని తరువాతే ఆమె సినిమాల్లోకి వచ్చారని చెప్పారు. తాము తమ కుటుంబ సభ్యులతో కలసి పేకాట ఆడేవాళ్లమని అంటూ, కులగోత్రాలు సినిమాకు ‘అయ్యయ్మో జేబులో డబ్బులు పోయనే’ అనే పాట పాడినపుడు, పేకాటలో తాను డబ్బులు పోగొట్టుకున్న విషయాన్ని గుర్తుకు తెచ్చుకుని పాడానని, దీంతో ఆ పాటకు సహజత్వం ఏర్పడిందని చెప్పారు. మాయాబజార్‌లో వివాహ భోజనంబు పాటను ముందుగా ఘంటసాల చేత పాడించాలనుకున్నా, మాధవపెద్ది సత్యం ఒక్కరే ఈ పాటకు న్యాయం చేయగలరని ఘంటసాల…తనకు ఈ అవకాశాన్ని ఇచ్చారని తెలిపారు. అయితే అనేక పాట కచ్చేరీలలో ఈ పాటను త రుచు నా దగ్గర పాడిస్తున్నారని, వయసు మించడంతో, తగిన న్యాయం చేయలేక పోతున్నాని బాధపడేవారు. ఆపాటను పాడాలంటే ఎక్కువ దమ్ము అవసరమని చెప్పుకొచ్చేవారు. ఆయ న 2000 సంవత్సరం డిసెంబరులో బాత్రూంలో స్నానం చేయడానికి వెళ్లి కింద పడ్డారు. కొన్నాళ్లు అనారోగ్యంతో ఉంటూ మరణించారు. ఆయన తొలి సంతాప సభను రాజా అ న్నామలై పురంలోని ఇమేజ్ ఆడిటోరియంలో నిర్వహించారు. ఆ కార్యక్రమానికి తెలుగు చలన చిత్ర రంగానికి చెందిన గాయినీ గాయకులు అందరూ పాల్గొన్నారు.

జిక్కీ గారితో పరిచయం…
“మల్లీశ్వరి”, “పాతాళభైరవి” చిత్రాలు విడుదలయ్యి 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ‘వార్త’ ఆదివారం సంచికను ప్రత్యేకంగా ముద్రించాలని 2001 డిసెంబరులో వార్త యాజమాన్యం నిర్ణయించింది. ఆ చిత్రాల్లో నటించిన వారిని, ఆ సినిమాలకు పని చేసిన వారిని గుర్తించి, వారి ఇంటర్వ్యూలు పంపే పని నాకు అప్పగిచారు. మిగిలిన స్టోరీ అంతా ప్రముఖ సాహితీ విమర్శకులు విఎకె. రంగారావు గారికి అప్పగించారు. ఆయన అప్పటికే వార్తలో ‘ఆలాపన’ అనే శీర్షికను సినిమా పేజీలో రాస్తున్నారు. ఆ చిత్రాల్లోని చాలా మంది నటీనటులు, సాంకేతిక నిపుణులు, గాయినీ గాయకులను ఇంటర్వ్యూ చేశాను. గాయిని జిక్కీ (పిజి కృష్ణవేణి) గారు నాకు దొరకలేదు. ఆమె చిరునామా మార్చారని తెలిసింది. ఇటువంటి సమయాల్లో నన్ను ఆదుకునే వారు సంగీత దర్శకుడు, గాయకుడు జి.ఆనంద్ గారు. ఆయన స్వర మాధురి ఫౌండేషన్ ద్వారా గాయనీ గాయకులతో సంగీత విభావరులు నిర్వహిస్తూ ఉంటారు. నేను చెన్నై వెళ్లక ముందు నుంచే నాకు సుపరిచితులు. తిరుపతి అకాడ మీ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ కార్యక్రమాలకు వస్తూ ఉండేవారు. అప్పటి నుంచి ఆయన నాకు ఆత్మీయులు. జిక్కీ గారి గురించి, ఆనంద్ గారిని అడిగాను. జిక్కీ గారు వెస్ట్ మాంబళంలోని ఒక అపార్ట్మెంట్ లో ఉన్నట్లు తెలిపారు. వెళ్లి ఆమెను కలసి పాతాళభైరవి చిత్రంలో పాడినప్పటి ఆమె అనుభవాలను అడిగాను. ఏమీ తడుముకోకుండా ఆమె ఆ సినిమా గురించి చెప్పారు. పాతాళభైరవిలో తాను పాడిన ‘వగలోయ్ వగలు తళుకు బెళుకు వగలు’ అని పాటను పాడానని చెబుతూ, పాట మొత్తం పాడి వినిపించారు. ఇప్పటికీ మీకు ఆ పాట గుర్తుందా అని అడుగుతూ ఆశ్చర్య పోయాను. తాను పాడిన అన్ని పాటలూ తనకు గుర్తు ఉన్నాయని, పుస్తకం లేకుండానే పాడుతానని ఆమె చెప్పారు. తాను పాడిన పాట వగలోయ్ వగలు కన్నా, పి.లీల పాడిన ‘ఎంత ఘాటు ప్రేమయో’ అనే పాటంటే తనకు ఇష్టమని ఆమె చెప్పారు. అయితే తాను అప్పటికే అనేక చిత్రాల్లో పాడినా, పాతాళభైరవి చిత్రంలో పాడిన తరువాతే మంచి పేరు వచ్చిందని చెప్పుకున్నారు. ఒక రోజంతా ఆ పాటను ప్రాక్టీసు చేశానని, రెండ వ రోజు వాయిద్యాలతో రిహార్సల్స్ చేశామని, మరో రోజు రికార్డింగ్ చేసినట్లు చెప్పారు. ‘ఈ పాటను నా చేతే పాడించాలని ఘంటసాల గారు పట్టుబట్టి పాడించారు’ అని చెప్పారు. ఇంకా ఆమె తమిళ పాతాళ భైరవిలో మూడు పాటలు పాడే అవకాశం వచ్చిందని తెలిపారు. తెలుగు పాతాళభైరవిలో ‘ఇతిహాసం విన్నారా’ పాటను టీ జీ కమలాదేవి పాడగా, తమిళంలో తాను పాడినట్లు చెప్పారు. అప్పట్లో టీ.నగర్‌లోని రికార్డింగ్ స్టుడియోలో పాటడానికి వెళితే, ప్రతిరోజూ ఒక విహార యాత్రకు వెళ్లిన ట్లు వెళ్లి వచ్చేవారమని చెప్పేవారు. ఇప్పటి లాగా ట్రాక్ సిస్టమ్ ఉండేది కాదని, వాయిద్య పరికరాలతో కలసి పాడే వాళ్లమని, గాయనీ గాయకులు ఇద్దరికీ ఒకే మైక్ ఉండేదని చెప్పారు. గాయకుడుతో కలసి పాడేటప్పుడు తనకు సరిపడా స్టూల్ వేసి నిలుచోబెట్టే వారని చెప్పారు. మురారి సినిమాకు పాడిన తరువాత కూడా ఆమెను కలిశాను. అవును పాడానని చెబుతూ, రికార్డింగ్ కు వెళ్లి వచ్చినట్లుగా లేదని, ఒంటరిగా తన ట్రాక్ తాను పాడుకు రావడం తనకు నచ్చలేదని అన్నారు. తరువాత ఆమెకు టెలిఫోన్ చేసి ఏదైనా సందేహాలు ఉంటే అడుగుతూ ఉండేవాడిని. ఆమె టెలిఫోన్ లో కూడా అడిగిన పాటను మొత్తం పాడి వినిపించేవారు. మాయా బజార్ చిత్రంలో జిక్కీ పాడినట్లు ఒక స్నేహితుడు చెప్పాడు. అయితే నేను ఆమె పాడలేదని వాగ్వాదానికి దిగాను. నేరుగా జిక్కీ గారిని అడిగితే సరిపోతుంది కదా అని నేను ఆమెకు ఫోన్ చేశాను. తెలుగులో పాడలేదని, తమిళంలో పాడినట్లు చెప్పారు. ‘విన్నావా య శోదమ్మా’ పాటను పి.సుశీల గారితో కలసి పాడినట్లు చెపుతూ, ఆ పాట మొత్తం పా డేశారు. అంత జ్ఞాపక శక్తి ఆమెకు. అదే విధంగా అనార్కలి చిత్రంలోని రాజశేఖరా…పాటను కూడా ఆమె ఒక సందర్భంలో నాకు పాడి వినిపించారు. ఆమెది మన జిల్లాలోని చంద్రగిరే అయినా, చెన్నైలోనే ఉంటూ, గాయకుడు ఏఎం రాజాను వివాహం చేసుకున్నారు. చెన్నైలోనే 2004 ఆగస్టు 16వ తేదీన తీవ్ర అనారోగ్యంతో మర ణించారు.

చిరంజీవి గారితో సంబంధం…
2002 సంవత్సరంలో అనుకుంటాను… ఒక రోజు ఆదాయపు పన్ను శాఖ అధికారులు చెన్నైలోని హోటల్ లీ మెరిడన్ హోటల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి వెళ్లి మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఆఫీసుకు చేరుకున్నాను. ఆ వార్త రాద్దామని కంప్యూటర్ దగ్గర కూర్చున్నాను. అంతలో ల్యాండ్ లైన్ ఫోన్ మోగింది. ఫోన్ తీసుకున్నాను. అటుపక్క గొంతు ‘మోహన్ రావు ఉన్నారా’ అని అడిగారు. మాట్లాడుతున్నాను మీరు ఎవరని ప్రశ్నించాను. ‘నేను ఆర్టిస్టు రాజా రమేష్ అండీ’‌ అన్నారు. నటుడు రాజా రమేష్ ను అప్పుడప్పుడు చూస్తూనే ఉంటాము కాబట్టి చెప్పండి…బాగున్నారా అని అడిగాను. ‘సార్ మీతో అన్నయ్య మాట్లాడుతారంట’ అన్నారు . మీ అన్నయ్యకు నాతో పనేంటండి అడిగాను. ‘అన్నయ్య అంటే చిరంజీవి గారు’ అన్నాడు. నేను వెళ్లిన ఆదాయపు పన్ను శాఖ కార్యక్రమానికి చిరంజీవి గారు వచ్చారు. ఆయనకు ఆదాయపు పన్ను శాఖ వారు అత్యధికంగా ఆదాయపు పన్ను చెల్లించినందుకు గాను ‘సమ్మాన్ అవార్డు’ను ప్రకటించగా, ఆయన ఆ కార్యక్రమంలో అవార్డు అందుకున్నారు. చిరంజీవి గారు అవార్డు అందుకోవడంతో, మేము ప్రత్యేకంగా ఫోటోలు తీయించాము. ‘ఈ రోజు ఉదయం చిరంజీవి గారు చెన్నైకు వచ్చారు కదా, ఆదాయపు పన్ను శాఖ కార్యక్రమానికి నేను కూడా కవరేజికి వెళ్లాను’ అని చెప్పాను. ‘ఆ విషయం గురించే మాట్లాడుతారట’ అన్నాడు రాజా రమేష్. ఫోన్ చిరంజీవి గారికి ఇవ్వగా… ‘మోహన్ గారు సమ్మాన్ అవార్డు వచ్చిన వార్త మెయిన్ ఎడిషన్లో వచ్చేలా చూడండి’ అన్నారు. తప్పకుండా వస్తుంది. నాకు మా హెడ్ ఆఫీసు నుంచి మెసేజ్ వచ్చింది. మెయిన్‌కు పంపమని అని చెప్పాను. ‘నేను ఆదాయపు పన్ను చెల్లించిన విషయం తెలిసి, అందరూ తమ తమ ఆదాయపు పన్నులు ఎగవేత లేకుండా చెల్లిస్తారనే మంచి సందేశం వాళ్లకు వెళ్లినట్లు ఉంటుంది కదా’ అ న్నారు. నిజమే అన్నాను. తరువాత ఆయన నా గురించి వివరాలు అడిగారు. చెప్పాను. హైదరాబాదు వస్తే కలవండి అని ఆహ్వానించారు. మరుసటి రోజు వార్త వచ్చింది. ఆ తరువాత మరోసారి ఆయన చెన్నై వచ్చారు. ఆంధ్రాక్లబ్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్ హాల్ లో కలిశాను. నరసారెడ్డిగారు నన్ను పరిచయం చేశారు. మిమ్మల్ని నేను ఇంత వరకు చూడలేదు అన్నారు. ఆదాయపు పన్ను శాఖ అవార్డు తీసుకున్నప్పుడు ఫోన్ లో మాట్లాడుకున్నాము అని చెప్పాను. గుర్తుకు వచ్చిందో లేదో కానీ అవును అవును అన్నారు. మీరు చెన్నైలో ఉన్న సమయంలో రోజూ మీ ఇంటి ముందు నుంచే వెళ్లేవాడినని చెప్పాను. ప్రజారాజ్యం పార్టీ గురించి వివరాలు అడిగాను. అప్పటికే ఎన్నికల్లో ఓడిపోయి ఉండటంతో, భవిష్యత్తు కార్యక్రమాల గురించి కొన్ని విషయాలు చెప్పారు. వార్తకూ డా బాగా వచ్చింది.

దీనికి ముందు 2006లో అనుకుంటాను. చిరంజీవి పెద్ద కుమార్తె సుష్మిత వివాహ కార్యక్రమం ఎగ్మూరులోని రాణి మెయ్యమ్మ హాలులో జరగ్గా అప్పుడు వెళ్లి కలిశాను. బాగానే రిసీవ్ చేసుకున్నారు. వివాహం ఏర్పాట్ల గురించి చెప్పారు. నేను తిరుపతికి బదిలీ అయిన తరువాత 2013లో చిరంజీవి కుమార్తె ఇంట్లో భారీ ఎత్తున నగదు లభించిన విషయం తెలిసిందే. దీని గురించి విచారించి, నిజానిజాలపై నివేదిక ఇవ్వాలని సాక్షి యాజమాన్యం ఇచ్చిన ఆదేశాల మేరకు చెన్నై వెళ్లాను. చిరంజీవి సన్నిహితులను, మరికొంత మందిని కలుసుకుని దొరికిన నగదు విషయంపై నివేదిక ఇచ్చాను.

భానుమతి గారితో అనుబంధం… మల్లీశ్వరి సినిమా విడుదలయ్యి స్వర్ణోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా నటి భానుమతి గారిని కలిశాను. దానికి ముందుకు కూడా పలుసార్లు భానుమతిగారి వద్దకు వెళ్లడం జరిగింది. సీనియర్ పాత్రికేయులు ఎంఎల్ నరసింహం గారి పక్కింటిలోనే నేను ఉండేవాడిని. ఆయన ఒక సారి భానుమతి గారి దగ్గరకు వెళుతున్నాను వస్తారా అని అడిగారు. నేను వెంటనే వస్తానని చెప్పి, ఆయనతో పాటు వెళ్లాను. ఆమె అప్పటికే కూర్చుంటే లేవలేని పరిస్థితిలో ఉన్నారు. ‘ది హిందూ’లో ఆర్టికల్ రాయడానికి నరసింహంగారు ఆమెను ఇంటర్వ్యూ చేశారు. ఆమెకు నన్ను పరిచయం చేశారు. ఆ వయస్సులో కూడా ఆమె నన్ను బాగా గుర్తు పెట్టుకున్నారు. తరువాత ఆమెతో రెండు మూడు సార్లు మాట్లాడే అవకాశం కలిగింది. అంతలో మల్లీశ్వరి స్వర్ణోత్సవం ప్రత్యేకం ప్రచురించే నిమిత్తం ‘వార్త’ సండే ఇన్చార్జి గుడిపాటి గారు భానుమతి గారి ఇంటర్వ్యూ అడిగారు. ఆమె వద్ద సమయం తీసుకుని వెళ్లాను. సాయం త్రం 5 గంటల సమయంలో వెళ్లాను. ఆమె రెండవ అంతస్తులోని ఒక గదిలో ఈజీ చైర్ లో కూర్చొని ఉన్నారు. నన్ను చూసి ‘ఏం నాయనా బాగున్నావా’ అని అడి గారు. నేను సమాధానం చెప్పి, మల్లీశ్వరి సినిమా విశేషాల గురించి అడిగాను. “ఆ సినిమా కోసం నేను చాలా కష్ట పడ్డాను. ఆ చిత్రానికి స్వర్గీయ బిఎన్ రెడ్డి గారు రూపకర్త అయినా, నటీనటులు, సాంకేతిక నిపుణుల సహకారం, కృషి మరువలేనిది. ముఖ్యంగా పాటల విషయంలో నేను చాలా ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నాను. నాకు ఇష్టమైన రాగాలతో ఆ చిత్రంలోని పాటలకు సంగీతం సమకూర్చాము” అని చెప్పారు. నీకు రాగాల గురించి తెలుసా అని అడిగారు, తెలియదని చెప్పాను. ‘సంగీత దర్శకుడు సాలూరి రాజేశ్వరరావు, నా భర్త రామకృష్ణ కలసి ఇదే ఇంట్లో అదిగో కనిపిస్తున్న ఆ వరండాల్లో కూర్చొని పాటలకు సంగీతాన్ని సమకూర్చాము. (టి.నగర్ లోని వైద్య రామన్ వీధిలో భానుమతి గారి ఇల్లు. రెండవ అంతస్తులో కూడా వరండా ఉండేది.
అక్కడే ట్యూన్లు తయారు చేసినట్లు ఆమె చెప్పారు) బిఎన్.రెడ్డి గారికి మంచి అభి రుచి ఉండటంతో, సంగీతం విషయాన్ని నాకు వదిలి పెట్టారు…అంటూ చెప్పుకొచ్చారు. తరువాత సంగీత దర్శకుడు చక్రవర్తి 2002లో మరణించినపుడు ఫోన్ చేశాను. సంతాపం తెలుపుతారేమోనని. చక్రవర్తి గురించి ఆమె గొప్పగా చెప్పారు. అప్పట్లో ఆయన జెమిని టీవిలో ‘కలిసుందాంరా’ అనే సీరియల్ లో నటించేవారు. తాను ఆ సీరియల్ చూసేదానినని,అంతకు ముందే నాకు చక్రవర్తి కుటుంబంతో మంచి సంబంధాలు ఉన్నాయని చెప్పారు. అదే విధంగా తమిళ నటుడు శివాజీ గణేశన్ చనిపోయినప్పుడు కూడా ఆమె వద్దకు వెళ్లి, ఆయన‌ గురించి వివరాలు తీసుకున్నాను. అప్పటికే ఆమె చాలా చిన్నగా మాట్లాడేవారు. ఒక్కోసారి ఆమె చెప్పేది వినిపించేది కాదు. ఆమె 2005 డిసెంబరు 24వ తేదీన రాత్రి ఒంటిగంట సమయంలో మరణించినట్లు తెలిసింది. ఈ వార్తను నేను పంపిచలే కపోయాను. ఈనాడు, హిందూ పత్రికల్లో వచ్చింది. ఎడిటర్ టంకశాల అశోక్ వద్ద చివాట్లు తినాల్సి వచ్చింది. ఆమె భౌతిక కాయాన్ని రెండు రోజుల పాటు ఇంట్లోనే ఉంచారు. వాళ్ల అబ్బాయి భరణి అమెరికా నుంచి రావడానికి రెండు రోజులు పట్టింది. ఆమె అంత్యక్రియల్లో కూడా పాల్గొన్నాను. తెలుగు సినిమా తొలి నాటి నటీనటులతో సన్నిహితంగా మెలిగే అవకాశం నాకు చెన్నైలో కలిగింది. వారిలో అత్యంత ప్రముఖ నటి, గాయిని, దర్శకురాలు, నిర్మాత, సంగీత దర్శకురాలు, రచయితగా ప్రతిభ కనబరిచిన భానుమతి లాంటి గారితో పరిచయం కావడం ఒక విధంగా అదృష్టమనే చెప్పాలి.

సంగీత దర్శకులు చక్రవర్తితో…
2001 చివరలో వార్త దిన పత్రిక ఆదివారం ప్రత్యేకంలో నేటి సినిమా పాటలు ఎలా ఉన్నాయి అనే అంశంపై పలువురు అభిప్రాయాలు తీసుకున్నాము. సాధారణ పాఠకులు కూడా దీనిపై స్పందించారు. ప్రతి వారం ఒక సినీ ప్రముఖుడి అభిప్రాయం కూడా వేశారు. అందులో భాగంగా సంగీత దర్శకుడు చక్రవర్తిని కలుద్దామని ఫోన్ చేశాను. అప్పట్లో సెల్‌ఫోన్లు లేవు. ఇంటికి పలు సార్లు ఫోన్ చేశాను కానీ దొరక లేదు. వార్త కార్యాలయం చెన్నై టీ నగర్ లోని నార్త్ ఉస్మాన్ రోడ్డులో ఉండేది. అక్కడ నుంచి నేను వెస్ట్ మాంబళంలోని ఇంటికి వెళ్లాలంటే కోడంబాక్కం మీదుగా వెళ్లాలి. కోడం బాక్కంలోని డైరెక్టర్స్ కాలనీలో పార్కు ఎదురుగా చక్రవర్తిగారి ఇల్లు ఉండేది. ఒక రోజు ఆఫీసు నుంచి ఇంటికి వెళుతూ చక్రవర్తి గారి ఇంటి వద్దకు వెళ్లాను. వాచ్మెన్ ఉన్నాడు. చక్రవర్తి గారిని కలవాలని అడిగాను.‌ చక్రవర్తిగారు ఉదయాన్నే షూటింగ్ కి వెళ్లిపోతారని, రాత్రి 9 గంటల తరువాతే వస్తారని, ఒక్కోసారి ఆలస్యం కూడా అవుతుందని తెలిపాడు. దీంతో మరుసటి రోజు రాత్రి 9 గంటలకు చేశాను. కానీ దొరకలేదు. ఈ రోజు ఎంత రాత్రయినా ఉండి ఆయనకు ఫోన్ చేయాలని అనుకున్నాను. ప్రతి పది నిముషాలకు ఒకసారి చేస్తూ వచ్చాను. 9.50 గంటలకు ఆయన ఫోన్ తీసుకున్నారు. నేను ఫలానా అని చెప్పి, నేటి సినిమా పాటల మీద అభిప్రాయం అడిగాను. అప్పుడు ‘కలిసుందాం రా’ సీరియల్ లో ఆయన నటిస్తు న్నారు. అప్పటికే ఇళయరాజా, ఎఆర్ రెహమాన్ లాంటి వాళ్లు సంగీత దర్శకులుగా బిజీగా ఉండటంతో, చక్రవర్తి గారికి అవకాశాలు తక్కువగా ఉండేవి. దీంతో పాటు చక్రవర్తిగారి సతీమణి 1998లో మరణించడంతో ఆయన ఆ షాక్ లో ఉన్నారు. దీంతో ఆయన పలు సినిమాలకు సంగీత దర్శకత్వం వహించే అవకాశం వచ్చినా పట్టించుకోలేదు. తరువాత కొంత మంది మిత్రుల ప్రోద్బలంతో కలిసుందాంరా సీరియల్ లో నటించే అవకాశం రాగా, దానికి అంగీకరించారని తెలిసింది. షూటింగ్ నుంచి ఇప్పుడే వచ్చానని, బాగా ఆలసి పోయివున్నాను. రేపు ఇంటి దగ్గరకు వస్తే మాట్లాడుకుందాం అన్నారు. మరుసటి రోజు శనివారం. ఆ రోజు షూటింగ్ లేదు. సరేనని వెళ్లాను. సినిమా పాటల గురించి ఆయన చాలా చెప్పారు . నేను ఆయన చెప్పిన విషయాలను రాసి పంపించాను. సండే మ్యాగజైన్లో పబ్లిష్ అయ్యింది. మరో సారి కూడా ఆయన గురించి ఆర్టికల్ రాద్దామని వెళ్లాను. దాదాపు మూడు గంటల పాటు మాట్లాడాను. తన ఆసలు పేరు కొమ్మినేని అప్పారావని చెప్పారు. తాను సంగీత దర్శకుడిగా స్థిరపడుతానని అనుకోలేదని అన్నారు. గాయకుడిగా సినిమాల్లో అవకాశాల కోసం వచ్చానని చెప్పారు. తనను గాయకుడిని చేయాలని తన నానమ్మ తాపత్రయ పడేదని, ఆమే తనను మద్రాసుకు తీసుకుని వచ్చారని చెప్పారు. గాయకుడిగా అవకాశాలు రాక, నటులు స్వర్గీయ ఎంజీ రామచంద్రన్, స్వర్గీయ నగేష్, నటుడు కమల్ హాసన్లకు తెలుగులో డబ్బింగ్ చెప్పేవాడినని అన్నారు. సంగీత దర్శకుడిని అయినా డబ్బింగ్ చెబుతూనే ఉండేవాడినని, తన జీవిత కాలంలో 600 సినిమాలకు డబ్బింగ్ చెప్పానని అన్నారు. ఒక దశలో ఆకాశవాణి ఆదుకుందని చెప్పారు. ఆకాశవాణిలో అనేక పాటలు పాడానని చెప్పారు. సినిమాల్లో అవకాశాల కోసం తిరిగేటప్పుడు నేటి ప్రఖ్యాత గాయకుడు కె.జె ఏ సుదాస్ (జేసుదాస్) పరిచయం అయిన విషయాన్ని చెప్పుకొచ్చారు. తాము ఇద్దరూ సంగీత దర్శకుడు ఎంఎస్. విశ్వనాథన్ ఇంటి ముందు వేచి ఉండేవాళ్లమని అన్నారు . కొన్నాళ్ల తరువాత రెండు అవకాశాలు ఒకేసారి వచ్చాయట. అవి సినిమాకు దర్శకత్వం,మరొకటి సంగీత దర్శకత్వం వహించే అవకాశాలు. తన సతీమణిని సంప్రదించగా, ఆమె సంగీత దర్శకత్వం వైపే మొగ్గు చూపమని చెప్పారట. దీంతో ఆయన మూగప్రేమ (1971) సినిమాకు సంగీత దర్శకత్వం వహించారు. అయితే అది పెద్దగా ఆడలేదు. అప్పటి వరకు అసలు పేరు కొమ్మినేని అప్పారావుగా ఉ‌న్న తన పేరును ప్రముఖ నిర్మాత చటర్జీ చక్రవర్తిగా మార్చినట్లు ‌గుర్తు చేసుకున్నారు. తరువాత ఆయన తెలుగు సినీ సంగీతానికే చక్రవర్తిగా సినిమా ప్రపంచంలో నిలిచారు. ఎన్‌టి. రామారావు, అక్కినేని నుంచి చిరంజీవి హీరోగా నటించిన చిత్రాల వరకు అనేక చిత్రాలకు సంగీత దర్శకత్వం వహించారు. అద్భుతమైన ట్యూన్లు ఇచ్చి ప్రేక్షకులను ఉర్రూతలూగించారు. ముఖ్యంగా చిరంజీవి సినిమా రంగంలో నిలదొక్కుకోవడానికి చక్రవర్తి కూడా కారణమని ఖచ్చితంగా చెప్పవచ్చు. అప్పటి నుంచి చక్రవర్తి గారు తరుచూ ఫోన్ చేసేవారు. ఏదైనా కొత్త సినిమా రిలీజ్ అయితే ఆ సినిమా ఎలా ఉంది అని అడిగేవారు. నేను నాకు తోచినది చెప్పేవాడిని. ఒక్కోసారి ఆంధ్రా క్లబ్ లో కలిస్తే మాట్లాడుకునే వాళ్లం. అకస్మాత్తుగా ఆయన 2002 ఫిబ్రవరి మూడవ తేదీన మరణించారు. వడపళనిలోని విజయ ఆసుపత్రిలో ఆయన భౌతిక కాయాన్ని ఉంచారు. ఆయన కుమారులు అమెరికాలో ఉండటంతో వారు రావడానికి మూడు రోజుల సమయం పడుతుందని, అక్కడే మార్చురీలో పెట్టారు. నేను అక్కడకు వెళ్లాను. సంగీత దర్శకుడు జి.ఆనంద్ గారు కూడా అక్కడే ఉన్నారు. విజయ ఆసుపత్రి ఎదురు గానే విజయా వారి రికార్డింగ్ థియేటర్ ఉంది. ఆనంద్ గారు మాట్లాడుతూ ఇదే థియేటర్ లోనే ఆయన రాత్రనకా, పగలనకా రికార్డింగ్ లతో గడిపారు. చనిపోయాక కూడా ఆయన ఇక్కడే విశ్రాంతి తీసుకుంటున్నారని ఆవేదనతో చెప్పారు. చక్రవర్తి గారిని చివరిసారిగా సన్మానించుకునే అవకాశం తనకు కలిగిందని చెప్పగా, ఆ ఫోటో కావాలని అడిగాను. ఆయన ఆ ఫోటోను తరువాత పంపించారు. ఆ ఫోటోనే వార్త సండే మేగజైన్లో పబ్లిష్ అయ్యింది. చక్రవర్తి గారు మరణించిన రెండు రోజుల తరువాత వాళ్లబ్బాయి, సంగీత దర్శకుడు శ్రీ వచ్చారు. ఆయన నాకు ఫోన్ చేశారు. ఏమిటని అడిగాను. నాన్న గారు మీతో ఎక్కువ టచ్ లో ఉండేవారట కదా అని అడిగారు. అదేమీ లేదు. రెండు మూడు సార్లు కలిశాము అంతే అన్నాను. తరువాత రోజు ఆయనకు దహన క్రియలు జరిగాయి. ఎంఎస్ విశ్వనాథన్, జి.ఆనంద్, వాసూరావు, వందేమాతరం శ్రీనివాస్ లాంటి సంగీత దర్శకులు, ఎపి. బాలు,మనోలతో పాటు పాత తరం గాయినీ గాయకులు వచ్చారు. కానీ ఒక్క హీరో కూడా ఆయనను చివరి చూపుగా చూడటానికి రాలేక పోవడం అందరిని బాధించింది. ముఖ్యంగా చిరంజీవి లాంటి కథానాయకుడి సినిమాలకు ప్రాణం పోసిన చక్రవర్తిని చివరి చూపు చూసేందుకు వీలు లేనంతగా బిజీగా చిరంజీవి ఉన్నారా అని పలువురు ప్రశ్నించడం జరిగింది. చక్రవర్తి లాంటి సంగీత దర్శకులను కలుసుకోవడం నాకు గొప్ప అదృష్టమనే చెప్పాలి.

పద్మనాభం గారి ఆరోగ్యంపై వదంతులు…
నేను చెన్నైకు వచ్చి అప్పటికి ఐదేళ్లు దాటినా, ఎక్కువ మంది పాతతరం సినీ దిగ్గజాలను కలుసుకునే అవకాశం పాతాళభైరవి ప్రత్యేక సంచిక వేసినప్పుడే కలిగింది. ఇందులో భాగంగానే పద్మనాభంను కలవడానికి వెళ్లాను. ఒకనాడు హాస్య నటుడుగా ప్రేక్షకుల ఆదరణ పొంది, పలు సినిమాలకు నిర్మాతగా పద్మనాభం వ్యవహరించారు. ఆయన తీసిన మర్యాదరామన్న చిత్రం ద్వారానే ప్రముఖ నేపథ్య గాయకుడు ఎపి. బాలసుబ్రమణ్యం సినిమా రంగానికి పరిచయ మయ్యారు. అటువంటి పద్మనాభం ఒక చిన్న ఇంట్లో ఉన్నారు. ఆయన అడ్రసు వెతుక్కుంటూ కోడంబాక్కంలోని రంగరాజపురంకు వెళ్లాను. ఆయన చాలా చిన్న ఇంట్లో ఉండటం బాధ కలిగించింది.‌ ముందుగా ఆయనకు ఫోన్ చేసి అడగ్గా ఉదయం పది గంటలకు రమ్మని చెప్పారు . దీంతో ఆసమయానికి ఆయన ఇంటికి వెళ్లాను. సరిగ్గా నేను వెళ్లే సమయానికి ఆయన పూజ ముగించుకుని వచ్చారు. పాతాళభైరవి చిత్రం గురించి ఆనాటి జ్ఞాపకాలను చెప్పమని అడిగాను. “ఓహో ఆ సినిమా వచ్చి 50 ఏళ్లయ్యిందన్నమాట. ఆ చిత్రంలో నటించేటప్పుడు నా వయస్సు 19 ఏళ్లు, ఇప్పుడు నాకు ఇప్పుడు 71 (2001లో)” అన్నారు. “నేను షావుకారు చిత్రంలో నటిస్తుండగా, ఎల్వీ ప్రసాద్ గారు పాతాళభైరవి స్క్రిప్ట్ తయారు చేస్తున్నారు. నాతో పాటు ఎటి.రామారావు, ఎస్.వి.రంగారావు, బాలకృష్ణలతో మూడేళ్లు అగ్రిమెంట్ చేసుకున్నారు. నాకు మాంత్రికుడి శిష్యుడు సదాజపుడి పాత్రను ఇచ్చారు. ఆ చిత్రంలో నేను నా గురువైన మాంత్రికుడిని ‘ఏంగురూ’, ‘మోసం గురూ’ అనే వాడిని. దీంతో ఆ మాట ఆంధ్రరాష్ట్రం మొత్తం పాకి పోయింది. ప్రతి ఒక్కరి నోట ‘గురూ’ అనే మాట వాడుకలోకి వచ్చేసింది. ఒక ట్రిక్ షాట్ కి సంబంధించి ఒక సీన్‌ను కెవి రెడ్డి గారు వివరించగా, నేను ఎందుకు అలా అని పశ్నించాను. దీంతో ఆయనకు కోపం వచ్చి, నన్ను గద్దించారు. నేను ఆయన వద్దకు గుణసుందరి కథ చిత్రంలో వేషం కోసం వెళ్లాను. ఏదైనా ఒక పాట పాడమని కోరడంతో పాడాను. దానికి ఆయన పాట బాగాలేదని, నీవు కాఫీ కప్పులు కడగడానికి కూడా పనికి రావని అన్నారు. ఆ మాటలే నాకు ఆశీర్వచనాలు అయ్యాయని భావిస్తాను” అని అన్నారు. పాతాళభైరవికి సంబంధించిన అరుదైన ఫోటోలు ఉంటే ఇవ్వమని అడిగాను. ఒక ట్రంకు పెట్టె తీసుకుని వచ్చి అందులో వెతికారు. ఒక నెగిటివ్ దొరికింది. అది చేతికి తీసుకోగానే చిరిగిపోయింది. నా చేతికి వచ్చేసరికి నాలుగైదు ముక్కలు అయ్యింది. అయినా నేను దానిని తీసుకుని వెళ్లి, ఒక ఫోటో స్టుడియోలో ప్రింట్ వేయమని చెప్పి అడిగాను. వారు కూడా ముక్కలను అతికించి ప్రింట్ వేశారు . అయితే అది ప్రింట్ సరిగ్గా రాకపోవడంతో దానిని ప్రచురించలేదు. ఈ సంఘటన తరువాత రెండు మూడు సార్లు పద్మనాభం గారిని కలిశాను. 2007లో అనుకుంటాను పద్మనాభం గారికి చాలా సీరియస్ గా ఉందని పుకార్లు వచ్చాయి. నాకు హైదరాబాద్ ఆఫీసు నుంచి ఫోన్ వచ్చింది. ఆయన ఇంటికి ఫోన్ చేస్తే ఫోన్ రింగ్ అవుతోంది కానీ, ఎవరూ తీయడం లేదు. నాలాగే ఈనాడు, ఆంధ్రజ్యోతి రిపోర్టర్లకు కూడా ఫోన్లు వచ్చాయి. వారు కూడా నాకు ఫోన్ చేశారు. అప్పటికే నేను చెన్నైలో సీనియరు కావడంతో నా దగ్గర వాకబు చేస్తుంటారు. అందరూ కలసి ఆయన ఇంటికి వెళ్లాము. బయట ఎటువంటి సందడి లేదు. ఆయన ఇల్లు మొదటి అంతస్తులో ఉంటుంది. ఇంటి వద్దకు వెళ్లి కాలింగ్ బెల్ నొక్కాము. ఆయనే స్వయంగా వచ్చి తలుపు తీశారు. ‘ఏంటి బాబు అందరూ వచ్చారు. ఏదైనా విశేషమా’ అని అడిగారు. మాకు ఏం చెప్పాలో తెలియక నోట మాటరాలేదు. కొంచేపడి తరువాత నెమ్మదిగా నేనే చెప్పాను. మీకు ఆరోగ్యం సరిగ్గా లేదని అంటే చూద్దామని వచ్చామని చెప్పాను. అటువంటిది ఏమీ లేదే నేను ఆరోగ్యంగానే ఉన్నాను అని చెప్పారు. ఎలాగూ వచ్చారు కదా అని ఆయన రాసుకున్న ఆత్మకథ పుస్తకాన్ని ఒక టి ఇచ్చారు. త్వరలోనే ఈ పుస్తకాన్ని విడుదల చేస్తున్నాము అని చెప్పారు. అభినందనలు తెలియజేసి వచ్చేశాము. ఇదేవిధంగా కొంత మంది సీనియర్ నటీనటులకు ఆరోగ్యం సరిగ్గా లేదని, లేదా మరణించారని పుకార్లు వస్తుండేవి. హైదరాబాద్ ఆఫీసు నుంచి మాకు ఫోన్లు రావడంతో పలుసార్లు ఇటువంటి ఇబ్బందులు ఎదుర్కొనడం జరిగింది. ఒక నేపథ్య గాయకుడి సతీమణి మరణించినట్లు రాత్రి పది గంటలకు వదంతులు వచ్చాయి. ఎడిషన్ క్లోజ్ అయ్యే సమయమని వెంటనే వాకబు చేసి, తమకు సమాచారం ఇవ్వాలని హెడ్ ఆఫీసు నుంచి ఫోన్లు వచ్చాయి. దీంతో ఆ గాయకుడి కుమారుడుకి ఫోన్ చేశాను. ఆయన ఫోన్ తీయలేదు. వారి కుమార్తెకు ఫోన్ చేశాను అర్ధరాత్రి ఎవరు ఫోన్ అని పెట్టేశారు. ఇక చేసేది ఏమీ లేక నేను ఆ వార్త ఇవ్వలేనని చెప్పేశాను. మరుసటి రోజు ఆ గాయకుడి కుమారుడు ఫోన్ చేసి, మీ మిస్ కాల్ ఉంది. ఎందుకు ఫోన్ చేశారని అడిగారు. ఆయన నాకు కొద్దిగా సన్నిహితంగా ఉంటారు కాబట్టి, విషయం చెప్పాను. ఆయన నవ్వేసి, అటువంటిది ఏమీ లేదు ఆమె బాగున్నారు అని చెప్పారు. ఇటువంటి సంఘటనలు చెన్నైలో అనేకం జరిగాయి కొన్ని నిజమయ్యాయి కూడా.

ఎం.ఎస్.సుబ్బలక్ష్మి గారి దర్శన భాగ్యం…
ప్రఖ్యాత గాయిని ఎంఎస్. సుబ్బులక్ష్మి గారిని ఒక సారి అనుకోకుండా కలిసే అవకాశం వచ్చింది. ఆమె తన భర్త సదాశివం 1997లో మరణించగా అప్పటి నుంచి ఆమె ప్రదర్శనలు ఇవ్వడం మానేశారు. ఇంట్లోనే ఉండేవారు. ఎక్కడా చిన్న కార్యక్రమానికి కూడా వెలుపలకు వచ్చే వారుకారు. అయినా ఆమెకు అవార్డులు, బిరుదులు ఇంటికి వెతుక్కుంటూ వస్తూనే ఉండేవి. నేను వార్తలో పని చేస్తుండగా, ఒక రోజు వార్త సీఎండి గిరీష్ సంఘ్ గారు ఫోన్ చేసి, కాంచీపురం పరిసరాల్లో కంచి కామకోటి పీఠాధిపతి స్వర్గీయ చంద్రశేఖరేంద్ర సరస్వతికి మహామణి మండపం నిర్మిస్తున్నారట దాని గురించి వివరాలు సేకరించి వార్త ఇవ్వు అని చెప్పారు. ఎవరు నిర్మిస్తున్నారో కూడా తెలియని పరిస్థితుల్లో తమిళ విలేకరుల సహాయంతో ఆ మహామణి మండపం నిర్మిస్తున్న వారి గురించి తెలుసుకున్నాను. శ్రీశ్రీశ్రీ మహాలక్ష్మి మాతృభూతేశ్వర ట్రస్టు పేరుతో కొంత మంది ఒక కమిటీగా ఏర్పడి నిర్మిస్తున్నారని తెలిసింది. ఆ ట్రస్టు కార్యాలయం కోట్టూరుపురంలో ఉంది. వారికి ఫోన్ చేసి, ఆత్మానందం అనే ఒక ట్రస్టీని మణిమండపం గురించి వివరాలు అడిగాను. ఆఫీసుకు వస్తే ఇస్తానని అన్నారు. సరేనని అప్పాయింట్ మెంట్ తీసుకుని ఆయన వద్దకు వెళ్లాను. ఆ కార్యాలయం మొదటి అంతస్తులో ఉండగా, కింది అంతస్తులో ఎంఎస్. సుబ్బులక్ష్మి గారు ఉన్నారు. నేను నేరుగా ఆయన వద్దకు వెళ్లాను. ఆత్మానందం గారు ఎంఎస్ సుబ్బులక్ష్మి గారికి కేర్ టేకర్ అని, ఆమెకు కుమారుడి లాంటి వాడినని తరువాత ఆయన మాటల మధ్య చెప్పారు. సుబ్బులక్ష్మి గారిని ఒక సారి చూడవచ్చా అని అడిగాను. కుదరదు ఆమెకు ఎటువంటి ఇన్ఫెక్షన్ సోకకూడదు అన్నారు. నిరాశతో మణిమండపం వివరాలు అడిగాను. ఆయన మణిమండపాన్ని 12 కోట్ల రూపాయల ఖర్చుతో నిర్మిస్తున్నామని, దాదాపు 7.5 ఎకరాల స్థలంలో నిర్మాణం చేపడుతున్నట్లు ఇంకా ఇతర వివరాలు తెలిపారు. ఆయనతో రెండు గంటలకు పైగా వివరాలు అడుగుతూ గడిపాను. తరువాత ఆయన ‘మహాస్వామి దర్శనం’ అనే ఒక పుస్తకాన్ని ఇచ్చారు. ఆ పుస్తకంలో చంద్ర శేఖరేంద్ర సరస్వతికి చెందిన అరుదైన ఫోటోలు ఉన్నాయి. ఈ పుస్తకం చూస్తూ ఉండు ఇప్పుడే వస్తాను అని వెళ్లారు. బహుశా కాఫీ తీసుకుని రావడానికి వెళ్లారేమో అనిపించింది. ఒక 20 నిముషాల తరువాత ఆయన వచ్చారు. ‘వాంగు పోలామ్ ( రండి వెళదాం” అని అన్నారు. కింద అంతస్తుకు తీసుకుని వెళ్లి, ఎంఎస్ సుబ్బులక్ష్మి గారి ఇంట్లో కూర్చొబెట్టారు. అమ్మను చూపిస్తాను ఆమెతో ఒకటి రెండు మాటల కన్నా ఎక్కువ మాట్లాడ కూడదు. రెండు నిముషాల కన్నా ఎక్కువ అక్కడ ఉండ కూడదు అని అనేక షరతులు పెట్టారు. మీ ఇష్టం అని చెప్పి, ఏదో ఒక విధంగా ఆమెను చూస్తాము కదా అని వెళ్లాను. ఒక చిన్న గదిలో ఆమె ఉన్నారు. అందులో ఎసి కూడా లేదు. ఆమెకు ఎసి ఉండకూడదు అని డాక్టర్లు చెప్పా రట. ఒక మంచం ఉంది. దానిపై బెడ్ కూడా లేదు. ప్లాస్టిక్ నవారు మంచం మీద పడుకుని ఉన్నారు. వెళ్లి ‘అమ్మా’ అని పిలిచారు. ఆమె లేచి కూర్చొన్నారు. నన్ను పరిచయం చేశారు. నేను ఆమె పాదాలకు నమస్కారం చేశాను. ‘నల్లా ఇరు నల్లా ఇరు (బాగుండండి)’ అని దీవించారు. నేను అక్కడ ఉన్నంత సేపు ఆమె నవ్వుతూనే ఉన్నారు. తరువాత ఎలా ఉన్నారు, ఎక్కడ ఉంటున్నారు. అని ప్రశ్నించారు. బాగున్నానని, మహాలింగపురంలో ఉంటున్నానని చెప్పాను. నీ భార్య ఏమి చేస్తారు. ఆమె బావున్నారా, పిల్లలు ఏమి చేస్తారు అని అడిగారు. అప్పటికి మా బాబు వయస్సు ఒక సంవత్సరం అంతే, నా స్వంత ఊరు తిరుపతి అనగానే ఆమె చాలా సంతోషించారు. తిరుపతి అంటే తనకు ఎంతో ఇష్టమని అన్నారు. ఆ దేవుడికి సేవ చేసే భాగ్యం నాకు కలిగిందని అన్నారు. మీరు కచ్చేరీలు ఇవ్వక పోవడం వల్ల నాలాంటి వాళ్లు మిమ్మల్ని చూసే అవకాశం లేకుండా పోయింది అన్నాను. “అవరు ఇల్లామే నాన్ వెలియ ఎంగుమే పోగరదు ఇల్లే (ఆయన లేకుండా నేను ఎక్కడకు వెళ్లలేదు) అన్నారు. రెండు నిముషాల్లో వెళ్లి పోవాలన్న నిబంధన అక్కడ అడ్డురాలేదు. దాదాపు అర గంటకు పైగా ఆమెతో మాట్లాడి అక్కడ నుంచి వచ్చేశాను. మణి మండపం గురించి వార్త మెయిన్ పేజీలో వచ్చింది. అది తీసుకుని ఆత్మానందంకు ఇచ్చాను. అప్పటి నుంచి ఆయనతో తరుచూ మాట్లాడుతూ ఉన్నాను.ఎంఎస్ సుబ్బులక్ష్మి గారి ఆరోగ్యం క్షీణించింది అని తెలిసింది. అప్పటి నుంచి మరింత అప్రమత్తమయి, ఆత్మానందం గారితో టచ్ లో ఉంటూ వచ్చాను. ఆమె గంటల్లోనే మరణించే అవకాశాలు ఉన్నట్లు డాక్టర్లు చెప్పారని సమాచారం అందింది. 2004 డిసెంబరు 11వ తేదీన నేను తిరుపతికి రావాల్సి వచ్చింది. ఆమె మరణిస్తే ఆ వార్తను ఎలా ఇవ్వాలి అనే మీమాంసలో పడ్డాను. ఏదైతే ఏమయ్యిందని ఆమె మరణించారు అనే వాక్యం మినహా మిగిలిన న్యూస్ ఐటెమ్, స్టోరీ అంతా కంపోజ్ చేసేశాను. వార్త నెట్ వర్క్ ఇన్ చార్జి శ్రీనివాస్ గారికి, తిరుపతి ఎడిషన్ ఇన్ చార్జి నజీర్ గారికి విషయం అంతా చెప్పాను. ఐటెమ్ పక్కన పెట్టుకోమని, తాను చెప్పిన తరువాత పబ్లిష్ చేయమని కోరాను. రాత్రి 9 గంటలకు చెన్నైలో బస్సు ఎక్కి తిరుపతికి బయలుదేరాను. సగం దూరం వచ్చాక అంటే 11 గంటల సమయంలో ఎంఎస్.సుబ్బులక్ష్మి గారు మరణించారనే వార్త తెలిసింది. అప్పటికే సెల్ ఫోన్లు ఉండటంతో, నాకు ఈ సమాచారాన్ని చేరవేశారు. నేను వెంటనే శ్రీనివాస్ గారికి, నజీర్ గారికి చెప్పి, ఐటెమ్ పబ్లిష్ చేయించుకున్నాను. ఈ విధంగా ప్రముఖ గాత్ర విద్వాంసురాలు ఎంఎస్.సుబ్బులక్ష్మి గారితో పరిచయం ఏర్పడటం ఒక మరుపురాని ఘట్టంగా భావిస్తాను.

  • మోహన్ రావు, తిరుపతి

2 Comments

Leave a Reply

Your email address will not be published.


*