‘చే’ నుంచి ‘షా’ దిశగా పవన్‌ పయనం…!

జనసేన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ రెండు రోజులుగా చేస్తున్న వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. అనేక ఊహాగానాలకు అవకాశం కల్పిస్తున్నాయి. బిజెపి అగ్రనేత అయిన అమిత్‌ షా అంటే తనకు గౌరవమని చెప్పారు. అమిత్‌ షా వంటి నాయకులే సరైనవాళ్లంటూ కితాబులిచ్చారు. తానూ ఏనాడూ బిజెపికి దూరంగా లేనని అన్నారు. భవిష్యత్తులో బిజెపితో కలుస్తారా అంటే….కలవచ్చు అనే అర్థమొచ్చేలా మాట్లాడారు. ఇవన్నీ ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి.

గత ఎన్నికల్లో జనసేన పార్టీ వామపక్షాలతోనూ, బిఎస్‌పితోనూ కలిసి పోటీ చేసింది. పవన్‌ కల్యాణ్‌ మొదటి నుంచి కమ్యూనిస్టు పార్టీలకు దగ్గరగా ఉంటూ వచ్చారు. ఆయన మాటల్లో అభ్యుదయం కనిపించేది. బహిరంగ సభల్లో ఆవేశపూరితంగా చదివే కవితలు వినిపించేవి. తన ఉపన్యాసాల్లో క్యూబా విప్లవ వీరుడు చేగువీరా వంటి యోధులను ఉటంకించేవారు. ఎన్నికలు ముంచుకొచ్చిన వేళ ఉత్తరప్రదేశ్‌కు వెళ్లి మాయావతిని కలిసి బిఎస్‌పితో పొత్తు కుదుర్చుకుని వచ్చారు.

ఎన్నికలై ఆరు నెలలైనా తిరగక మునుపే పవన్‌ కల్యాణ్‌ ఇప్పటిదాకా అనుసరించిన రాజకీయాలకు పూర్తి భిన్నమైన వైఖరి తీసుకున్నారు. స్వరం మార్చారు. కాంగ్రెస్‌, వైసిపి, టిడిపి, బిజెపిలకు ప్రత్యామ్నాయంగా ఎదుగుతానని చెప్పుకున్న ఆయన ఇప్పుడు బిజెపికి దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు. ఉత్తరాధి ఆధిపత్యాన్ని సహించబోమంటూ ఎన్నికల సమయంలో బిజెపిపై నిప్పులు చెరిగిన పవన్‌ ఇప్పుడు ఆ పార్టీ నేతలను కీర్తిస్తున్నారు. బిజెపి ప్రభుత్వం అనుసరించే విధానాల వల్ల దేశంలో వేర్పాటువాద భావనలు వేళ్లూనుకునే ప్రమాదముందని తీవ్రస్థాయిలో అప్పట్లో మండిపడ్డారు. ఇప్పుడేమో…ఒక ప్రత్యేక హోదా అంశంలో తప్ప మరే అంశంలోనూ బిజెపితో విభేదాలు లేవని చెబుతున్నారు.

జనసేన మూల సిద్ధాంతాల నుంచే పవన్‌ దూరంగా జరుగుతున్నట్లు అనిపిస్తోంది. ఆ పార్టీకి ఏడు మూల సూత్రాలున్నాయి. అందులో…మత ప్రమేయం లేని రాజకీయాలు, కులాలను కలుపుకెళ్లే రాజకీయాలు…ఈ రెండూ ప్రధానమైనవి. గత కొన్ని రోజులుగా పవన్‌ మాట్లాడుతున్న మాటలు చూస్తుంటే…ఈ రెండు సూత్రాలను గాలికొదిలేసినట్లు అనిపిస్తుంది. ఆయన మతాల గురించి, కులాల గురించి పదేపదే మాట్లాడుతున్నారు. అక్కడో ఇక్కడో మత మార్పిళ్లు జరిగితే….దాన్ని పెద్దదిగా చేసి రోజూ ప్రస్తావిస్తున్నారు. ఆఖరికి తిరుపతిలో అన్యమత ప్రచారం జరిగిపోతోందంటూ కొందరు మతతత్వ శక్తులు చేస్తున్న ప్రచారాన్నే పవన్‌ కూడా చేస్తున్నారు.

ఎన్నికల్లోగానీ, అంతకు మునుపుగానీ కుల మతాల ప్రస్తావనను పవన్‌ ఎన్నడూ తీసుకురాలేదు. జనసేనను ఒక కులానికి చెందిన పార్టీగా ముద్ర వేయడానికి ప్రయత్నిస్తున్నారని చెప్పే సందర్భంగా కుల ప్రస్తావన చేశారుగానీ…మతం గురించి, మత మార్పిళ్ల గురించి ఎన్నడూ మాట్లాడలేదు. అలాంటిది ఇప్పుడూ రోజూ సతాన ధర్మం, మత మార్పిళ్లు ఇవే ఆయన ఉపన్యాసంలో ప్రధాన అంశాలుగా మారిపోయాయి. పవన్‌ ఉపన్యాసాలు వింటుంటే ఆయన ఏ బిజెపి నాయకుడో లేక మఠాధిపతో అనిపించేలా ఉన్నాయి. కొసమెరుపు ఏమంటే….తిరుమల శ్రీవారి దర్శనం సందర్భంగా గతంలో ఏన్నడూ లేని పీఠాధిపతిలాగా ఒంటిపైన ఒక ఉత్తరీయం మాత్రమే కప్పుకుని వెళ్లడం. ఇవన్నీ బిజెపికి దగ్గరైన పవన్‌కు సంకేతాలుగా చెబుతున్నారు పరిశీలకులు.

పవన్‌ తీరుచూసి ఇప్పటిదాకా ఆయనతో చెలిమి చేసిన వామపక్షాలు విస్మయానికి గురవుతున్నాయి. మొన్నటిదాకా మాతో చెప్పిన మాటలేమిటి, ఇప్పుడు మాట్లాడుతున్నది ఏమిటని ప్రశ్నిస్తున్నాయి. అందుకే పవన్‌ది రాజకీయ అవకాశవాదంగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు విమర్శించారు. పవన్‌ తీరు ఆత్మహత్యాసదృశ్యమని ఆ పార్టీ కేంద్ర నాయకులు వి.శ్రీనివాసరావు అభివర్ణించారు. సిపిఐ కూడా ఇటువంటి విమర్శలే చేసింది. ఎన్నికలకు ముందు బిజెపితో విభేదించిన పవన్‌…ఎన్నికల తరువాత ఆ పార్టీలో ఏ మార్పు వచ్చిందని పొగుడుతున్నారో చెప్పాలని వామపక్షాలు నిలదీశాయి.

జనసేనాని తీసుకున్న వైఖరి రాష్ట్ర ప్రజలకు నష్టమా, లాభమా అనే సంగతి పక్కనపెడితే….ఒక పార్టీగా జనసేన మనుగడనే ప్రశ్నార్థకంగా చేసేదిగా విశ్లేషకులు చెబుతున్నారు. జనసేనను తమ పార్టీలో విలీనం చేస్తారని బిజెపి నాయకులు అప్పుడే ప్రచారం మొదలుపెట్టారు. ‘జనసేనకు మద్దతు ఇచ్చి….ఆ పార్టీని బలోపేతం చేయాల్సిన అవసరం మాకు లేదు. ఆయన జనసేనను మా పార్టీలో విలీనం చేయాలి’ అని బిజెపి నేత జివిఎన్‌ అంటున్నారు.

పవన్‌ తీరుతో జనసేన కార్యకర్తల్లోనూ ఆందోళన మొదలయింది. ఎవరు అవునన్నా కాదన్నా….కాపు సామాజికవర్గం ప్రధానంగా పవన్‌కు అండదండగా ఉంది. గతంలో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ స్థాపించినపుడు…ఆ పార్టీపైన ఆశలు పెట్టుకున్నారు. తీరా దాన్ని కాంగ్రెస్‌లో కలిపేశారు. ఆ తరువాత పవన్‌ వచ్చారు. జనసేన పార్టీని స్థాపించారు. ఎప్పటికైనా జనసేనను అధికారంలోకి తీసుకొస్తారన్న నమ్మకంతో ఉన్న ఆ పార్టీ కార్యకర్తలకు తాజా పరిణామాలు తీవ్ర నిరాశను కలిగిస్తున్నాయి.

మళ్లీ మొదటికొస్తే….చేగువీరా ప్రపంచంలోనే అరుదైన యోధుడు. క్యూబాలో విప్లవం సాధించినా అధికారాన్ని అనుభవించకుండా మరో దేశంలో విప్లవం సాధించడం కోసం వెళ్లి ప్రాణాలు అర్పించిన వీరుడు. అటువంటి స్ఫూర్తిదాయకమైన నేతను ఆదర్శంగా చెప్పిన పవన్‌….చివరికి అమిత్‌ షాను కీర్తించే దిశగా అడుగులు లేస్తున్నారు. ఈ అడుగులు ఆయన్ను ఎక్కడికి తీసుకెళుతాయో చూడాలి…!

-ఆదిమూలం శేఖర్‌, సంపాదకులు, ధర్మచక్రం

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*