చైనాలో తినే కప్పలు, పాములు కాదు…రాయలసీమలో తినే పురుగుల గురించి తెలుసా…!

రాయలసీమలో ఈసిళ్లు అని పిలిచే వీటిని ఇతర ప్రాంతాల్లో ఉసిళ్లు అని కూడా వ్యవహరిస్తారు. ముంగారి వాన కురిసినప్పుడు మరుసటి రోజు సాయంకాలం ఇవి పుట్టల నుంచీ విపరీతంగా బయటికి వస్తాయి. వేసవి కాలంలో ఆహారం లేక అలమటించే చాలారకాల పక్షులు,కోతులు, పాములు, తేళ్లు, చీమలు…లెక్కలేనన్ని ప్రాణులకు అద్భుత ఆహారమై తరిస్తాయి.

ఇప్పుడు విరివిగా దొరుకుతాయో లేదో తింటారో తినరో తెలియదుకానీ….1980 మేము వ్యవసాయం మాని వేసి గ్రామీణ వాతావరణానికి దూరమయ్యేదాకా బాగా తినేవాళ్లం.

అప్పుడు ముఖ్యంగా ముంగారి వానలు పడక పొతే పనులు లేని, తిండికి జరగని కొన్ని కుటుంబాల వారు కృత్రిమంగా వీటిని ఉత్పత్తి చేసేవారు. ఈ తరానికి తెలియడానికి ఈ పోస్టు…

మెట్ట ప్రాంతంలో పుట్టల మీద ఉన్న చెట్టూ చేమల్ని తీసి వేసి, పది ఇరవై కుండల నీటిని పుట్ట కూమల్లో (పుట్టకు ఉన్న రంధ్రాల్ని కూమలు అంటారు) పోస్తారు. అనంతరం పుట్ట మీద ఒక అడుగు మేర వెలితి (గ్యాప్) ఉండేలా వెదురు, బేలు దబ్బలు వగైరాలను గొడుగులాగా అమర్చి వాటి మీద ఆకులు పరిచి గాలి వెలుతురు చొరబడకుండా బురద మట్టిని దట్టిస్తారు.

ఒక పక్క బెత్తెడంత ద్వారం లాంటిది కూడా ఏర్పాటు చేసి ఆకులతో కప్పివేసి మరుసటి దినం ద్వారం వంటిదాని దగ్గర కూర్చొని చేతిలో కుండ పెంకును పట్టుకొని దాని మీద మోదుగ గింజను నూరుతుతారు. అలా రుద్దేసమయంలో ఏర్పడే పొడి పుట్టలోనికి పోయేవిధంగా నిరవధికంగా నోటితో ఊదుతూనే ఉంటారు.

ఇలా చేయడంతో పుట్టలో కృత్రిమ ఋతువాతావరణం ఏర్పడి ఈసిళ్లు తయారై బయటికి వస్తాయి. అవి బయటికి వచ్చే చోటు అడుగు పొడుగున్న గుంత తీసి దాని గోడలకు వెడల్పాటి ఆకులు మెత్త వేస్తారు. బయటికి వచ్చినవి ఆ గుంతలో పడి ఆకుల మీద పైనికి ఎక్కలేక జారుతూ అందులోనే ఉండి పోతాయి. వాటిని తీసి కడవలో నించితే కొంత సేపటికి రెక్కలు ఊడిపోతాయి. మరలా ఐదు నిమిషాలు ఎండలో కానీ పొయ్యి మీదకాని ఉంచితే అన్నీ చనిపోతాయి.

వాటిని చాపల మీద ఎండించి ఊరయిన ఊరూ తిరిగి ఒకటికి నాలుగు కొలతల గింజలకు అమ్ముతారు.(డబ్బులకు అమ్మింది నేను చూడలేదు) మా ప్రాంతంలో ఈ ఈసిళ్లకు శెనగపప్పులు, కారాబూందీ, వట్టి మిరప, తెల్ల పాయలూ కలిపి ఇష్టంగా తింటారు. మేమయితే సాయంకాలం పుట్టల నుండీ బయటికి వచ్చే వాటిని పట్టుకొని రెక్కలు తీసివేసి అలాగే తినేవాళ్ళం.

ఈ మధ్య కరోనా క్రిముల ఉత్పత్తికి చైనాలో మనుష్యులు గబ్బిలాలు తినడం వల్లనే!! అని కొందరు అసహ్యించుకొంటూ ఉన్నారు. ఇప్పుడు ఏమోకానీ 1999 దాకా పల్లెల్లో ఉడుతలనూ,గబ్బిలాలనూ,సీకిరేవులు అని పిలిచే గబ్బిలం జాతి పెద్దజాతినీ ప్రజలు తినడం నాకు తెలుసు. అంతెందుకు రైతులు మా ప్రాంతంలో పట్టుపురుగులు పెంచుతారు.(1980 దాకా నేనూ పెంచేవాడిని) గూడు అల్లడానికి మొదట శ్యాంపుల్ వచ్చిన పురుగులను బట్టలో వేసి రసాన్ని పిండి దండిగా దిగుబడి, ధరా రావాలనే కోరికతో మొక్కుబడి అన్నట్లు తాగుతారు. ఇలాంటి ఎన్ని అలవాట్ల నుంచీ మనం బయటికి వచ్చామో ఎక్కువ మందికి తెలియదు. వాటిని ఎవ్వరూ రికార్డుకూడా చేయలేదు.

ఇక్కడ చెప్పదలచుకొన్నది ఏమంటే మానవుని గతం చాలా భయంకరమైనది ఎన్నో అనుభవాలూ ఆటుపోట్లతో సాగివచ్చి ఈ స్థితిలో ఉన్నది. గ్రామీణుల జీవనం చాలా మందికి తెలియదు. మీరు ఒకేసారి సెల్ ఫోన్లు చేతిలో పట్టుకొని పుట్టి పై పై కనిపించేవాటిని చూసి తీర్మానాలు చేయవద్దు. (ఇక్కడ ఉంచిన చిత్రం తెలంగాణా పదాలు, ఇరిసెలు,సంస్కృతి సమూహంలోనిది)

(సడ్లపల్లె చిదంబర రెడ్డి వాల్ నుంచి సేకరణ)

2 Comments

Leave a Reply

Your email address will not be published.


*