ఛైర్మన్‌ భుజాలపై తుపాకీపెట్టి…! టిటిడి నిర్ణయంపై ఎన్నో అనుమానాలు!

ఏదైనా వివాదాస్పద నిర్ణయం తీసుకోవాలన్నా, తాము చేస్తున్న పని విమర్శలపాలవుతుందన్నా… మనమే నేరుగా చేయకూడదు. ఇంకొకరితో ఆ పని చేయించాలి. ఏదైనా సమస్యలు వస్తే వాళ్లే చూసుకుంటారు. మన చేతికి మట్టి అంటదు. ఇది ‘తెలివైనవాళ్లు’ చేసే పని. టిటిడిలోనూ అటువంటిదే జరుగుతోందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మహాసంప్రోక్షణ ఉత్సవాల వేళ దాదాపు వారం రోజుల పాటు శ్రీవారి దర్శనం నిలిపివేయాలని టిటిడి తీసుకున్న నిర్ణయం వెనుక అధికారులు ఇటువంటి వ్యూహాన్నే పాటించారన్న విమర్శలు వస్తున్నాయి. ఈ నిర్ణయం వివాదాస్పదం అవుతుందని తెలిసి… తమ నిర్ణయానికి ఛైర్మన్‌తో, బోర్డు సభ్యులతో ఆమోదముద్ర వేయించారని భక్తుల నుంచి విమర్శలు వస్తున్నాయి. దర్శనాలు పూర్తిగా నిలిపివేయాలని తీసుకున్న నిర్ణయాన్ని అందరూ తప్పుబడుతున్నారు. టిటిడి తీసుకున్న ఈ నిర్ణయంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

దర్శనాలు ఆపేయాల్సిన అవసరం ఏముంది?
ఇటీవల జెఈవో శ్రీనివాసరాజు మీడియాతో మాట్లాడుతూ మహాసంప్రోక్షణ జరిగే రోజుల్లో పూజాది కార్యక్రమాలు ఎక్కువగా ఉండటం వల్ల…రోజుకు 35 వేల మందికి మించి దర్శనాలు చేయించడానికి సాధ్యంకాదని చెప్పారు. తీరా శనివారం జరిగిన పాలక మండలి సమావేశంలో….ఆగస్టు 11వ తేదీ నుంచి 16వ తేదీదాకా ఎవరికీ శ్రీవారి దర్శనమే ఉండబోదని నిర్ణయించారు. ఈ విషయాన్ని ఛైర్మన్‌ పుట్టా సుధాకర్‌ యాదవ్‌ మీడియా సమావేశంలో చెప్పారు. సాధారణ రోజుల్లో 65 వేల నుంచి 70 వేల మంది దర్శనం చేసుకుంటున్నారు. మహాసంప్రోక్షణ పూజల వల్ల దర్శనానికి కేటాయించే సమయం తగ్గుతుంది కాబట్టి….కనీసం 30 వేల మందికి దర్శనం చేయించే అవకాశం ఉంది. అయితే….అసలు దర్శనాలకే ఎవరినీ అనుమతించకూడదని ఎందుకు నిర్ణయం తీసుకున్నారేది ప్రశ్న. దర్శనాలు ఉన్నాయని తెలిస్తే…మామూలుగా వచ్చినట్లు వచ్చేస్తారని, సంఖ్యపై పరిమితి విధించినా వచ్చే భక్తులను నియంత్రించలేమని, అందుకే పూర్తిగా దర్శనాలే లేకుండా నిర్ణయం తీసుకున్నామని టిటిడి అధికారులు చెబుతున్నారు.

సంఖ్యను 30 వేలకు పరిమితం చేసి దర్శనాలు చేయించడం పెద్ద సమస్యకాదు. ఈ వారంలోనే ఆన్‌లైన్‌లో టికెట్లు విడుదల చేస్తే (ఆ ఆరు రోజులకు) కావాల్సిన వారు ముందుగా బుక్‌ చేసుకుంటారు. అలా బుక్‌ చేసుకున్నవారికి మాత్రమే దర్శనం కల్పిస్తామంటే సరిపోతుంది. టికెట్లు లేనివారు ఎవరూ రారు. ఇదేదో పెద్ద సమస్య అన్నట్లు ఎవరికీ దర్శనం లేదని ప్రకటించారు. టికెట్లు లేనివారు ఎవరైనా వచ్చినా బయట అఖండం వద్ద కొబ్బరికాయ కొట్టుకుని, దర్శనం చేసుకుని వెళతారు. ఇందులో ఎలాంటి ఇబ్బందీ ఉండదు. దర్శనం కల్పించడానికి సమయం ఉన్నా…దాన్ని ఎందుకు వృథా చేస్తారనేది ప్రశ్న. పరిమితి విధించినా అంతకు మించి వచ్చేస్తారనే భయంతో అసంబద్ధమై నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం లేదు. గతంలో మహాసంప్రోక్షణ జరిగినపుడు ఎన్నడూ ఈ విధంగా దర్శనాలు ఆపేసిన ఉదంతాలు లేవు. ఇప్పుడు మాత్రం ఎందుకు ఆపేస్తారని భక్తులు ప్రశ్నిస్తున్నారు. దీనికి సరైన సమాధానం చెప్పాల్సిన బాధ్యత అధికారులపైన, పాలకమండలిపైన ఉంది.

విఐపిల కోసమేనా…
మహాసంప్రోక్షణ జరిగే ఆ ఆరు దర్శనాలు లేవని నిర్ణయించారుగానీ….ఆఫ్‌ ది రికార్డుగా మాట్లాడుతూ…ఈ ప్రకటన చేసినా ఆ రోజులోల (మహాసంప్రోక్షణ రోజుల్లో) ఎవరైనా భక్తులు తిరుమలకు వస్తే పరిమితి సఖ్యలో దర్శనాలు చేయిస్తాం. పూర్తిగా ఆపేసేది ఉండదు….అని చెబుతున్నారు. బోర్డులో ఇటువంటి నిర్ణయమే చేసినట్లు సమాచారం. కానీ బయటకు మాత్రం ఎవరికీ దర్శనం ఉండదని ప్రకటించారు. ఇలా చెప్పడం వెనుక నిగూఢమైన అర్థం దాగివుందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ రోజుల్లో బోర్డు సభ్యులు, విఐపిలు, వారి కుటుంబ సభ్యులకు దర్శనం కల్పించడం కోసమే అటువంటి నిర్ణయం తీసుకున్నట్లు విమర్శలు వస్తున్నాయి.

ఇదే మాటను కొందరు విలేకరులు ఛైర్మన్‌ను కలిసి అడిగారు. ఆయన కూడా…ముందుగా ‘అవకాశం బట్టి కొందరికి దర్శనం కల్పిస్తాం…బయటకు ఆ విషయం చెప్పడం లేదు’ చెప్పారు. ఇది ‘విఐపిలకు దర్శనం చేయించడం కోసమేనా’ అని విలేకరులు ప్రశ్నించే సరికి….అప్పటికప్పుడు ఈవో, జెఈవోలతో మాట్లాడారు. ‘ఆ ఆరురోజులు టిటిడి అధికారులు, బోర్డు సభ్యులు, అర్చకులు తప్ప…ఇతరులు ఎవరికీ దర్శనాలు ఉండవు’ అని చెప్పారు. అయినా విఐపిల ఒత్తిడి ఉండదని, ఆ రోజుకు టిటిడి అధికారులు తమ నిర్ణయాన్ని మార్చుకుని విఐపిలకు దర్శనం కల్పించబోరని చెప్పలేం. వాస్తవంగా దర్శనానికి సాధారణ భక్తులను ఎవరినీ అనుమతించకుండా, ఎవరైనా విఐపిలు వస్తే వారికి మాత్రమే దర్శనం కల్పించాలని అధికారులు ముందుగా తీసుకున్న నిర్ణయాన్ని బోర్డుతో చెప్పించారని తిరుమల పాత్రికేయులే వ్యాఖ్యానిస్తున్నారు.

పునరాలోచన అవసరం
టిటిడి పాలక మండలి తీసుకున్న ఈ నిర్ణయంపై పునరాలోచన చేయాల్సిన అవసరం ఉంది. మహాసంప్రోక్షణ జరిగే ఆరు రోజులు పరిమిత సంఖ్యలోనే భక్తులను దర్శనానికి అనుమతించాలి. ముందే చెప్పినట్లు ఈ టికెట్లను ఆన్‌లైన్‌ ద్వారా ఈ వారంలోనే విక్రయించాలి. ఇది చేయకుండా ఆ రోజుల్లో ఏదో ఒక పేరుతో విఐపిలను ఆలయంలోకి అనుమతిస్తే టిటిడి బోర్డు తీవ్ర విమర్శలు ఎదుర్కోవాల్సివస్తుంది. 12 ఏళ్లకు ఒకసారి జరిగే మహాసంప్రోక్షణ చూడాలని ప్రముఖులు అనుకోవచ్చు. తిరుమలకు వచ్చి ఒత్తిడి చేయొచ్చు. సాధారణ భక్తులకు అనుమతి ఉంటేనే విఐపిలకూ అనుమతి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఈ కోణంలో కూడా దర్శనాలు కల్పించడమే సరైన నిర్ణయం అవుతుంది.

ఛైర్మన్‌కు సూచన…
టిటిడి అధికారులు చెప్పినదానికి ఓకే అనేముందు అన్ని కోణాల నుంచి ఈ అంశంపై పరిశీలన చేయాల్సిన అవసరం ఛైర్మన్‌కు ఉంది. అవసరమైతే ముందుగానే టిటిడి వ్యవహారాల్లో అనుభవం ఉన్న వారితో చర్చించి, సలహాలు తీసుకుని నిర్ణయానికి రావాలి. ఎందుకంటే టిటిడిలో లోతైన, సున్నితమైన వ్యవహారాలున్నాయి. పొరపాటున వేసే అడుగులు తీవ్ర వివాదంలోకి నెట్టేస్తాయి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*