జగన్‌కు ఊహించని మేలు చేసిన చంద్రబాబు…!

ఆంధ్రప్రదేశ్‌లో సిబిఐ అడుగుపెట్టడానికి వీల్లేదంటూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తన నిర్ణయాన్ని సమర్ధించుకోడానికి ప్రభుత్వ పెద్దలు, టిడిపి నాయకులూ తంటాలుపడుతున్నారు. అయినా…ఆ వాదనలో ఎటువంటి తర్కరమూ కనిపించడం లేదు. మరోవైపు ప్రభుత్వ నిర్ణయాన్ని తమకు అనుకూలంగా మార్చుకోడానికి వైసిపి ప్రయత్నిస్తోంది. సిబిఐకి అనుమతి నిరాకరిస్తూ చంద్రబాబు తీసుకున్న నిర్ణయం జగన్‌ను అనూహ్యమైన వరంలాగా మారింది.

సిబిఐకి అనుమతి నిరాకరించడం ద్వారా రాష్ట్రంలో అవినీతిపరులను రక్షించడానికి చంద్రబాబు ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్న విమర్శలు వెల్లువెత్తాయి. అదేవిధంగా జగన్‌పై హత్యాయత్నం కేసులో సిబిఐ విచారణను తప్పించుకోడానికే ఇటువంటి నిర్ణయం తీసుకున్నారని వైసిపి చెబుతోంది. రాష్ట్రంలో జరిగిన అవినీతిపై విచారణ జరుగుతుందన్న భయంతో ముందు జాగ్రత్తగా సిబిఐకి అనుమతి నిరాకరిస్తూ జీవో ఇచ్చారన్న ప్రచారమూ జోరుగా సాగుతోంది.

రాష్ట్రంలోని అన్ని పార్టీలూ చంద్రబాబు నిర్ణయాన్ని తప్బుపట్టాయి. ఆఖరికి సిబిఐ మాజీ జెడి లక్ష్మీనారాయణ కూడా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరైనది కాదన్నారు. అవినీతిని అడ్డుకోవాలని అతర్జాతీయ వేదికలపై చెప్పి…అందుకు విరుద్ధమైన నిర్ణయం తీసుకోవడాన్ని ఆయన ఎత్తిచూపారు. ఈ నిర్ణయం ప్రభుత్వానికి అప్రతిష్ట తెచ్చిందనడంలో సందేహం లేదు.

ఈ క్రమంలో తెలుగుదేశం నాయకులు తమ నిర్ణయాన్ని సమర్ధించుకోడానికి అపసోపాలు పడుతున్నారు. ఏవేవో వివరణలు ఇస్తున్నారు. అవేవీ జనంలో తలెత్తిన అనుమానాలను నివృత్తిచేసేవిగానూ, సమాధానపరిచేవిగానూ లేవు. కోర్టు ఆదేశంతో జరిగే సిబిఐ విచారణలను రాష్ట్రం అడ్డుకోజాలదని ప్రభుత్వ పెద్దలే అంగీరిస్తున్నారు.

ఒక కుంభకోణం లేదా ఒక నేరం ఒకటికంటే ఎక్కువ రాష్ట్రాల్లో విస్తరించినపుడు…ఒక రాష్ట్రం సిబిఐ విచారణ కోరితే…మిగిలిన రాష్ట్రాల్లోనూ సిబిఐ విచారణ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇక ఆయా రాష్ట్రాల్లో తీవ్రమైన నేరాలు జరిగినపుడు…ఆ రాష్ట్ర ప్రభుత్వమే విచారణ కోసం సిబిఐని ఆశ్రయిస్తుంది. ఈ మూడు పద్ధతులు ఇప్పటికీ (సిబిఐకి అనుమతి నిరాకరిస్తూ జీవో ఇచ్చిన తరువాత కూడా) ఆంధ్రప్రదేశ్‌లో అమలవుతాయని, వీటిని ఎవరూ అడ్డుకోలేరని ప్రభుత్వ పెద్దలు చెబుతున్నారు.

అలాంటప్పుడు…ఈ జీవో వల్ల ప్రభుత్వానికి ఒరిగే లాభమేమిటో తెలియదు. అందుకే ఉండవల్లి అరుణ్‌ కుమార్‌ వంటి వాళ్లు…ఈ జీవోను టిష్యూ పేపర్‌తో పోల్చారు. అయితే…ఏ ప్రయోజనమూ లేకుండా ప్రభుత్వం అంత అనాలోచితంగా జీవో ఎందుకు జారీ చేసిందనేది ప్రశ్న. అవినీతి విషయంలోగానీ, జగన్‌పై హత్యాయత్నం కేసులోగానీ కోర్టు ఆదేశాలతోగానీ, రాష్ట్ర ప్రభుత్వ అనుమతితోగానీ నిమిత్తం లేకుండా…కేంద్రం విచారణకు ఆదేశించే అవకాశం ఉండటం వల్లే చంద్రబాబు జాగ్రత్తపడ్డారని విశ్లేషకులు చెబుతున్నారు.

సాధారణంగా రాష్ట్ర ప్రభుత్వ అనుమతి లేకుండా…కేంద్రం సిఐబి విచారణ వేయదు. అయితే…జగన్‌పై హత్యాయత్నం కేసులో, రాష్ట్రంతో సంబంధం లేకుండా సిబిఐ విచారణ వేయడానికి అవకాశాలున్నాయి. ఈ కేసులో సిట్‌తో కాకుండా సిబిఐతో విచారణ జరిపించమని వైసిపి కోరితే…అది విమానాశ్రయంలో జరిగిన ఘటన కాబట్టి రాష్ట్రానికి సంబంధం లేదని టిడిపి వాదించింది. విమానాశ్రయం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోకి రాదనే సాంకేతిక కారణాన్ని పెద్దదిగా చూపిస్తూ వచ్చింది. అదే సాంకేతిక కారణంతో….కేంద్రం తలచుకుంటే వెంటనే సిబిఐ విచారణకు ఆదేశించవచ్చు. ఎందుకంటే, తమ పరిధిలోని విమానాశ్రయంలో జరిగిన నేరంపై సిబిఐతో విచారణ చేయించే అధికారం కేంద్రానికి ఉంటుంది. అప్పుడు రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంతో సంబంధం లేకుండా కేసు సిబిఐ పరిధిలోకి వెళుతుంది. ఇవన్నీ ఊహించే సిబిఐకి అనుమతి నికారించారని భావించాలి.

దీన్ని ప్రభుత్వం అంగీకరించడం లేదు. సిబిఐ ప్రతిష్ట దిగజారిందని, అందుకే దాన్ని అడ్డుకుంటున్నామని చెబుతున్నారు. దీనికి జెడి లక్ష్మీనారాయణ ఓ ప్రశ్న వేశారు. న్యాయమూర్తులపైనా ఆరోపణలు వస్తున్నాయి…అందుకని కోర్టులను మూసేద్దామా…అని అడిగారు. ఇది కరెక్టేకదా….వ్యవస్థలో లోపాలుంటే దాన్ని ఎలా సరిచేయాలో చూడాలి తప్ప దాన్ని ధ్వసం చేస్తామంటే ప్రజలు అంగీకరించారు. టిడిపి మరో వాదన కూడా తెస్తోంది. పది రాష్ట్రాలు మాత్రమే సిబిఐకి సాధారణ సమ్మతి ఇచ్చాయని, మిగిలినవి ఇవ్వలేదని వాదిస్తోంది. ఆ రాష్ట్రాలు చాలాకాలంగా సమ్మతి ఇవ్వలేదు. ఇక్కడ అలాకాదు…ఆగస్టులో సమ్మతి తెలియజేసి, నవంబర్‌లో ఉపసంహరించుకున్నారు. ఇదంతా రాజకీయ ఉద్దేశంతోనే చేశారనే విషయం సాధారణ ప్రజలకూ తెలిసిపోయింది. అందుకే ప్రభుత్వ చెబుతున్న వాదనకు విలువలేకుండాపోయింది.

ఇక ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వైసిపికి ఆయాచిత వరంలా మారింది. జగన్‌పై హత్యాయత్నం కేసులో ప్రభుత్వ పెద్దలే ప్రధాన ముద్దాయిలు అని చెబుతూ వస్తున్న ఆ పార్టీ….ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో తమ ఆరోపణలకు బలం వచ్చిందని చెబుతోంది. జగన్‌ కేసులో విచారణ జరగుతుందన్న భయంతోనే చంద్రబాబు ఇటువంటి చర్యలకు దిగారని చెబుతోంది. అదేవిధంగా కాంగ్రెస్‌ హయాంలో జగన్‌పై ఏసిబి పెట్టిన కేసులూ ఇటువంటి రాజకీయ కక్షసాధింపుతోనే పెట్టినవని చెప్పుకోడానికి ఈ సందర్భంగా చాలా బాగా ఉపయోగపడుతోంది. ఏమైనా సిబిఐకి ఎర్రజెండా చూపించాలనుకున్న నిర్ణయం టిడిపికి నష్టం చేస్తుంటే వైసిపికి అనుకూలంగా మారింది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*