జగన్‌ను రాత్రికి రాత్రే ఉరి వేయాలి…మా జోలికి ఎవరూ రాకూడదు..!

తెలంగాణలో ఫైర్‌ బ్రాండ్‌ రేవంత్‌ రెడ్డి ఇంటిపైన, ఇంకా ఓటుకు నోటు కేసులో నిందితులుగా ఉన్న ఉదయ్‌ సింహ ఇంటిపైన ఆదాయపన్ను శాఖ దాడులు నిర్వహించింది. వారం పది రోజుల తేడాలోనే ఇటు ఆంధ్రప్రదేశ్‌లోనూ తెలుగుదేశం నేతలకు చెందిన వ్యాపార సంస్థలపైన ఐటి దాడులు ప్రారంభమయ్యాయి. ఈ రెండు చోట్ల జరుగుతున్న దాడులపై తెలుగుదేశం, కాంగ్రెస్‌ నాయకులు గగ్గోలు పెడుతున్నారు. రాజకీయ కక్షలతోనే దాడులకు పాల్పడుతున్నారని ఆరోపిస్తున్నారు.

రాజకీయ కక్ష సాధింపు కోసం…ఏసిబి, సిబిఐ, సిఐడి, ఐటి వంటి సంస్థలను ఉపయోగించుకోవడం కొత్తకాదు. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా రాజకీయ ప్రత్యర్థులను ఇబ్బందిపెట్టడానికి ఇటువంటి చర్యలకు పాల్పడుతూనే ఉన్నాయి. అయితే…బాధితులుగా మారినపుడు ఒకరకంగానూ, బాధించగల స్థానంలో ఉన్నప్పుడు ఒక రకంగానూ స్పందిస్తున్నారు నాయకులు. కేంద్రం కక్ష సాధిస్తుందని గగ్గోలు పెట్టే ప్రాంతీయ పార్టీలూ…తాము అధికారంలో ఉన్నచోట అదేపని చేస్తున్నాయి. తమిళనాడులోనైతే…. జయలలిత-కరుణానిధి మధ్య రాజకీయ వైరం ఒకరినొకరు జైల్లో పెట్టుకున్న ఉదంతాలున్నాయి.

వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిపై పెట్టిన కేసులు రాజకీయ కక్ష సాధింపులో భాగమే అనేది బహిరంగ రహస్యం. కాంగ్రెస్‌ ధిక్కరించి సొంత పార్టీ పెట్టినందుకు…అప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ చక్రం తిప్పి జగన్‌ను జైలుపాలు చేసింది. ఆ కేసుల గురించి తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడని రోజు లేదు. తనపై ఉన్న కేసుల విచారణకు జగన్‌ కోర్టుకు హాజరవుతున్నారు. ఆ కేసుల విచారణ జరుగుతోంది. అయినా…రాత్రికి రాత్రే ఆయనుకు ఉరి శిక్ష వేసేయలేదనే విధంగా సాక్ష్యాత్తు చంద్రబాబు నాయుడు మాట్లాడారు. మాట్లాడుతున్నారు.

ఇప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి కాంగ్రెస్‌ నేర్పిన పద్ధతుల్లోనే….రాజకీయ కక్షలకు పూనుకుంటోంది. రేవంత్‌ రెడ్డిపై కేసులు పెట్టింది. ఆంధ్రప్రదేశ్‌లోనూ టిడిపి నేతలపై ఐటి కేసులు వస్తాయనడంలో సందేహం లేదు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ గగ్గోలు పెడుతోంది. ఇదంతా రాజకీయ కక్షతో కెసిఆర్‌, మోడీ కలిసి చేస్తున్నారని భగ్గుమంటోంది.

ఆ మాటకొస్తే…తెలుగుదేశం ప్రభుత్వంపై ఎవరిపైనా రాజకీయ కక్షలకు పూనుకోవడం లేదా? ఇటీవల జరిగిన ఎంఎల్‌సి ఎన్నికల సందర్భంగా…రాయలసీమ తూర్పు నియోజ్కవర్గం ఉపాధ్యాయ స్థానానికి పోటీ చేయడానికి తిరుపతికి చెందిన డాక్టర్‌ చదలవాడ సురచిత సర్వం సిద్ధం చేసుకున్నారు. తెలుగుదేశం అగ్రనాయకులు జోక్యం చేసుకున్నా ఆమె వెనకడుగు వేయలేదు. దీంతో…ఆమె విద్యాసంస్థలపైన దాడులు చేయించి భయబ్రాంతులను చేశారు. ఆఖరికి ఆమె తాను పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఇటువంటి ఉదంతాలు ఎన్నో…!

రాజకీయ పార్టీలు కక్ష సాధింపు కోసం ప్రభుత్వ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తున్నాయనడంలో సందేహం లేదు. అయితే…ఇక్కడ సామాన్యులుగా జనం ఆహ్వానించదగ్గ పరిణామం ఏమంటే…ఈ విధంగానైనా అక్రమార్కులు పట్టుబడుతున్నారు. బయటికొస్తున్నారు. రాజకీయాలను అడ్డంపెట్టుకుని, వ్యాపారాల్లో కోట్లు అక్రమంగా వెనకేసుకుంటున్న నాయకుల బాగోతం బయటపడుతుంది. ఎన్నికల వేళయినా, ఇంకో సమయమైనా…ఐటి దాడులను వ్యతిరేకించాల్సిన అవసరం లేదు. ప్రజాప్రతినిధులుగా ఉన్నంత మాత్రాన తమపై దాడులు చేయకూడదనడం అర్థంలేనిది. నీతులు చెప్పే అర్హతను బూర్జువా పార్టీలు ఎప్పుడో కోల్పోయాయి. ఎందుకంటే…ఎవరూ పతీతలు కాదు. దొందూదొందే. వైసిపి అయినా, తెలుగుదేశమైనా; కాంగ్రెస్‌ పార్టీ అయినా, బిజెపి అయినా….ఆ తాను ముక్కలే. అందుకే ఇటువంటి సందర్భాల్లో నాయకులు చేస్తున్న ఆర్థనాదాలను జనం పట్టించుకోవడం లేదు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*