జగన్‌పై కోపంతో మతాల మధ్య చిచ్చుకు కుతంత్రాలు..!

ఆంధ్రప్రదేశ్‌లో ఆరు నెలల క్రితం జరిగిన ఎన్నికల్లో, అప్పటిదాకా అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ఓటమిపాలై….ప్రతిపక్షంలో ఉన్న వైసిపి అధికార పీఠాన్ని ఎక్కింది. ప్రజాస్వామ్యంలో ఐదేళ్లకు ఒకసారి ఎన్నికలు జరగడం, ప్రజాతీర్పు ఎవరికి అనుకూలంగా ఉంటే వారు అధికారం చేపట్టడం సాధారణంగా జరిగే ప్రక్రియే. ఆరు నెలల క్రితం జరిగింది కూడా ప్రజాస్వామిక తంతే.

అయితే…వైసిపి అధికారంలోకి రావడాన్ని ఏమాత్రం జీర్ణించుకోలేకపోతున్న శక్తులు, ప్రభుత్వాన్ని అభాసుపాలు చేయడానికో, అప్రతిష్టపాలు చేయడానికో కొన్ని శక్తులు మొదటి రోజు నుంచి ప్రయత్నిస్తూనే ఉన్నాయి. ప్రభుత్వ విధానాలపై విమర్శలు చేయడం, చేస్తున్న తప్పులను ఎత్తిచూపడం తప్పుకాదు…అయితే ప్రభుత్వాన్ని ఇబ్బందిపెట్టడం కోసమో, ముఖ్యమంత్రిని ఇరకాటంలో పడేయడం కోసమో…జనం మధ్య మత విద్వేషాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. అదే ఆందోళన కలిగించే అంశంగా కనిపిస్తోంది.

ప్రధానంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి మత విశ్వాసాన్ని పదేపదే ప్రస్తావిస్తున్నారు. క్రైస్తవ మత విశ్వాసాలు కలిగిన ఆయన డిక్లరేషన్‌ ఇవ్వకుండా తిరుమల శ్రీవారి ఆలయంలోకి ఎలా వెళుతారంటూ అసందర్భమైన ప్రస్తావన తెస్తున్నారు. జగన్‌ మోహన్‌ రెడ్డి ఇప్పటికే పలు పర్యాయాలు అలిపిరి మెట్ల మార్గాన నడుచుకుంటూ తిరుమలకు వెళ్లి స్వామిని దర్శించుకున్నారు. హిందూ దేవుళ్ల పట్ల విశ్వాసం ఉందా లేదా అనేందుకు ఇంతకంటే పెద్ద డిక్లరేషన్‌ అవసరం ఏమీవుండదు. అయినా….పదేపదే జగన్‌ మోహన్‌ రెడ్డి తాను ఏ మతస్తుడో చెప్పాలని కోరడంలో దురుద్ధేశం మినహా నిజాయితీ కనిపించదు.

ఇక ఇంగ్లీషు మీడియం విషయంలోనూ ఇటువంటి ప్రచారానికే తెరతీశారు. పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియం ప్రవేశపెట్టడం ద్వారా, చిన్నప్పుడే ఆంగ్లం నేర్పించి, తద్వారా క్రైస్తవ మతాన్ని పిల్లలకు ఎక్కించాలన్న కుట్ర ఇందులో ఉందంటూ అసంబద్ధమైన ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఇంకో ప్రచారం ఏమంటే….జగన్‌ మోహన్‌ రెడ్డి పాలనలో క్రైస్తవులకే ఎక్కువ ప్రాధాన్యత లభిస్తోందట. ముఖ్యమైన పదవులు క్రైస్తవులకే దక్కుతున్నాయట. జగన్‌ అధికారంలోకి వచ్చాక క్రైస్తవులు – హిందువుల భేదభావాలు క్రమంగా పెరుగుతున్నాయట.

బిసిలనూ క్రైస్తవులుగా మార్చే కుట్ర రాష్ట్రంలో జరుగుతోందట. తద్వారా బిసిలను తనవైపునకు తిప్పుకోవాలని వైసిపి చూస్తోందట. ఇందులో కొంతయినా ఔచిత్యం ఉందా? బిసిలను తనవైపు తిప్పుకోవాలంటూ వాళ్లకు ఏదైనా మేలు చేయాలి తప్ప….క్రైస్తవంలోకి మార్చితే వైసిపికి అనుకూలంగా ఎలా మారుతారు? ఇన్నాళ్లు బిసిలు టిడిపికి సపోర్టుగా ఉన్నారు. ఎన్‌టిఆర్‌ మతాన్ని చూసి బిసిలు తెలుగుదేశానికి సపోర్టు చేశారు. చంద్రబాబు మతాన్ని చూసి ఆయన్ను బలపరిచారా? అయినా… మెజారిటీ మతస్తులను దూరం చేసుకుని, మైనారిటీ మతస్తులకు దగ్గర కావాలని ఏ పార్టీ అయినా కోరుకుంటుందా?

గతంలో వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనూ మతం చుట్టూ ఇటువంటి ప్రచారమే సాగింది. తిరుమల ఏడు కొండలను రెండు కొండలుగా చేసేస్తున్నారని, తిరుమల కొండల్లో చర్చి నిర్మిస్తున్నారని ప్రచారం చేశారు.

ఇప్పుడూ అటువంటి ప్రచారమే మొదలుపెట్టారు. జగన్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే…తిరుమలలో శిలువ నిర్మించారని సోషల్‌ మీడియాలో ప్రచారం జరిగింది. తీరా అది తప్పుడు ప్రచారని తేలింది. ఆ తరువాత తిరుమలకు వెళ్లే ఆర్‌టిసి బస్సు టికెట్ల వెనుక జరూసలేం యాత్ర ప్రకటనలు ఉండటాన్ని ఆసరా చేసుకుని విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. మొన్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్‌వి సుబ్రమణ్యంను బదిలీ చేస్తే….దానికీ మతాన్నే ముందుకు తెచ్చారు. ఆఖరికి ప్రభుత్వమే క్రైస్తవులకు అనుకూలంగా ఉందనే ప్రచారం ప్రారంభించారు.

మతోతత్వాన్ని రెచ్చగొట్టే సంస్థలు, మొదటి నుంచి మతాన్ని రాజకీయాలకు వాడుకుంటున్న పార్టీ నాయకులు అటువంటి ప్రచారం చేస్తే పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. లౌకిక పార్టీలని చెప్పుకునేవి, ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభమని చెప్పుకునే మీడియా కూడా సమాజ హితాన్ని మరచి, తాము సమర్ధించే రాజకీయ పార్టీల కోసం మతాన్ని ఆయుధంగా చేసుకుని…సమాజంపై విషం చిమ్మే ప్రయత్నం చేయడం ఆందోళన కలిగిస్తోంది.

రాజకీయాలు వేరు, మత విశ్వాసాలు వేరు. ఈ రెంటినీ ముడిపెట్టాలనుకునే వారిపట్ల అప్రమత్తంగా ఉండాల్సింది, సామరస్యాన్ని కాపాడుకోవాల్సిందీ ప్రజలే.

  • ఆదిమూలం శేఖర్‌, సంపాదకులు, ధర్మచక్రం

1 Comment

  1. ఒక్కటిమాత్రం నిజం. కన్వర్షన్ టీముల హడావుడి ఎక్కువైంది.

Leave a Reply

Your email address will not be published.


*