జగన్‌పై దాడి కేసు : మీడియా పరిశోధన ఏదీ?

ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌పై దాడి జరిగి రెండు రోజులవుతోంది. ఈ దాడి అధికార పార్టీ కుట్ర అని వైసిపి ఆరోపిస్తోంది. రాష్ట్రంలో అలజడి సృష్టించి రాజకీయంగా లబ్ధిపొందడానికి వైసిపి, కేంద్ర కలిసి కుట్రపన్ని ఉత్తుత్తి దాడి చేయించాయని రాష్ట్ర ప్రభుత్వం ఆరోపిస్తోంది.

ఈ కేసులో అనేక అనుమానాలున్నాయి. తేలాల్సిన అంశాలా చాలానే ఉన్నాయి. పోలీసుల దర్యాప్తులపై తమకు నమ్మకం లేదని వైసిపి చెబుతోంది. తటస్థ సంస్థ దర్యాప్తునకు డిమాండ్‌ చేస్తోంది. ఇటువంటి పరిస్థితుల్లో మీడియా కీలక పాత్ర పోషించడం పరిపాటి. క్లిష్టమైన కేసుల్లో పోలీసుల కంటే మిన్నగా పరిశోధన సాగించి అనేక అంశాలను బయటపెట్టిన ఉతందాలు రాష్ట్రంలో అనేకం ఉన్నాయి. జగన్‌పై దాడి కేసులో అటువంటి చొరవను మీడియా ప్రదర్శించడం లేదు.

నిందితుడు శ్రీనివాసరావు వైసిపి అభిమాని అని చెప్పడానికి పోలీసులు చూపుతున్న ఫ్లెక్సీపై అనుమానాలున్నాయి. అదేవిధంగా శ్రీనివాసరావు రాసినట్లు చెబుతున్న లేఖనూ నమ్మడం లేదు. రెస్టారెంట్‌ అధినేతపైన ఆరోపణలు వస్తున్నాయి. అసలు కత్తి ఎయిర్‌పోర్టు లోపలికి ఎలా తీసుకెళ్లారన్న కీలక ప్రశ్న ఉదయిస్తోంది. శ్రీనివాసరావు వైసిపి అభిమాని అయితే…టిడిపి నేత రెస్టారెంట్‌లో ఎలా పనికి కుదిరారన్న అనుమానమూ వ్యక్తమవుతోంది.

ఈ అంశాలపై ప్రధాన ప్రసంతి మీడియా పెద్దగా దృష్టిపెట్టినట్లు అనిపించడం లేదు. శ్రీనివాసరావు నిజంగా గత సంక్రాంతి రోజు గ్రామంలో ఫ్లెక్సీ కట్టాడో లేదో తేల్చడం మీడియాకు పెద్ద సమస్యకాదు. గ్రామంలోకి వెళ్లి వివరాలు సేకరిస్తే సరిపోతుంది. అదేవిధంగా శ్రీనివాసరావు కుటుంబం ఏ పార్టీనో తేల్చడమూ సమస్య కాదు. గ్రామాల్లో ఎవరు ఏ పార్టీని అభిమానిస్తారో, గతంలో ఏ పార్టీలో ఉండేవారో ఎవరినడిగినా ఇట్టే చెప్పేస్తారు. ఇంత చిన్న పరిశోధనకూ మీడియా పూనుకోలేదు.

తిరుపతిలో 2003లో చంద్రబాబు నాయుడిపై మావోయిస్టులు దాడికి పాల్పడినపుడు…. మీడియా పోషించిన పాత్ర అమోఘమైనది. దాడికి వ్యూహ రచన చేసినపుడు మావోయిస్టులు ఎక్కడ బస చేశారు, ఏ వాహనాలు వాడారు, ఎక్కడెక్కడ తిరిగారు… ఇలాంటి అనేక అంశాలను పోలీసుకంటే ముందుగా మీడియా బయటపెట్టింది. అంతెందుకు ఏమాత్రం సంచలనం కలిగించిన ఘటన అయినా….దాన్ని లోతులను శోధించడం తెలుగు మీడియాకు వెన్నతో పెట్టిన విద్య. ఎందుకంటే…దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేనంత ఎక్కువ మంది పాత్రికేయులు తెలుగు పత్రికలకు ఉన్నారు. ప్రతి మండలానికీ విలేకరి ఉన్నారు. అందుకే ఎక్కడ చీమ చిటుక్కుమన్నా ఇట్టే తెలిసిపోతుంది.

జగన్‌పై దాడి కేసులో మాత్రం పోలీసులు చెప్పిన విషయాలను రిపోర్టు చేయడం మినహా స్వీయ పరిశీలన, పరిశోధనతో రాస్తున్న కథనాలు కనిపించడం లేదు. ఇటువంటి ప్రయత్నాన్ని ఉద్దేశపూర్వకంగానే విస్మరిస్తున్నాయా? లేక చేతగాక వదిలేస్తున్నాయా? అనే ప్రశ్న వస్తే….తెలుగు మీడియా అంత చేతగానిదేమీ కాదు. పెద్దపెద్ద కుంభకోణాలను వెలికి తీసిన ఘన చరిత్ర మీడియాకు ఉంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*