జగన్‌పై హత్యాయత్నం కేసు : ప్రభుత్వ పెద్దలకు ఉచ్చు బిగుస్తోందా…!

ప్రతిపక్ష నేత, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిపై విశాఖపట్నం విమానాశ్రయంలో జరిగిన హత్యాయత్నం కేసులో మెల్లగా రాష్ట్ర ప్రభుత్వ పెద్దలకు ఉచ్చు బిగుసుకుంటున్న సూచనలు కనిపిస్తున్నాయి. ఈ కేసుకు సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సహా పలువురు ప్రభుత్వ పెద్దలకు నోటీసులు ఇవ్వాలని రాష్ట్ర హైకోర్టు నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో పరిశీలకులు ఈ అంచనాకు వస్తున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ చంద్రబాబుకు తలనొప్పులు తప్పులా లేవు.

జగన్‌పై హత్యాయత్నం కేసులో దర్యాప్తు చేయడానికి సిట్‌ (స్పెషల్‌ ఇన్వెట్టికేషన్‌ టీం) ఏర్పాటు చేసినప్పటికీ….రాష్ట్ర ప్రభుత్వ అజమాయిషీలోని పోలీసుల ద్వారా జరగుతున్న దర్యాప్తుపై తనకు విశ్వాసం లేదని, సిబిఐ వంటి సంస్థతో విచారణ జరిపించాలని జగన్‌ హైకోర్టును ఆశ్రయించారు. ఇదే అంశంపై ఓ వ్యక్తి ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ కేసులపై రెండో వాయిదా మంగళవారం (13.11.2018) జరగింది.

జగన్‌ను హత మార్చడానికి కుట్రచేసి, దాన్ని పక్కా ప్రణాళికతో వినామాశ్రయంలో అమలు చేశారని జగన్‌ తరపు న్యాయవాది కోర్టుకు వివరించారు. అంతర్జాతీయ విమానాశ్రయంలో సిసి కెమెరాలు పని చేయకపోవడం, దాడి జరిగిన గంటలోపే డిజిపి మీడియా ముందుకు వచ్చి దీన్ని ఓ చిన్న సంఘటనగా అభివర్ణించడం, ఆపై ముఖ్యమంత్రి మీడియాతో మాట్లాడుతూ దీన్ని ఓ నాటకంగా అభివర్ణించడం, ప్రతిపక్ష నేతపై దాడి జరగబోతోందని సినీనటుడు శివాజీ ముందుగానే చెప్పడం… వంటి అంశాలను న్యాయమూర్తి ముందు ఉంచారు. ముఖ్యమంత్రి, డిజిపి స్థాయి వ్యక్తులే ఈ విధంగా మాట్లాడిన తరువాత పోలీసులు నిష్పక్షపాతంగా దర్యాప్తు జరపలేరని కోర్టుకు విన్నవించారు.

సిట్‌ రెండు వారాలుగా దర్యాప్తు చేస్తున్నప్పటికీ….దాడికి ఉపయోగించిన కత్తి విమానాశ్రయంలోకి ఎలా వెళ్లింది, ఎప్పుడు వెళ్లిందో కూడా వివరాలు రాబట్టలేక పోయింది. ఇంతటి ప్రాథమికమైన అంశాలనే తేల్చనపుడు కేసు దర్యాప్తు సక్రమంగా జరిగిందని చెప్పడానికి వీల్లేదు. అదే అంశాన్ని జగన్‌ తరపు న్యాయవాది కోర్టులో వినిపించారు.

జగన్‌ తరపు న్యాయవాది వాదనలు విన్న కోర్టు…ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు 8 మందికి నోటీసులు ఇవ్వాలని నిర్ణయించడం గమనార్హం. రెండు వారాల్లో ఈ నోటీసులకు జవాబు ఇవ్వాల్సివుంటుంది. జగన్‌ను హత మార్చడానికి కుట్ర జరిగిందన్న తమ వాదనను పరిగణనలోకి తీసుకోబట్టే న్యాయమూర్తి నోటీసులు జారీ చేశారని జగన్‌ తరపు న్యాయవాది చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో సిబిఐ వంటి సంస్థతో విచారణ జరిపించడానికి కోర్టు ఆదేశాలు ఇచ్చే అవకాశాలున్నాయని కూడా న్యాయవాదులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. విమానాశ్రయంలో సిసి కెమెరాలు పని చేయకపోవడంపైనా న్యాయమూర్తులు విస్మయం, ఆగ్రహం వ్యక్తం చేసినట్లు చెబుతున్నారు. ప్రముఖులు సంచరించే చోటే భద్రత లేకపోతే ఎలాగని నిలదీశారు.

ఈ పరిణామాల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు ఇబ్బందుల్లో పడే సూచనలు కనపిస్తున్నాయి. ఇప్పటిదాకా సిట్‌ తాను చేసిన దర్యాప్తు వివచాలను సీల్డ్‌ కవర్‌లో కోర్టుకు అందజేసింది. రెండో వారాల తరువాత కూడా మళ్లీ నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. అంటే సిట్‌ తన ఇష్టారాజ్యంగా దర్యాప్తు పూర్తి చేసి చేతులు దులుపునే వీలు లేదు. కోర్టు లేవనెత్తిన అంశాలపైన, ఆ కోణంలో దర్యాప్తు చేయాల్సివుంటుంది. ఈ దర్యాప్తులు కోర్టు సంతృప్తి చెందుతుందా లేదా అనేదాన్నిబట్టే….సిబిఐకి అప్పగిస్తారా లేదా అనేది తేలనుంది.

 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*