జగన్‌పై హత్యాయత్నం కేసు : మాట్లాడనున్న వైఎస్‌ విజయమ్మ

ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిపై విశాఖపట్నం విమానాశ్రయంలో శ్రీనివాసరావు అనే వ్యక్తి కోడి కత్తెతో హత్యాయత్నానికి తెగబడిన సంగతి తెలిసింది. మానవతా దృక్పథంలో స్పందించాల్సిన ఈ అంశం రాజకీయ రంగు పులుముకుంది. దీంతో హత్యాయత్నంపైనా అమానవీయ వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. వితండవాదం తెరపైకి వచ్చింది. జగన్‌కు ఎన్నికల్లో సానుభూతి రావాలన్న ఉద్దేశంతో ఆయన అభిమాని అయిన శ్రీనివసరావు ఈ దాడికి పాల్పడ్డారని ప్రభుత్వం చెబుతోంది. జగన్‌ ప్లాన్‌ చేసుకుని ఉత్తిత్తి దాడి చేయించుకున్నారన్న మాటలూ ప్రభుత్వ పెద్దల నుంచి వినిపించాయి.

ఈ కేసు విచారణలో ఆంధ్రప్రదేశ్‌ పోలీసుపై తనకు విశ్వాసం లేదంటూ, రాష్ట్ర ప్రభుత్వ అజమాయిషీ లేని సంస్థతో విచారణ జరిపించాలంటూ జగన్‌ హైకోర్టులో రిట్‌పిటిషన్‌ దాఖలు చేశారు. దానిపై విచారణ కొనసాగుతోంది. కోర్టు తీర్పు ఎలావుంటుంది, రాష్ట్ర పోలీసులతో సంబంధం లేకుండా ఇంకో సంస్థతో విచారణ జరిపిస్తుందా, రాష్ట్ర పోలీసుల విచారణ సవ్యంగా ఉందని భావిస్తు దాన్నే కొనసాగించడానికి అనుమతిస్తుందా…..అనేది త్వరలోనే తేలుతుంది.

ఇదిలావుంటే….ఇప్పటిదాకా జగన్‌ కుటుంబ సభ్యులెవరూ ఈ అంశంపై నోరు విప్పలేదు. వైసిపి నేతలు మాట్లాడటం మినహా….జగన్‌ తల్లి విజయమ్మగానీ, చెల్లెలు షర్మిలగానీ మాట్లాడలేదు. తొలిసారిగా ఆదివారం (11.11.2018) ఉదయం 11 గంటలకు విజయమ్మ మీడియాతో మాట్లాడుతారని సాక్షి వెబ్‌సైట్‌ ఓ కథనాన్ని ప్రచురించింది. ఇంతకీ విజయమ్మ ఏమి మాట్లాడుతారు? అది ఎటువంటి చర్చకు దారితీయబోతోంది?!

తెలుగుదేశం నాయకుడు రాజేంద్రప్రసాద్‌ మరీ అన్యాయంగా మాట్లాడారు. పార్టీ పగ్గాలు తమకు చిక్కడం లేదనే కోపంతో విజయమ్మ, షర్మిల ప్లాన్‌ చేసి జగన్‌పై దాడి చేయించారంటూ మరీ అమానవీయమైన వ్యాఖ్యలు చేశారు. రాజకీయ విమర్శలు ప్రతివిమర్శలు ఎలావున్నా….జగన్‌పై హత్యాయత్నం జరిగితే, దాన్ని తల్లి విజయమ్మకు అంటగట్టడాన్ని రాష్ట్ర ప్రజలు ఆమోదించలేదు. అసలు తెలుగుదేశం నాయకులూ ఒప్పుకోవడం లేదు. అలా మాట్లాడకూడదని అంటున్నారు.

ఇటువంటి అమానవీయ వ్యాఖ్యలపైనే విజయమ్మ స్పందించే అవకాశం ఉంది. మరోవైపు 12వ తేదీ (సోమవారం) నుంచి జగన్‌ తన పాదయాత్రను పున:ప్రారంభించనున్నారు. ఈ యాత్రలో ఆయన ఏమి మాట్లాడుతారు, తనపై జరిగిన దాడిపై ఎలా స్పందిస్తారు…అనేది కూడా ఆసక్తిగా మారింది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*