జగన్‌ ఆరోపణ ఒకటి…సిఎం వివరణ ఇంకొకటి..!

రానున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన సామాజిక వర్గానికి చెందిన 35 మంది సిఐలకు డిఎస్‌పిలుగా పదోన్నతులు కల్పించారని వైసిపి అధినేత కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. దీనిపైన ముఖ్యమంత్రి సహా తెలుగుదేశం నాయకులు అనేక మంది స్పందించారు. జగన్‌ మోహన్‌ రెడ్డి కులాల మధ్య చిచ్చుపెడుతున్నారంటూ మండిపడుతున్నారు. తమ మంత్రివర్గంలో ఇద్దరు రెడ్లు ఉన్నారని, ఇంతకంటే సామాజిక న్యాయం ఎక్కడుంటుందని చంద్రబాబు నాయుడు ప్రశ్నిస్తున్నారు. జగన్‌ చేసిన విమర్శల వల్ల పోలీసుల ఆత్మస్థైర్యం దెబ్బతింటుందన్న వాదనను తెచ్చి పోలీసులను మచ్చిక చేసుకునే ప్రయత్నమూ చేస్తున్నారు. ఆఖరికి పోలీసు అధికారుల సంఘంతోనూ ప్రకటన ఇప్పించారు.

అయితే…ఇక్కడ జగన్‌ మోహన్‌ రెడ్డి చేసిన విమర్శకు తెలుగుదేశం నేతలు ఇస్తున్న వివరణకు పొంతనలేదు. డిఎస్‌పిల ప్రమోషన్లల్లో అక్రమాలు జరగలేదంటే…ఆ విషయాన్ని ఆధారాలతో సహా బయటపెట్టాలి. అయితే…తెలుగుదేశం నేతలు ఆ అంశం జోలికి వెళ్లకుండా రాజకీయ ఆరోపణలు చేస్తున్నారు. మొత్తం 37 మందికి ప్రమోషన్లు లభిస్తే అందులో 35 మంది ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు ఉన్నారట. మరో అధికారి చంద్రబాబు సామాజికవర్గానికి చెందిన మహిళను వివాహనం చేసుకున్నారట. ఎన్నో కులాలు ఉండగా…ఒకే సామాజిక తరగతికి చెందిన వారు 35 – 36 మందికి ఎలా పదోన్నతలు లభించాయన్నది ప్రశ్న.

ఎస్‌సిలు, ఎస్‌టిలు, టిడిపికి ఆయువుపట్టుగా చెప్పుకునే బిసిలు, ఇతర కులాల వారు ప్రమోషన్ల జాబితాలో లేరా? అలాంటి వారికి ప్రమోషన్లు లభించవా? జగన్‌ చెబుతున్నది అసత్యమతైతే…డిఎస్‌పిలుగా ప్రమోషన్లు పొందిన వారిలో ఏ కులాల వారు ఎంతమంది ఉన్నారో ప్రభుత్వమే బహిరంగపరచవచ్చు. అది చేయకుండా జగన్‌పైన రాజకీయ విమర్శలు చేయడం వల్ల ప్రభుత్వం తనపైన వచ్చిన ఆరోపణను తప్పించుకోజాలదు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి, డిఎస్‌పిలుగా ప్రమోషన్లు పొందిన వారిలో ఏ కులాలు వారు ఎందరున్నారో వివరాలు బయటపెట్టాల్సిన అవసరం ఉంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*