జగన్‌ పాదయాత్ర…టిడిపిని కలవరపెడుతోందా?

తెలుగుదేశం పార్టీ నేతలు స్పందిస్తున్న తీరు చూస్తుంటే… వైసిపి అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పాదయాత్ర ఆ పార్టీని కలవరపరుస్తున్నట్లే అనిపిస్తోంది. రెండు రోజులుగా జగన్‌ పాదయాత్రపైనే టిడిపి నాయకులు మాట్లాడుతున్నారు. ప్రస్తుతం విజయవాడలో యాత్ర సాగుతోంది. యాత్రకు జనాన్ని డబ్బులిచ్చి పక్క జిల్లాల నుంచి తరలిస్తున్నారని టిడిపి నాయకులు విమర్శస్తున్నారు. అదేవిధంగా సోషల్‌ మీడియాలో ఫేక్‌ వీడియోలు, ఫొటోలతో దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో ప్రత్యేక హోదా పేరుతో ఈనెల 21 నుంచి టిడిపి నిర్వహించనున్న సైకిల్‌ యాత్రలో వైసిపిని టార్గెట్‌ చేస్తూ తీవ్రస్థాయిలో ప్రచారం చేయాని నిర్ణయించారు. వివిధ సందర్భాలలో జగన్‌ మోహన్‌ రెడ్డి ముఖ్యంత్రిపై చేసిన ఘాటైన వ్యాఖ్యలను బుక్‌లెట్‌ రూపంలో ప్రచురించి విస్తృతంగా పంపిణీ చేస్తామని టిడిపి నేతలు చెబుతున్నారు.

తెలుగుదేశం నాయకుల స్పందన చూస్తుంటే….జగన్‌ మోహన్‌ రెడ్డి యాత్ర ఆ పార్టీని తీవ్రంగానే ఆలోచింపజేస్తోందని అనిపిస్తోంది. జగన్‌ సభలకు జనం పోటెత్తుతున్నారు. ఏ జిల్లాలో ఏ ప్రాంతంలో యాత్ర జరిగినా ప్రవాహంలా వస్తున్నారు. సీమ జిల్లాల్లో యాత్ర జరిగినన్ని రోజులు టిడిపి పెద్దగా పట్టించుకోలేదు. సీమలో వైసిపికి కొంత పట్టున్న కారణంగా జనం వెళుతున్నారులే అనుకున్నారు. కోస్తా జిల్లాల్లోనూ అంతకు మించి జనం వస్తున్నారు. నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, విజయవాడ….అన్ని జిల్లాల్లోనూ జనం పోటెత్తుతున్నారు. ఇప్పడు తెలుగుదేశం ఉలికిపాటుకు కారణం ఇదే అయివుంటుందని పరిశీలకులు చెబుతున్నారు. ఇంకా యాత్ర కృష్ణ జిల్లా దాటుకుని పశ్చిమగోదావరిలోకి, ఆపై తూర్పుగోదావరిలోకి ప్రవేశిస్తే; ఇదే స్థాయిలో అక్కడా జనం వస్తే….రాజకీయ పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయే అవకాశాలున్నాయి. అందుకే…జగన్‌ సభలకు జనాన్ని డబ్బులిచ్చి తరలిస్తున్నారని, అదేవిధంగా మార్ఫింగ్‌ చేసి ఫొటోలు ప్రచురిస్తున్నారని ప్రచారం చేయడానికి పూనుకున్నారు తెలుగుదేశం నాయకులు. దీనివల్ల టిడిపికి ఒనగూడే ప్రయోజనం పెద్దగా ఉండకపోవచ్చు. జగన్‌ సభలకు జనం వస్తున్నమాట వాస్తవం. ప్రభుత్వంపై ప్రజల్లో అంతటి వ్యతిరేకత ఉంది. దీన్ని గమనించి సరిదిద్దుకోకుండా…అర్థంలేని ప్రచారాలకు దిగితే…దానివల్ల టిడిపికి ఒనగూడేది ఏమీవుండదు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*