జగన్‌ మూర్ఖుడా..! సాహసికుడా..! ఇది ఉత్తుత్తి దాడా…నిజ‌మైన దాడా..!

వైసిపి అధినేత వైఎస్‌ జగన్‌పై విశాఖపట్నంలో జరిగిన దాడిపై రకరకాలు వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. వైసిపి నాయకులు….ఇది తమ నేతను భౌతికంగా నిర్మూలించడానికి జరిగిన ప్రయత్నంగా చెబుతున్నారు. టిడిపి నేతలు మాత్రం…ఎన్నికలు సమీపిస్తున్న వేళ, సానుభూతి కోసం జగన్‌ తనపై తానే దాడి చేయించుకున్నారని ఘంటాపథంగా చెబుతున్నారు. ఇందులో ఏది నిజం…ఏది అబద్ధం? ఇది శత్రువులు కేసిన దాడా లేక జగన్‌ స్వయంగా చేయించుకున్న దాడా అనేది తేల్చడానికి పెద్దపెద్ద విచారణలు అవసరం లేదు. కాస్త తర్కబద్ధంగా ఆలోచిస్తే అన్నీ తేలిపోతాయి.

టిడిపి నేతలు చెబుతున్నట్లు సానుభూతి కోసం జగనే స్వయంగా ప్లాన్‌ చేసి దాడి చేయించుకున్నారని అనుకుందాం…అప్పుడు కొన్ని అంశాలను పరిశీలించాలి. ఉత్తుత్తి దాడి కోసమే అయితే కోడిపందేల కత్తిని ఎందుకు ఎంచుకుంటారు అనేది ప్రశ్న. ఈ ప్రశ్న ఎందుకంటే…కోడిపందేల కత్తి ఎంత ప్రమాదకరమో ముందు తెలుసుకోవాలి. దాని గురిచి తెలిసిన ఏ మూర్ఖుడూ ఉత్తుత్తి దాడులకు దాన్ని వినియోగించడు.

ఎందుకంటే కోడిపందేల కత్తి చాలా పదునుగా ఉంటుంది. పందేల సమయంలో కోడిపుంజు కాళ్లకు ఈ కత్తులను కడుతారు. బరిలో ఎదురుగా ఉన్న కోడిపైక కాలుదువ్వినపుడు ఆ కత్తులు….శత్రుకోడి మెడకు తగిలి మృత్యువాత పడుతుంది. మెడి తెగిన కొంత సేపటి తరువాత కూడా కోడి పోరాడుతూనే ఉంటుంది. ఎందుకంటే మెడ తెగిన సంగతి కూడా దానికి తెలియదు. ఆ కత్తులు అంత పదునుగా ఉండి, అంత మెత్తగా కత్తిరించేస్తాయి. అంతెందుకు కత్తులు కట్టేటప్పుడూ చాలా జాగ్రత్తగా కట్టాలి. లేదంటే కట్టేవాళ్ల చేతులు తెగిపోతాయి. ప్రత్యేకించి ఈ కత్తులతో కోసిన తరువాత మళ్లీ అతికించడానికీ వీలులేనంతగా తెగిపోతాయట.

ఉత్తుత్తి దాడికైతే ఇటువంటి ప్రమాదకరమైన కత్తిని ఎంచుకుంటారా? అనేది తర్కించాల్సిన అంశం. ఏ సాధారణ కత్తినో ఎంచుకుని ఉండొచ్చు. ఇంకా చెప్పాలంటే…దాడికి పాల్పడిన వ్యక్తి తాను పనిచేస్తున్న రెస్టారెంట్‌లో అందుబాటులో ఉండే ఏదో ఒక చాకును ఉపయోగిస్తే సరిపోయేది. అదీ కాదనుకుంటే ఏ గాజుపెంకునో వాడేవారు. అంతేగానీ కోడికత్తిని ఎంచుకోరు.

ఇందులో ఇంకో అంశం కూడా ఉంది. సాధారణంగా కోడి పందేలా కత్తులను సంక్రాంతి సమయంలో మాత్రమే బయటకు తీసి పదనుపెడతారు. మిగతా సమయంలో వస్త్రంలో చుట్టి ఎవరికీ అందకుండా ఏ అటకపైనో పెడతారు. నిందితుడు వాడిన కత్తి చూస్తే తాజాగా పదును పెట్టినట్లు స్పష్టమవుతోంది. ఉత్తుత్తి దాడి కోసమైతే….కత్తికి పదును పెట్టి తీసుకురావాల్సిన అవసరం ఏముంటుంది? పదును పెట్టడం వల్ల ప్రమాదమని తెలియదా? చేతికి తగలబట్టి సరిపోయిందిగానీ….పీకమీద తగిలివుంటే నిమిషాల్లో జగన్‌ ప్రాణాలు విడిచేవారు. ఇంతటి ప్రమాద క్రీడకు ఏ మూర్ఖుడైనా పూనుకుంటాడా! అటువంటి సాహసం చేస్తాడా!!

కత్తిని ఎంపిక చేసుకున్న తీరు చూస్తుంటే…జగన్‌ను తుదిముట్టించడానికి అత్యంత పకడ్బందీగా వేసిన ప్రణాళికగా అనిపిస్తుంది. కోడిపందేల కత్తిని ఎంపిక చేసుకోవడంలోనే….హత్య కోసం ఎంతగా ఆలోచించి ప్రణాళిక రచించారో అర్థం చేసుకోవచ్చు.

ఇక దాడికి ఎంచుకున్న స్థలమూ వ్యూహాత్మకంగానే ఉందని చెప్పాలి. పాదయాత్రలో జగన్‌ ఎప్పుడూ వేలాది మంది మధ్య తిరుగుతున్నారు. ఎవరంటేవారు ఆయన దగ్గరకు వెళ్లడం అంత తేలిక కాదు. వెళ్లగలిగినా దాడి చేసి ప్రాణాలతో తప్పించుకోవడం సాధ్యమయ్యేపని కాదు. అందుకే విమానాశ్రయాన్ని ఎంచుకున్నారు.

విమానాశ్రయంలో జగన్‌ వ్యక్తిగత భద్రతా సిబ్బంది కూడా కాస్త ఆదమరచి ఉంటారు. దాడికి పాల్పడిన వెంటనే పోలీసులు / కేంద్ర భద్రతా సిబ్బంది అదుపులోకి తీసుకుంటారు. అంతేతప్ప ఎవరూ దాడిచేసే అవకాశం ఉండదు. అన్నింటికీ మించి సాంకేతికంగా విమానాశ్రయ భద్రత కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంటుంది కాబట్టి…తమకు బాధ్యత లేదని తప్పించుకోవచ్చు. ఇలా అన్ని కోణాల్లో ఆలోచించే విమానాశ్రయాన్ని ఎంచుకున్నారన్నది పరిశీలకుల అభిప్రాయం.

నూటికి నూరుపాళ్లూ టార్గెట్‌ చేరుకుంటామన్న నమ్మకం ఏర్పడిన తరువాతే దాడికి సిద్ధమయ్యారని, అయితే అదృష్టవశాత్తు జగన్‌ తప్పించుకున్నారని ఈ దాడిని విశ్లేషిస్తున్నవారు చెబుతున్నారు. ఈ దాడికి కొన్ని నెలల నుంచే వ్యూహ రచన జరిగివుండొచ్చని అంటున్నారు. లోతుగా విచారిస్తే చాలా విషయాలు బయటికొస్తాయని చెబుతున్నారు.

నిందితుడు జగన్‌కు వీరాభిమాని అని, అతని జేబులో లేఖ దొరికిందని…ప్రభుత్వం చెబుతోంది. ఇవన్నీ కల్పితాలని వైసిపి వాదిస్తోంది. ఒకటి మాత్రం వాస్తవం. ఇది అంత ఆషామాషీగా తీసుకోవాల్సిన కేసు మాత్రం కాదు. నిష్పష్టపాతమైన విచారణ జరిగితేగానీ నిజానిజాలు ఏమిటో బయటకు రావు. రాష్ట్ర పోలీసులపై వైసిపి అపనమ్మకం వ్యక్తం చేస్తోంది. సిబిఐ వంటి సంస్థలపై రాష్ట్రానికి నమ్మకం లేదు. అందుకే హైకోర్టు నేతృత్వంలో ఏదైనా ఒక సంస్థతో విచారణ చేయించాల్సిన అవసరం కనిపిస్తోంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*