జగన్‌ రాంగ్‌ స్టెప్‌ : మూడు రాజధానుల ప్రకటన..

అసెంబ్లీ సమావేశాల ముగింపు రోజు చివర్లో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేసిన ప్రకనటన రాష్ట్రంలో దుమారం రేపుతోంది. రాష్ట్రానికి మూడు రాజధానులు ఉండకూడదా అంటూ ఆయన లేవనెత్తిన ప్రశ్న ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం రాజధానిగా చెబుతున్న అమరావతిలో శాసనసభ, శాసన మండలి మాత్రమే ఉంటాయి. సచివాలయం సహా కార్యాలయాలన్నీ విశాఖపట్నానికి చేరుతాయి. ఇక హైకోర్టు కర్నూలులో ఏర్పాటవుతుంది. దీన్నే మూడు రాజధానులుగా ముఖ్యమంత్రి చెప్పారు.

రాష్ట్రం విడిపోయిన తరువాత నవ్యాంధ్రప్రదేశ్‌ రాజధాని ఎక్కడ ఏర్పాటవు తుందనేదానిపై చర్చోపచర్చలు సాగాయి. రాజధాని ఎంపికపై ఒక కమిటీ కూడా ఏర్పాటయింది. ఆ కమిటీ నివేదికతో నిమిత్తం లేకుండా చంద్రబాబు ప్రభుత్వం…. విజయవాడ, గుంటూరు మధ్య అమరావతి పేరుతో రాజధాని ఏర్పాటు చేయాలని చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి అమరావతి అని నామకరణం కూడా చేశారు. రాజధాని పేరుతో తెలుగుదేశం ప్రభుత్వం భూసమీకణ (లాండ్‌ పూలింగ్‌) ద్వారా 33 వేల ఎకరాలు రైతుల నుంచి తీసుకుంది.

ఆనాడు చంద్రబాబు నాయుడు…ఎవరితోనూ సంప్రదించకుండా ఏకపక్షంగా రాజధాని ప్రకటన చేశారు. ఉత్తరాంధ్ర ప్రజలకు తమ ప్రాంతంలో రాజధాని ఉంటే బాగుండుననని అనిపించినా, గోదావరి జిల్లాల ప్రజలు తమ జిల్లాల్లో ఏర్పాటటు కావాలని కోరుకున్నా, శ్రీబాగ్‌ ఒప్పందం మేరకు తమ ప్రాంతంలోనే రాజధాని నిర్మించాలని రాయలసీమ ప్రజలు డిమాండ్‌ చేసినా….ఆఖరికి రాష్ట్రానికి మధ్యలో అందరికీ అందుబాటులో ఉందన్న కారణంగా అన్ని ప్రాంతాల వారు అమరావతిని రాజధానిగా అంగీకరించారు.

అయితే….ప్రజలు ఆశించినది వేరు, చంద్రబాబు నాయుడు అనుకున్నది వేరు. అమరావతిని రాజధానిగా అంగీకరించినంత మాత్రాన లక్షల కోట్లు అక్కడ కుమ్మరించాలని జనం కోరుకోలేదు. అన్ని ప్రాంతాలనూ సమంగా అభివృద్ధి చేయాలని ఆశించారు. కానీ చంద్రబాబు ప్రభుత్వం మాత్రం….ప్రపంచ స్థాయి రాజధాని అంటూ అమరావతిపై పెద్దపెద్ద ప్రకటనలు చేసింది. 33 వేల ఎకరాలు ఎందుకు సేకరించారంటే….ప్రపంచ స్థాయి నగరాన్ని నిర్మించాలంటే వేలాది ఎకరాల భూములు అవసరం లేదా అంటూ ఎదురుదాడి చేసింది.

అన్ని ప్రాంతాలను, జిల్లాలనూ అభివృద్ధి చేస్తామని చంద్రబాబు ప్రకటించినప్పటికీ….రాజధానిపైనే దృష్టింతా కేంద్రీకరించింది. ఇది రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల వారికి ఆందోళన కలిగించింది. అమరావతిని రాజధానిగా స్థూలంగా అంగీకరించినప్పటికీ…. అభివృద్ధి మొత్తాన్ని అక్కడే కేంద్రీకరించాలనుకోవడంపై అసంతృప్తి చెలరేగింది. గత ఎన్నికల్లో టిడిపి ఓటమికి ఇది కూడా ఒక కారణమే.

ఈ నేపథ్యంలో….వైసిపి అధికారంలోకి వచ్చింది. అప్పటి నుంచి రాజధానిపై జగన్‌ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అని అందరూ ఆసక్తిగా ఎదరుచూస్తున్నారు. రాజధానిని అమరావతి నుంచి తరలిస్తారన్న ప్రచారమూ జరుగుతోంది. రాజధానిపై అధ్యయనం చేయడానికి ప్రత్యేక కమిటీని కూడా జగన్‌ నియమించారు. ఈ కమిటీ ఇవ్వకుండానే….మూడు రాజధానుల ప్రకటన చేశారు. ఇదే ఇప్పుడు దుమారంగా మారింది.

జగన్‌ చెబుతున్నట్లు పరిపాలనా రాజధానిని విశాఖపట్నానికి మార్చాడం ఆయన స్వస్థలంలోని ప్రజలే అంగీకరించనేది వాస్తవం. శ్రీబాగ్‌ ఒప్పందం ప్రకారం రాయలసీమ ప్రజలు తమ ప్రాంతంలో రాజధాని కావాలని కోరుకున్నారు తప్ప….అమరావతిపై కోపంతో అక్కడ ఉండకూడదని కోరుకోలేదు. తమ ప్రాంతంలో లేదుకాబట్టి…..ఇంకెక్కడ పెట్టినా ఒక్కటే అని కూడా ఈ ప్రాంత ప్రజలు అనుకోవడం లేదు.

రాయలసీమకు రాజధాని దక్కనపుడు కనీసం సీమకు దగ్గరగా, అందుబాటులోనైనా ఉండాలని కోరుకున్నారు. అలాంటిది ఇప్పుడు అమరావతి నుంచి విశాఖకు తరలిస్తే సీమ అందరికంటే సీమ ప్రజలే ఎక్కువ ఇబ్బందిపడుతారు. ఇటు అనంతపురం నుంచి విశాఖపట్నం వెళ్లాలంటే కనీసం 18 – 20 గంటల సమయం పడుతుంది. ఇది ఏవిధంగానూ భావ్యం కాదు. ఆమాటకొస్తే….సీమ ప్రజలే కాదు అటు కృష్ణా జిల్లా దాకా ఇటువంటి వ్యతిరేకతే వస్తుందనడంలో సందేహం లేదు.

అలాగని జగన్‌ ఆలోచనను పూర్తిగా వ్యతిరేకించాల్సిన అవసరం లేదు. రాజధాని పేరుతో మూడు లక్షల కోట్లో, నాలుగు లక్షల కోట్లో ఖర్చు చేయాల్సిన అవసరం లేదని ఆయన చెప్పారు. ఇది వాస్తవం. రాజధాని కోసం అంత డబ్బులు వ్యయం చేసే పరిస్థితిలో రాష్ట్రం లేదు. అందుకే….అమరావతిలో రాజధానిని మూడు వేల ఎకరాలకో, నాలుగు వేల ఎకరాలకో పరిమితం చేసుకోవాలి. ప్రభుత్వ కార్యాలయాలు, అసెంబ్లీ, శాసన మండలికి అవసరమైన భవనాలు, సిబ్బంది క్వార్టర్స్‌లు వరకే నిర్మించాలి. (దీని ఆసరాగా చుట్టుపక్కల ప్రైవేట్‌ ఆధ్వర్యంలో నగరం విస్తరిస్తే విస్తరించవచ్చు.)

ఇదే సమయంలో ఇటు శ్రీకాకుళం, విశాఖపట్నం, రాజమండ్రి, కాకినాడ, ఏలూరు, మచిలీపట్నం, ఇటు ఒంగోలు, నెల్లూరు, తిరుపతి, కడప, కర్నూలు, అనంతపురం ఇటువంటి పట్టణాలనూ అభివృద్ధి చేయాలి. ఇంకా చెప్పాల్సివస్తే ఉత్తరాంధ్ర, రాజయలసీమ ప్రాంతాల్లో సాగునీటి కల్పనకు ప్రత్యేక ప్రధాన్యత ఇవ్వాలి. ప్రజలు కోరుకున్నది అభివృద్ధి వికేంద్రీకరణ తప్ప ప్రభుత్వ కార్యాలయాల వికేంద్రీకరణ కాదు.

ప్రజల్లో ఉన్న ఈ ఆలోచనను గ్రహించకుండా రాజధానిని అమరావతి నుంచి మార్చడం వల్ల ఒరిగేదేమీ ఉండదు. ప్రకాశం జిల్లా దొనకొండలో ప్రభుత్వ ఏర్పాటుకు అనువైన భూములు ఉన్నాయని వైసిపి నేతలు మొదటి నుంచి చెబుతూ వస్తున్నారు. అమరావతికి వరద ముంపు ప్రమాదం ఉందని కూడా చెబుతున్నారు. అదేవిధంగా ఇప్పుడు సేకరించినవన్నీ మూడు పంటలు పండే భూములు. ఈ పరిస్థితుల్లో అవసరమైతే అధ్యయనం చేసి అమరావతిని దొనకొండకు మార్చవచ్చు తప్పు….మూడు రాజధానుల ఆలోచన సరైనది కాదు.

అమరావతిలో రాజధాని ఏర్పాటవుతుందని ముందుగానే తెలుసుకుని (ప్రభుత్వం లీక్‌చేయడంతో) చుట్టుపక్కల వేలాది ఎకరాల భూములను తెలుగుదేశం నాయకులు కొనుగోలు చేశారని వైసిపి చెబుతోంది. దీనిపై నిజానిజాలాను నిగ్గుతేల్చవచ్చు. ఆ పని చేయకుండా మూడు రాజధానులను ముందుకు తేవడంతో….తమపై కోపంతోనే రాజధానిని అమరావతి నుంచి తరలిస్తున్నారని టిడిపి ఆరోపిస్తోంది.

ఏదిఏమైనా….రాజధానిపై చర్చ మొదలయింది. ఇది మంచికే అని చెప్పాలి. తెలుగుదేశం ప్రభుత్వం నిర్ణయించినట్లు అమరావతిలో ప్రపంచస్థాయి రాజధాని నిర్మిణానికి పూనుకుంటే….రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాలు తీవ్రంగా నష్టపోతాయి. అమరావతికి కొన్ని పరిమితులు పెట్టుకుని, అభివృద్ధిని వికేంద్రీకరించడంపై ప్రభుత్వం దృష్టి సారించాలి. రాజధాని అందరికీ అందుబాఉటలో ఉండటం, రాష్ట్రం మొత్తం సమతుల్యంగా అభివృద్ధి చెందడం ఈ రెండు అంశాలను గీటురాయిగా పెట్టుకుంటే ప్రభుత్వం సరైన నిర్ణయాలు తీసుకోగలుగుతుంది.

-ఆదిమూలం శేఖర్‌, సంపాదకులు, ధర్మచక్రం

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*