జగన్ అలర్ట్..!

రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు జోరందుకుంటున్నాయి. ప్రధాన పార్టీలు తమ బలం పెంచుకోడానికి ప్రయత్నాలు తీవ్రం చేశాయి. మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి అజ్ఞాతవాసం వీడి, కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడంతో రాజకీయ వేడి పెరుగుతోంది.

రాష్ర్ట విభజన తరువాత రాష్ట్రంలో తుడిచిపెట్టుకు పోయిన కాంగ్రెస్ మళ్లీ జవసత్వాలు కూడగట్టుకుని పూర్వ వైభవం కోసం తహతహలాడుతోంది. దేశ స్థాయిలో బిజెపి కి ప్రతికూల వాతావరణం కనిపించడం, అది కాంగ్రెస్ కు ఉపయోగపడే పరిస్థితులు గోచరించడంతో ఉత్సాహంలో ఉన్న కాంగ్రెస్ రాష్ట్రంపైనా దృష్టిపెట్టింది.

ఇటువంటి సమయం కోసం వేచి చూస్తూ, ఇప్పటిదాకా మౌనంగా ఉన్న కాంగ్రెస్ నేతలను తిరిగి క్రియాశీలం చేసేందుకు కాంగ్రెస్ పూనుకుంది. ఇందులో భాగంగానే కిరణ్ ను తెరపైకి తెచ్చింది. మొదటి నుంచి కాంగ్రెస్ కు అండగా ఉన్న రెడ్డి సామాజిక తరగతిపై కాంగ్రెస్ దృష్టి పెట్డింది. కర్నూలు జిల్లాకు చెందిన బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి కూడా కాంగ్రెస్ లో చేరుతున్నట్లు ప్రకటించారు. ఇదే బాటలో ఇంకొదరు రెడ్లు ఉన్నట్లు సమాచారం.

ఇది జరిగితే ఎక్కువగా నష్డపోయేది వైసిపినే. ఎందుకంటే ఆ పార్టీ కి ప్రధానమైన బలం రెడ్డి సామాజిక వర్గమే. కొందరు నాయకులు‌ వైసిపొలో చేరడానికి ఆసక్తి చూపినా జగన్ నాన్చుతూ వచ్చారు. కాంగ్రెస్ స్ఫీడు పెంచడంతో జగన్ అలర్ట్ అయ్యారు. మాజీ మంత్రి , నెల్లూరు నేత ఆనం రామనారాయణరెడ్డి రెడ్డి గురువారం జగన్ తో భేటీ అయ్యారు. త్వరలో ఆనం వైసిపిలో చేరడానికి రంగం సిద్ధమయింది. కాంగ్రెస్ వల్లే జగన్ అప్రమత్తం అయినట్లు కనిపిస్తోంది. ఇంకా వైసిపి తీర్థం ఆశిస్తున్న నేతలందరికీ త్వరలోనే ఇచ్చే అవకాశాలున్నాయి.

రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో రెడ్డి సామాజికవర్గం తమ పార్టీలో లేకున్నా…వైసిపిలోకి వెళ్లకూడదన్నది టిడిపి కోరిక. కాంగ్రెసు లో చేరినా ఆ మేరకు తమకు మేలు జరుగుతుందని తెలుగుదేశం భావిస్తోంది. ఇవన్నీ గమనించిన జగన్ అలర్ట్ అయ్యారు.‌ తన రాజకీయ వ్యూహాలకు పదను పెట్డారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*