జగన్ జల చక్రబంధంలో చంద్రబాబు విలవిల..!

Nara Chandrababu Naidu

తెలుగుదేశం పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాజకీయంగా వరుసగా ఇబ్బందులు ఎదుర్కొంటూనే ఉన్నారు. మొన్నిటి ఎన్నికల్లో ఓటమితో మొదలిపెడితే…. తాజాగా తెరపైకి వచ్చిన రాయలసీమ ప్రాజెక్టుల అంశం దాకా ఆయన… ముందు నుయ్యి వెనుక గొయ్యి చందంగా ఇరుక్కుంటున్నారు.

కృష్ణా నదిలో రాయలసీమ హక్కుగా ఉన్న మొత్తం జలాలను వినియోగించుకునే లక్ష్యంతో జగన్‌ మోహన్‌ రెడ్డి రెండు నీటి పథకాలను ప్రకటించారు. దీనిపైన తెలంగాణ ప్రభుత్వం భగ్గుమంటోంది. ఆ ప్రాజెక్టు ఎలా నిర్మిస్తారో చూస్తామంటూ శపథం చేస్తోంది. ఇదే సమయంలో మానీళ్లు మేం వాడుకుంటాం అని జగన్‌ తెగేసి చెబుతున్నారు.

ఈ అంశంలో తెలుగుదేశం పార్టీ ఒక విధాన్ని తీసుకోలేకపోతోంది. రాయలసీమ ప్రాజెక్టుకు అనుకూలంగా మాట్లాడితే అది జగన్‌ను బపరిచినట్లు అవుతుంది. ఇది రాజకీయంగా టిడిపికి నష్టం. ఆంధ్రప్రదేశ్‌ ప్రయోజనాలను అడ్డుకుంటున్నారంటూ కెసిఆర్‌పై విమర్శలు చేద్దామన్నా చేయలేని దుస్థితి. ఓటుకు నోటు కేసులో చిక్కుకుని, కెసిఆర్‌తో రాజీ చేసుకుని ఏపికి తరలివచ్చేసిన వ్యవహారం అందరికీ తెలిసిందే.

గత ఎన్నికల సమయంలో తెలంగాణ సిఎం కెసిఆర్‌తో కలిసి జగన్‌ మోహన్‌ రెడ్డి ఆంధ్రప్రదేశ్‌కు నష్టం చేస్తున్నారని చంద్రబాబు నాయుడు తీవ్రమైన విమర్శలు చేశారు. ఎన్నికల్లో ఓటమి తరువాత అటువంటి విమర్శలు చేయడానికి సాహసించలేకున్నారు. అధికారం కోల్పోయిన పరిస్థితుల్లో కెసిఆర్‌పై విమర్శలు చేస్తే జరిగే పరిణామాలేమిటో చంద్రబాబుకు బాగా తెలుసు. అందుకే అది కరోనా కేసు విషయంలోనైనా తెలంగాణను నోరెత్తి మాట అనడానికి చంద్రబాబు సిద్ధపడలేదు. పైగా కరోనా వేళ ఆయన తెలంగాణలోనే ఉంటున్నారాయే..!

ఇదే సమయంలో సీమ ప్రాజెక్టులను బపరచడానికి మరో సమస్య కూడా చంద్రబాబుకు ఉంది. ఈ ప్రాజెక్టుల వల్ల నాగార్జన సాగర్‌కు నీళ్లు తగ్గిపోతాయని కోస్తా జిల్లాల వారు భయపడుతున్నారు. ఈ పరిస్థితుల్లో సీమ ప్రాజెక్టును సమర్థిస్తే…. తనకు అండగా ఉంటున్నారని భావిస్తున్న గుంటూరు, కృష్ణా జిల్లాల్లో చంద్రబాబుకు ఇబ్బంది ఎదురవుతుంది. అలాగని బహాటంగా వ్యతిరేకిద్దామంటే… రాయలసీమలో ద్రోహిగా మిగిలిపోతారు.

మరోవైపు ఈ ప్రాజెక్టు ద్వారా జగన్‌ మోహన్‌ రెడ్డి…రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల ప్రజల మద్దతు కూడగట్టు కుంటున్నారు. అదేవిధంగా రాజధాని అంశంతో ఇప్పటికే ఉత్తరాంధ్ర ప్రజల మద్దతు సంపాదించుకున్నారు. ఇక సీమ ప్రాజెక్టులు చేపట్టడంతో…కెసిఆర్‌తో జగన్‌ కలిసిపోయి ఆంధ్రకు నష్టం చేస్తున్నారన్న ఆరోపణల నుంచి కూడా బయటప డుతున్నారు.

ఇప్పటికే చంద్రబాబు నాయుడు రాజధాని విషయంలో….ఇటు రాయలసీమ, అటు ఉత్తరాంధ్ర ప్రజల విశ్వాసం కోల్పోయారు. కర్నూలులో హైకోర్టు పెట్టనీకుండా అడ్డుకుంటున్నారని సీమ ప్రజల్లో, విశాఖకు పాలనా రాజధాని రాకుండా అడ్డుకుంటున్నారన్న భావన ఉత్తరాంధ్ర ప్రజల్లో ఉంది. చంద్రబాబు మాత్రం తాను నమ్ముకున్న రెండు జిల్లాకే పరిమితమయ్యే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు రాయలసీమ ప్రాజెక్టుల విషయంలోనూ అదే దురావస్థ ఎదురయింది. అందుకే సీమ ప్రాజెక్టులపై రెండు తెలుగు రాష్ట్రాల్లో రచ్చరచ్చగా ఉన్నా ఆయన మాత్రం నోరు మెదపడం లేదు.

  • ఆదిమూలం శేఖర్‌, సంపాదకులు, ధర్మచక్రం

1 Comment

  1. రెంటికీ చెడ్డ రేవడిలా‌….మారింది మన‌ చాణక్యుడి పరిస్థితి‌ 😂, అప్పుడే ఎమైంది, ఇంకా చాలా అనుభవించాలి‌ ఈ నారానాయుడు

Leave a Reply

Your email address will not be published.


*