జర్నలిజా‌న్ని ఉద్ధరించాల్సిన పనిలేదన్నారు…! నెల పారితోషికం రూ.40….! బదిలీ చేసిన తీరు నచ్చక రాజీనామా చేశాను..!

  • సీనియర్ పాత్రికేయులు పివి‌ రవికుమార్ అనుభవాలు

‘ఇప్పటికే చాలా రకాలుగా జర్నలిజంలో విలువలు దిగజారిపోతున్నాయి. ఇప్పుడు కొత్తగా నువ్వు దాన్ని ఉద్ధరించనక్కర్లేదు. నీ వల్ల మరింతగా దిజగారిపోకుండా చూసుకుంటే చాలు. అదే పదిమే’ ఇది 1985 జూన్‌ 11వ తేదీన నాకు రాత పరీక్ష పెట్టి మరీ విలేకరిగా ఎంపిక చేసిన తరువాత ఆంధ్రజ్యోతి సంపాదకులు నండూరి రామ్మోహన్‌రావుగారు చేసిన తొలి హితబోధ. ముఫ్పై ఏళ్ల సుదీర్ఘ జర్నలిజం ప్రయాణంలో ఆ మాటను నూటికి 99 శాతం శిరోధార్యంగా అమలు చేశాననే సంతృప్తి మిగిలింది.

‘నువ్వు రాసి పంపిన వార్త మరుసటి రోజు పత్రికలో ఎలా వస్తుందో చూడు. అదేవార్త ఇతర పత్రికల్లో ఎలా వచ్చిందో గమనించు. వార్తకు సంబంధించిన వాళ్లు ఏ పత్రికలో వచ్చిన వార్త బాగుందని అంటున్నారో తొసుకో. అప్పుడు నీ వార్తలో లోపాలు నీకే తెలుస్తాయి. తగిన విధంగా వార్తలు రాయడం నీకే వస్తుంది’ ఇది 1987 మార్చి 12న చంద్రగిరి ప్రాంత విలేకరిగా వార్త ఎలా రాయాలని అడిగినపుడు తిరుపతి ఆంధ్రజ్యోతి బ్యూరో చీఫ్‌ దామోదర్‌ స్వామిగారు చేసిన సూచన. వార్తను అందరూ మెచ్చుకునేలా రాయడం ఎలాగో నేర్చుకోడానికి ఆయన మాటలు నాకెంతో బాగా ఉపయోగపడ్డాయి.

‘ప్రతి పత్రికకూ ఒక భాష, శైలి ఉంటాయి. ఆ శైలి ఆ పత్రిక సంపాదకీయంలో ప్రతిఫలిస్తుంది. ఆ సంపాదకీయాన్ని చక్కగా చదువుతుంటే ఆ భాషా శైలిని అవాటు చేసుకోవచ్చు. ఆ శైలిని అనుసరించడం ద్వారా రాణించడానికి మౌలికంగా అవకాశం కలుగుతుంది.’ ఇది 1987 ఆగస్టు 26వ తేదీన భాషా ప్రయోగాల గురించి అడిగినపుడు తిరుపతి ఆంధ్రజ్యోతి న్యూస్‌ ఎడిటర్‌గా పని చేసిన జెవి క్రిష్ణమూర్తిగారు వివరించిన తీరు. గత 30 ఏళ్లలో పలు పత్రికలు మారినా శైలిపరంగా జాగ్రత్తలు తీసుకోడానికి నాకెంతో ఉపకరించిన సూచన.

1985 జూన్‌ 12న తిరుపతిలో పార్ట్‌టైం రిపోర్టర్‌గా నా పయణం మొదలుపెట్టాను. అప్పటికే తిరుపతిలో సీనియర్‌గా ఉన్న టిఆర్‌ శ్రీనివాసమూర్తి సూచనపై తిరుపతి క్రైం, పరిసర గ్రామీణ ప్రాంత వార్తలు రాసేవాడిని. అప్పట్లో ఆంధ్రజ్యోతి విజయవాడ నుంచి వచ్చేది. అందరూ వార్తలు రాసి పోస్టులో పంపేవారు. ఆ వార్త రెండు మూడు రోజు తరువాత ప్రచురితమయ్యేది. మా నాన్న రైల్వేలో పని చేస్తుండడంతో ఏ రోజు వార్తను ఆ రోజు తిరుమల ఎక్స్‌ప్రెస్‌ గార్డుకు ఇచ్చి విజయవాడ రైల్వే స్టేషన్‌లోని ఆంధ్రజ్యోతి బాక్సులో వేసే ఏర్పాటు చేసుకున్నాను. దాంతో ఒకటి రెండు రోజుల్లోనే నా వార్తలు ప్రచురితమయ్యేవి. 1987 మార్చి 5వ తేదీన తిరుపతిలో ఆంధ్రజ్యోతి ఎడిషన్‌ ప్రారంభమయ్యేదాకా నా వార్తలు అలాగే పంపేవాడిని. ఎడిషన్‌ వచ్చాక నాకు చంద్రగిరి డేట్‌లైన్‌ ఇచ్చారు. చంద్రగిరితో పాటు తిరుపతి రూరల్‌, చిన్నగొట్టిగల్లు, యర్రావారిపాలెం, పులిచెర్ల మండలాలు పరిధిగా లభించాయి. నేను తిరుపతిలోనే నివసించినా చంద్రగిరి నుంచి ఆ మండలాలకు వెళ్లివచ్చి బస్సు టికెట్టు ఆఫీసులో ఇస్తే ఆ డబ్బు నెలకోసారి ఇచ్చేవారు. చంద్రగిరి ప్రాంత సర్క్యులేషన్‌ ఆధారంగా నాకు రూ.40 పారితోషికంగా నిర్ణయించారు. ఆపై రాసే వార్తలను బట్టి కాలం సెంటీమీటర్‌కు 60 పైసలు వంతున నెలలోసారి ఇచ్చేవారు.

ఎడిషన్‌ వచ్చిన కొత్త కావడంతో నేను పెద్ద సంఖ్యలో వార్తలు రాసి తిరుపతి ఆర్‌టిసి బస్టాండులోని ఆంధ్రజ్యోతి బాక్సులో వేసేవాడిని. ఆ విధంగా నాకు నెలకు రూ.200 దాకా వచ్చేది. వార్తలు బాగా రాస్తానని డెస్క్‌లో ఉన్నవారి దగ్గర గుర్తింపు తెచ్చుకోవడంతో ఎప్పుడిచ్చినా నా వార్త బాగా ప్రచురితమయ్యేది. ఆ ఉత్సాహంతో సాధారణ వార్త నుంచి సంచన వార్తలు రాసేవాడిని. ఫలితంగా 1989 మార్చి 6వ తేదీన నన్ను తిరుపతి బ్యూరో అసిస్టెంట్‌గా తీసుకున్నారు. మా బ్యూరో చీఫ్‌ దుర్గాప్రసాద్‌ గారు ఎంతో సహకారం అందించడంతో రెచ్చిపోయి వార్తలు రాసేవాడిని. ఆయన వద్ద ఎన్నో మెళకువలు నేర్చుకున్నాను. తిరుపతిలో హిందూ రిపోర్టర్‌ దేవరాజన్‌గారు, ఈనాడు రిపోర్టర్‌ బి.రవిగారితో కలిసి తిరగడం ద్వారా వార్త సేకరణ పద్ధతులు చూసి, అడిగి తీసుకుని నేర్చుకోగలిగాను. అప్పటికే పార్ట్‌ టైమర్‌గా ఉన్న నా జీతం రూ.3,000 దాటడంతో ఆంధ్రజ్యోతి యాజమాన్యం 1991 నవంబర్‌ 16న ట్రైనీ స్టాఫర్‌గా నియమించారు. ఆ క్రమంలో 1992లో తిరుపతి జరిగిన కాంగ్రెస్‌ పార్టీ జాతీయ ప్లీనరీ సమావేశాలు నాకెంతో గుర్తింపు తెచ్చాయి. ఆ ప్లీనరీ ప్రారంభానికి ముందు అప్పటి ప్రధాని, ఏఐసిసి అధ్యక్షు పివి నరసింహారావు పార్టీ పతాకాన్ని ఆవిష్కరించి, సేవాదళ్‌ను ఉద్ధేశించి చేసిన హిందీ ప్రసంగాన్ని కవర్‌ చేయడం మరచిపోలేని అనుభవం. నాకు హిందీ వచ్చివుండడంతో పలువురు సీనియర్లకు అనువదించి చెప్పడం ఆనందకరమైన విషయం. ఆ మధ్య కాలంలో తిరుపతి రేడియో స్టేషన్‌, స్విమ్స్‌, బర్డ్స్‌, ఎంఎస్‌టి రాడార్‌ వంటి సంస్థల ప్రారంభోత్సవ వార్తలు రాసే అదృష్టం కలిగింది. ఎస్‌వి యూనివర్సిటీ, పద్మావతి మహిళా యూనివర్సిటీ వార్తలను పూర్తి అవగాహనతో రాయడం, యూనివర్సిటీ చట్టాలను సమీక్షించే వార్తలు రాయడం మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి. ఇదే సమయంలో దేవరాజన్‌ గారు, రవిగారితో పాటు 1985లో నాతో పాటే వృత్తిలో ప్రవేశించిన డెక్కన్‌ క్రానికల్‌ రిపోర్టర్‌గా రామచంద్రారెడ్డిగారి సహకారం మరచిపోలేను.

1987 నుంచి 1993 వరకు దామోదర స్వామి గారు, దుర్గాప్రసాద్‌గారు, జగన్నాథ నాయుడుగారు, సుబ్బారావుగారు, కెఎస్‌విగార్ల నేతృత్వంలో పనిచేసే అవకాశం కలిగింది. ఒకొక్కరి నుంచి ఒక్కో క్షణం నేర్చుకోగలిగాను. 1973 ఫిబ్రవరిలో నన్ను స్టాఫ్‌ రిపోర్టర్‌గా చిత్తూరుకు బదిలీ చేశారు, నేను లేకుంటే కష్టమని స్పాట్‌న్యూస్‌ డైరెక్టర్‌ రాంప్రసాద్‌గారితో పోట్లాడి ఆ బదిలీని సాయంత్రానికి రద్దు చేయించిన జగన్నాథ నాయుడిగారి చర్య నామీద నాకు ఎంతో నమ్మకం పెంచింది. ఆ తరువాత అదే ఏడాది వచ్చిన దుర్గాప్రసాద్‌ గారి ప్రోత్సాహంతో తొలిసారి కడప జిల్లా రిపోర్టర్‌గా బదిలీ అయ్యాను. 1996 వరకు కడప జిల్లాలో పని చేసిన నాకు కొత్తకొత్త అనుభవాలు, పరిచయాలు భించేలా చేసింది. జిల్లా విలేకరిగా అనేక మంది విలేకరులను ప్రోత్సహించే అవకాశం కలిగింది. ప్రస్తుతం విజయవాడలో సాక్షి నెట్‌వర్క్‌ ఇన్‌ఛార్జిగా ఉన్న నగేష్‌ కూడా అందులో ఒకరు. ముఖ్యంగా 1994 – 96 మధ్యకాలంలో కడపలో జరిగిన శాసనసభ, స్థానిక సంస్థల ఎన్నికలలో, క్లిష్టసమయాలలో పని చేయగ నైపుణ్యం లభించింది. కడపలో ఆంధ్రప్రభ చీఫ్‌ రిపోర్టర్‌ శ్రీనాథరెడ్దిగారి సహకారంతో ధైర్యంగా వార్తలు రాసి గుర్తింపు పొందగలిగాను. 1996లో దుర్గా ప్రసాద్‌గారు హైదరాబాద్‌కు బదిలీకావడంతో చిత్తూరు, నెల్లూరు, కడప, అనంతపురం పరిధిగా తిరుపతిలో బ్యూరోచీఫ్‌గా పనిచేసే అవకాశం భించింది. ఆ సందర్భంగా కొందరి వ్యవహార శైలితో ఇబ్బందు ఎదుర్కొని 1996 నవంబర్‌ 1న ఆంధ్రజ్యోతికి రాజీనామా చేశాను. ఆంధ్రప్రభ రాష్ట్ర బ్యూరోచీఫ్‌ దేవుపల్లి అమర్‌గారు, విజయవాడ ఎడిషన్‌ ఇన్‌ఛార్జి జెవి క్రిష్ణమూర్తిగార్ల సహకారంతో ప్రకాశం జిల్లా ఆంధ్రప్రభ బ్యూరోచీఫ్‌గా 1996 డిసెంబర్‌ 13న ఒంగోలులో చేరాను. 1999 వరకు అక్కడ పని చేసిన నాకు అన్ని పత్రికలకు చెందిన విలేకరులు సన్నిహితంగా ఉండేవారు. ముఖ్యంగా వెలిగొండ ప్రాజెక్టుపై రాసిన వరుస కథనాలకు ఆ జిల్లా కలెక్టర్‌ డి.శ్రీనివాసులు లిఖితపూర్వకంగా నాకు పంపిన ప్రశంసాపత్రం మరచిపోలేనిది. 1998లో మా నాన్న మరణించడంతో 1999లో ఆంధ్రప్రభకు రాజీనామా చేసి తిరుపతికి వచ్చాను. తరువాత అప్పటి వార్త ఎడిటర్‌ కె.చంద్రమూర్తి సహకారంతో తిరుపతి వార్త స్టాఫ్‌ రిపోర్టర్‌గా 1999 డిసెంబర్‌ 11న చేరాను. 2007 వరకు వార్త బ్యూరో ఇన్‌ఛార్జిగా, రోమింగ్‌ కరస్పాండెంట్‌గా పలు హోదాలు నిర్వహించాను. తిరుపతిలో నాకున్న పరిచయాలు, యాజమాన్యం ఇచ్చిన స్వేచ్ఛతో మంచి స్టోరీలు రాయగలిగాను. తిరుపతి నగరానికి ప్రత్యేకంగా 8 పేజీ టాబ్‌లాయిడ్‌ ఇచ్చేలా కృషి చేసిన ఘనత నాకు దక్కింది. పలువురు కొత్త విలేకరులకు అవకాశం ఇచ్చి తిరుపతిలో లాబ్‌లాయిడ్‌ను విజయవంతంగా నిర్వహించిన తీరు ఇప్పటికీ చాలా మంది గుర్తుచేయడం నాకు గర్వంగా అనిపిస్తుంది. 2007 మే నెలలో నన్ను చిత్తూరుకు జిల్లా రిపోర్టర్‌గా బదిలీ చేసిన తీరు నచ్చక అక్కడ ఓ నెల రోజులు పని చేసి తరువాత వార్తకు రాజీనామా చేశాను. 2007 జూన్‌ నెలలో నెల్లూరు జిల్లా సాక్షి బ్యూరోచీఫ్‌గా చేరాను. కొత్తగా మార్కెట్‌లో ప్రవేశించినందున సాక్షి కోసం చాలా ఎక్కువ శ్రమపడాల్సి వచ్చింది. 2008లో సాక్షి మార్కెట్‌లోకి వచ్చిన తరువాత నెల రోజులకు నా ఆరోగ్యం బాగా దెబ్బతినడం, ఇతర వ్యక్తిగత కారణాతో రాజీనామా చేసి జులై నెలలో తిరుపతికి వచ్చాను. టిటిడికి చెందిన శ్రీవెంకటేశ్వర భక్తి ఛానల్‌లో న్యూస్‌ ఎడిటర్‌గా పని చేసిన రెండేళ్లలో ఎన్నో కొత్త విషయాలు నేర్చుకోగలిగాను. ముఖ్యంగా కంప్యూటర్‌పరంగా చాలా నేర్చుకోడానికి ఎస్‌విబిసిలో అవకాశం భించింది. అక్కడ కాంట్రాక్టు పూర్తయ్యాక రెండు మూడేళ్లు ఆంధ్రప్రభ బ్యూరో ఇన్‌ఛార్జిగా, ప్రీలాన్స్‌ జర్నలిస్టుగా, శ్రీసిటీ సెజ్‌ మీడియా సహాదారుగా పని చేశాను. ప్రస్తుతం చెన్నైలో ఇండియా టుడేలో అసిస్టెంట్‌ కాపీ ఎడిటర్‌గా పని చేస్తున్నాను.

నా 30 ఏళ్ల ప్రయాణంలో వార్తలు రాసి, కవర్‌లో పెట్టి, ఆర్‌టిసి బస్సులో డ్రైవర్‌కి ఇచ్చి పంపండం నుంచి…ఎక్ట్రానిక్‌ టెలిప్రింటర్‌ ద్వారా, కంప్యూటర్‌ ద్వారా పంపించే వరకు పలు రకాల విధానాలను అనుసరించే అవకాశాలు కలిగాయి. వార్త కవర్‌ బస్‌ డ్రైవర్‌కి ఇచ్చి ఐదు రూపాయలు చెల్లిస్తే తిరుపతి ప్రధాన కార్యాయం గేటు వద్ద విసిరివేసేవారు. వాటిని సెక్యూరిటీ వాళ్లు తీసుకుని డెస్క్‌లో ఇచ్చేవాళ్లు. ఎన్నోసార్లు డ్రైవర్లు మరచిపోవడం, విసిరిన కవర్‌ మరచిపోవడం వంటి ఇబ్బందులు పడ్డాను. వృత్తిపరంగా కడపలో హెచ్చరికలు, బెదిరింపు లభించాయి. నేను రాయని వార్తపై నమోదైన కోర్టు కేసు కోసం తిరుపతి-కడప మధ్య మూడు నెలలు తిరగాల్సివచ్చింది.

నా సుదీర్ఘ అనుభవం ద్వారా చెప్పేదేమిటంటే రాసే వార్త గురించి పూర్తి అవగాహన కలిగివుండడం, భాషాపరంగా జాగ్రత్తలు తీసుకోవడం, వృత్తిపరంగా గౌరవంగా ఉంటూనే నిజాయితీగా వ్యవహరించడం మంచి విలేకరి అనిపించుకోడానికి పనికొస్తుందని నా విశ్వాసం. ఈ విషయంలో నాకు మార్గదర్శకంగా నిలిచి సూచనలు, సహాలు ఇచ్చిన ఎందరో సీనియర్‌ జర్నలిస్టులకు, సమాచార శాఖ పెద్దలకు వందనాలు. నేను పనిచేసిన అన్ని ప్రాంతాల్లో దాదాపు 200 మంది విలేకరులను పత్రికా రంగానికి పరిచయం చేసిన సంతృప్తి కలిగింది. కేవలం డబ్బు సంపాదించడం కోసమే అయితే జర్నలిజం వృత్తిలోకి రావద్దని ఔత్సాహికులైనవారికి నేను ఇవ్వగలిగే సలహా. రెండు వైపులా పదునున్న కత్తిలాంటి జర్నలిజాన్ని నీతి నిజాయితీలకు, విలువలకు ఉపయోగపడేలా వినియోగించడంలోనే జర్నలిస్టు ప్రతిష్ట ఆధారపడివుంటుందని నా ప్రగాఢ విశ్వాసం. అనుభవం నేర్పిన పాఠం.

          - పి.వి.రవికుమార్‌, తిరుపతి

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*