జిల్లాల మ‌ధ్య త‌గ‌వులు త‌ప్ప… నీళ్లు వ‌చ్చేలా లేవు..! అంతా బాబుగారి స్వ‌యంకృతాప‌రాధం!!

ఆంధ్ర ప్రదేశ్ లో అధికార పార్టీ నేతలు అవలంభించే దుర్మార్గ పు విధానాల వలన తుదకు వారి పీకల మీదకే వస్తోంది. ప్రతిపక్షాలకు లేక ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేకుండా వ్యవహరించే మీడియా ప్రచురించే వార్తలకు, విశ్లేషణకు రాజకీయాలు అంటగడు తున్నారు. తమ గొప్ప గోరంత కొండంత గా చూపే తమకు చెందిన మీడియా రాస్తేనే సరైన వార్త గా పరిగణించే దుష్ట సంస్కృతి నెలకొని వున్న సమయంలో టిడిపి నేతలు దిమ్మ దిరిగే వార్త బుధవారం వెలువడింది. హంద్రీనీవా జలాలు జిల్లాకు డిసెంబర్ లో వచ్చే అవకాశం ఉందని అధికార పార్టీ నేతలు, వారికి చెందిన మీడియా ఇన్నాళ్లు ఊదర గొట్టి తుదకు కాంట్రాక్టర్ సహకరించడం లేదని చేతులు ఎత్తేశారు. హంద్రీనీవా జలాలు ముఖ్యమంత్రి నియోజకవర్గంకు తరలించాలంటే నాలుగైదు నెలలు పడుతుందని టిడిపి కి చెందిన మీడియా ఒకటి చల్లని కబురు బయట పెట్టింది.

గంగవరం మండలంలోని పశు పత్తూరు, వి కోట మండలంలోని కృష్ణా పురం అదినే పల్లి వద్ద ఎత్తిపోతల నిర్మాణం పూర్తి కావడానికి నాలుగైదు నెలలు పడుతుందని, గుడు పల్లి మండలంలో ఒంటి పల్లి వద్ద రైల్వే లైన్ పై నిర్మాణానికి అనుమతి రావలసి వుందని, సదరు మీడియా బహిర్గతం చేసింది. మరెవరైనా ఈ లాంటి వార్త ఇచ్చివుంటే గిట్టని వారు చేసే ప్రచారంగా ప్రకటించే వారు. అంతేకాదు. సదరు కాంట్రాక్టర్ బ్లాక్ మెయిల్ చేస్తున్నారని అమరావతిలో ముఖ్యమంత్రి వద్దకు పంచాయతీ జరుగ నున్న దనికూడా ఈ మీడియా కథనం.

ఇందులో రెండు అంశాలు ఇమిడి వున్నాయి.
1. కాంట్రాక్టర్ బ్లాక్ మెయిల్. నిలువ దోపిడీ. 2.నీటి కేటాయింపులు. అయితే గియితే ఎన్ని నీళ్లు ఇవ్వ గలరు.

కుప్పం బ్రాంచి కాలువ పనులను టిడిపి కి చెందిన రాజ్యసభ సభ్యులు ఒకరు దక్కించు కున్నారు. 2015 లో 403.65 కోట్ల అంచనాతో మొదలు పెట్టి 4 శాతం అధికంగా మొత్తం 430 కోట్లతో పనులు ప్రారంభించారు. అంతవరకు ఈ కథ ముగియ లేదు. టెండర్ జరిగే సమయంలో సరైన అంచనాలు వేయలేదని, పనులు పెరిగాయని మరొక 122.75 కోట్లు ఇస్తే పని చేస్తానని యం. పి డిమాండ్ చేశారు. అంత పెద్ద నేత రాజ్యసభ సభ్యులు కోరితే కాదనే ధైర్యం ఎవరికి వుంటుంది. ముఖ్యమంత్రి లెవల్ లో ఆమోద ముద్ర పడింది. తీరా మరి కొన్ని మార్పులు అనుమతి లేకనే అమలు చేసి అదనపు మొత్తం డిమాండ్ చేస్తున్నారని చెబుతున్నారు. అంతేకాకుండా పనులు చేయ కున్నా ముందుగా అడ్వాన్స్ ఇస్తేనే ప‌నులు చేస్తాన‌ని కాంట్రాక్టర్ అయిన సదరు యం. పి డిమాండ్ చేస్తున్నారని మీడియా కథనం.

మరో వేపు నీటి కేటాయింపులు అంత సులభం కాదు. అనంతపురం జిల్లాలో చివరదైన చర్లోపల్లి రిజర్వాయర్ నుండి చిత్తూరు జిల్లాకు నీళ్లు రావాలి. ప్రస్తుతం 600 క్యూసెక్కుల నీరు విడుదల చేయాలని భావించినా కేవలం 250 క్యూసెక్కుల నీరు వస్తోంది. ఈ రిజర్వాయర్ నీటి నిల్వ సామర్థ్యం 1.425 టియంసిలు.

ఇదిలా వుండగా ముఖ్యమంత్రి తన నియోజకవర్గంకు నీరు తరలించుతూ తమకు అన్యాయం చేస్తున్నారని అనంతపురం జిల్లాలో అలజడి మొదలైంది. వారం కింద‌టి గ‌ణాంకాల ప్రకారం హంద్రీనీవా ద్వారా 25 టియంసిలు మాత్రమే తరలించారని, కర్నూలు జిల్లా కు 10 టియంసిలు ఇవ్వగా తమకు కేవలం 15 టియంసిలు ఇచ్చారని, మరొక నాలుగైదు టియంసిలకు మించి రావని ఈ పరిస్థితిలో చిత్తూరు జిల్లాకు తరలించితే వేసవిలో తాగునీటి కి ఇబ్బంది వుంటుందనే ప్రచారం అనంతపురం జిల్లాలో మొదలైంది. వాస్తవంలో హంద్రీనీవా పథకంపై ముఖ్యమంత్రి దృష్టి పెట్టి నిధులు వ్యయం చేసి వుంటే జిల్లాల మధ్య తగాదాలు వుండేవి కావు. మల్యాల నుండి జీడిపల్లి వరకు గల ప్రధాన కాలువ 3820 క్యూసెక్కుల నీరు ప్రవహించే విధంగా తవ్వబడినా అధికారులు కాంట్రాక్టర్ల మోసంతో 2000 క్యూసెక్కుల నీరు కూడా రావడం లేదు. పైగా12 పంపులుంటే ఈ మధ్య వరకు 7 పంపులే పని చేశాయి. ప్రధాన కాలువలో నీరు రావడం లేదని గత ఏడాది రూ.1200 కోట్ల అంచనా తో విస్తరణ పనులు ప్రారంభించారు. ఈ పనులు కూడా కుప్పం కాలువ పనులు చేపట్టిన టీడీపీ రాజ్యసభ సభ్యులు చేపట్టారు. ఈ విస్తరణ పనులు పూర్తి అయి వుంటే హంద్రీనీవా నుండి ఎక్కువ నీరు తరలించే అవకాశం వుండేది. ఈ ఏడు ఆగస్టు 16 తేదీ నుండి పంపింగ్ జరుగుతున్నా కర్నూలు అనంతపురం జిల్లాలకు కూడా నీరు ఇవ్వ లేక పోయారు. కేవలం 2363 క్యూసెక్కులు మాత్రమే ఎత్తి పోశారు. ప్రస్తుతం కేవలం 1688 క్యూసెక్కుల మాత్రం పంపింగ్ చేస్తున్నారు.

రాష్ట్ర ప్రభుత్వం జాగ్రత్త పడి హంద్రీనీవా ప్రధాన కాలువ విస్తరణ పనులు పూర్తి చేసి వుంటే కర్నూలు, అనంతపురం జిల్లాల అవసరాలు తీర్చి చిత్తూరు జిల్లాకు నీరు తరించుతుంటే వ్యతిరేకత వచ్చేదికాదు. ఇదంతా ముఖ్యమంత్రి స్వయం కృతం. పైగా మరో ప్రమాదం పొంచి వుంది. ప్రస్తుతం కృష్ణ నది నీటి మట్టం 841 అడుగులకు పడిపోయింది. కేవలం 63. 93 టియంసిలు నీరు మాత్రమే శ్రీ శైలంలో వుంది. నీటి మట్టం 830 అడుగులకు పడిపోతే హంద్రీనీవా ద్వారా పంపింగ్ కుదరదు. అప్పుడు ముచ్చు మరి నుండి అతి తక్కువ నీరు ఎత్తి పోసు కోవాలి.అది కూడా 800 అడుగుల వరకే. పైగా కృష్ణ బోర్డు ఎపికి 30 టియంసిలు కేటాయించినా తెలంగాణ విద్యుత్ ఉత్పత్తి కి నీరు వదలుతూ వుంటే నీటి మట్టం పడి పోయి హంద్రీనీవాకు కోరి 6.95 టియంసిలు వాడుకొనే అవకాశం వుండదు. ఏతావాతా ఈ ఏడు కూడా చిత్తూరు జిల్లాకు ఆశించిన మేరకు కృష్ణ జలాలు రావు. చిన్న పిల్లల గుజ్జన గూళ్ళు ఆడినట్లు ముఖ్యమంత్రి హంద్రీనీవాను మార్చి వేశారు. కాలువల్లో మచ్చుకు నీరు పారించి కృష్ణ జలాలు జిల్లాకు తెచ్చి చరిత్ర సృష్టించానని చెప్పబోతున్నారు.

                                                                                                                           – వి. శంకరయ్య,  9848394013

 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*