జూనియర్‌ ఎన్‌టిఆర్‌కు చంద్రబాబు గాలం..!

జూనియర్‌ ఎన్‌టిఆర్‌కు గాలం వేయడానికి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రయత్నిస్తున్నారు. తెలంగాణ ఎన్నికల బరిలో జూనియర్‌ సోదరి సుహాసిన్ని దింపడం ద్వారా…ఎన్‌టిఆర్‌ మద్దతు కూడగట్టుకోడానికి వ్యూహం రచిస్తున్నారు. చంద్రబాబు గాలానికి జూనియర్‌ చిక్కుతారా?

జూనియర్‌ ఎన్‌టిఆర్‌…తెలుగు సినీ రంగంలో మంచి క్రేజ్‌, ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉన్న హీరో. వాక్‌పటిమ, సమయస్ఫూర్తి కలిగిన వ్యక్తి. జూనియర్‌ వంటి వ్యక్తి సినిమాల్లోనేకాదు…రాజకీయాల్లోనూ బాగా రాణించగలరు. తాను రాజకీయాల్లో ఉంటే ఎలాంటి ప్రభావం చూపగలరో…గతంలోనే శాంపిల్‌ చూపించారు. 2009 ఎన్నికల్లో జూనియర్‌ ఎన్‌టిఆర్‌ తెలుగుదేశం తరపున ప్రచారం చేశారు. అప్పుడు ఆయన ఉపన్యాసాలు విన్న జనం ముగ్దులయ్యారు. జూనియర్‌ రాజకీయాల్లోకి ప్రవేశిస్తే మంచి భవిష్యత్తు ఉంటుందని భావించారు.

ఆ తరువాత జరిగిన పరిణామాల్లో జూనియర్‌ తండ్రి నందమూరి హరిక్రిష్ణకు చంద్రబాబుకు మధ్య తలెత్తిన విభేదాలతో హరిక్రిష్ణ కుటుంబం మొత్తం పార్టీకి దూరమైపోయింది. కొంతకాలం అంటీముట్టనట్లు ఉన్నా…ఆ తరువాత విభేదాలు బహిరంగంగానే కనిపించాయి.

జూనియర్‌ రాజకీయాల్లోకి వస్తే తన కుమారునికి భవిష్యత్తు ఉండదన్న భయంతో చంద్రబాబు మెల్లగా హరిక్రిష్ణను, జూనియర్‌ను పక్కనపెట్టారని చెబుతారు. ఈ ఆలోచనతోనే బాలకృష్ణ కుమార్తె బ్రాహ్మణితో లోకేష్‌ వివాహం జరిపించిన బాబు…ఇక ఎవరి మద్దతూ అవసరం లేదన్నట్లు వ్యవహరించారు.

ఆ మనస్తాపంతోనే హరిక్రిష్ణ కుటుంబం చంద్రబాబుకు దూరం జరిగింది. ఈ పరిణామాల నేపథ్యంలో…చంద్రబాబు రాజకీయ వారసునిగా ఆయన కుమారుడు లోకేష్‌ రంగప్రవేశం చేయడం, ఎంఎల్‌సి అవడం, ఆ వెంటనే మంత్రి పదవి చేపట్టడం చకచకా జరిగిపోయాయి.

ఇవన్నీ చూసిన తరువాత హరిక్రిష్ణ ఇక టిడిపిలో ఉండబోరని, బిజెపిలోగానీ ఇంకో పార్టీలోగానీ చేరుతారన్న వార్తలొచ్చాయి. 2019 ఎన్నిలకు ముందు హరిక్రిష్ణ తన రాజకీయ నిర్ణయం ప్రకటిస్తారని అంతా భావించారు. ఇంతలోనే ఆయన రోడ్డు ప్రమాదంలో కన్నుమూశారు.

ఇదిలావుంటే….2019 ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని మళ్లీ హరిక్రిష్ణకు దగ్గరయ్యేందుకు చంద్రబాబు నాయుడు విఫల యత్నం చేశారు. టిటిడి ఛైర్మన్‌ పదవి ఇస్తామంటూ హరిక్రిష్ణ వద్దకు రాయబారం నడిపారు. కొన్ని నెలల పాటు వేచి చూసినా హరిక్రిష్ణ అంగీకరించలేదు.

చాలా ఏళ్లుగా జూనియర్‌ – చంద్రబాబు కుటుంబాల మధ్య సంబంధాలు అంతంతమాత్రంగానే ఉన్నాయి. హరిక్రిష్ణ మరణించినపుడు ఈ సంబంధాలు కొంత మెరుగుపడ్డాయి. ఈ క్రమంలోనే….తెలంగాణ ఎన్నికల్లో నందమూరి కుటుంబ సభ్యులు ఒకరైనా పోటీలో ఉండాలన్న ఆలోచనతో….హరిక్రిష్ణ కుమార్తె, జూనియర్‌ సోదరి సుహాసిన్ని కూకట్‌పల్లి నియోజకవర్గం నుంచి బరిలోకి తీవాలని పావులు కదుపుతున్నారు.

సుహాసిన్ని ఒప్పించి పోటీ చేయించగలిగితే…జూనియర్‌ ఎన్‌టిఆర్‌, కల్యాణ్‌రామ్‌ కూడా పార్టీ తరపున ప్రచారం చేసే అవకాశం ఉంటుందని టిడిపి భావిస్తోంది. పైగా ఇప్పుడు రెండు రాష్ట్రాలు అయినందున….నాయకత్వ సమస్య కూడా ఉండదని అనుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో లోకేష్‌ ఉంటే, తెలంగాణ నాయకత్వం జూనియర్‌కు అప్పగించవచ్చని చంద్రబాబు భావిస్తున్నట్లు సమాచారం. అయితే…జూనియర్‌ ఎలా స్పందిస్తారో, ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*