జూనియర్‌ బిజెపిలో చేరుతారా?!

తెలుగుదేశం వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు రూపురేఖలతో చిన్ననాటి నుంచే తెలుగు ప్రజల అభిమాన నటుడిగా మారిన జూనియర్‌ ఎన్‌టిఆర్‌ విశేషమైన ప్రతిభాపాటవాలు కలిగిన నటుడు. ఇటీవల్‌ బిగ్‌బాస్‌ షోతో తెలుగు ప్రజలకు మరింత దగ్గరయ్యారు. జూనియర్‌ సినిమాల్లోనే కాదు…రాజకీయాల్లోనూ రాణించగల సత్తావుంది. 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించడం కోసం రాష్ట్రమంతా పర్యటించారు. తనదైన శైలితో ఉపన్యాసాలతో ఓటర్లను ఆకట్టుకున్నారు. హరిక్రిష్ణ తనయుడిగా…తెలుగుదేశం పార్టీలో కీలక పాత్ర పోషించవచ్చని అభిప్రాయం సర్వత్రా వ్యక్తమయింది. చంద్రబాబు తరువాత ఆ పార్టీని నడపగల సత్తా ఉన్న వ్యక్తిగా జూనియర్‌ ఎన్‌టిఆర్‌ను అందరూ గుర్తించారు. ఎన్నికల తరువాత పరిణామాలతో జూనియర్‌ ఎన్‌టిఆర్‌, హరిక్రిష్ణ టిడిపికి దూరమయ్యారు. పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా జూనియర్‌ను పక్కనపెట్టేశారు. జూనియర్‌ రాజకీయాల్లోకి వసేంత పార్టీలో తన కుమారుడు లోకేష్‌కు పోటీ అవుతాడన్న ఆందోళన ఆయనలో ఉంది. అది వాస్తవం కూడా. జూనియర్‌ ఎన్‌టిఆర్‌ ప్రభముందు…లోకేష్‌ నిలబడే పరిస్థితి లేదు. అదీకాకుండా…ఎన్‌టిఆర్‌ కొడుకుబిడ్డగా జూనియర్‌ వారసత్వాన్నే జనం ఆమోదించే అవకాశముంది. ఈ నేపథ్యంలోనే లోకేష్‌కు బాలకృష్ణ కుమార్తెతో వివాహం జరిపించారు. దీంతో లోకేష్‌ కూడా నందమూరి కుటుంబంలో భాగమయ్యారు. లోకేష్‌ మంత్రి కూడా అయ్యారు. వచ్చే ఎన్నికల్లో టిడిపి గెలిస్తే లోకేష్‌ ముఖ్యంత్రి అవుతారు.

హరిక్రిష్ణ కుటుంబం చాలా రోజులుగా రాజకీయాలకు దూరంగా ఉంది. రానున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని హరిక్రిష్ణ కుటుంబాన్ని మళ్లీ దువ్వేందుకు చంద్రబాబు ప్రయత్నించారు. టిటిడి ట్రస్టుబోర్డు ఛైర్మన్‌ తీసుకోమని హరిక్రిష్ణను ప్రాధేయపడ్డారు. దానికి హరిక్రిష్ణ ససేమిరా అన్నారు. వాస్తవంగా ఎన్‌టిఆర్‌ మరణానంతరం హరిక్రిష్ణ ‘అన్న తెలుగుదేశం’ పార్టీ స్థాపించారు. రాజకీయాలు అంతగా ఒంటపట్టించుకోని ఆయన…విజయం సాధించలేకపోయారు. కాలక్రమంలో మళ్లీ తెలుగుదేశం పార్టీకి చేరువయ్యారు. గత ఎన్నికల తరువాత మొత్తంగా దూరమయ్యారు. అప్పటి నుంచి హరిక్రిష్ణపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఆయన వైసిపిలో చేరుతారన్న ప్రచారమూ జరిగింది. తాజాగా ఆయన బిజెపిలో చేరుతారన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. జూనియర్‌ మేనత్త పురందీశ్వరి బిజెపిలో కీలకంగా ఉన్నారు. ఆమె ప్రోద్బలంతో బిజెపిలో చేరతారని చెబుతున్నారు. జూనియర్‌ ఇదే చేస్తే…అంతకంటటే పెద్ద పొరపాటు ఏమీవుండదు. తెలుగుదేశం వ్యవస్థాపకులు పెద్ద ఎన్‌టిఆర్‌ జీవితాంతం జిజెపికి వ్యతిరేకంగా ఉన్నారు. చంద్రబాబు నాయుడు ఆ సిద్ధాంతానికి తిలోదకాలు ఇచ్చినందుకు ఇప్పుడు ఇబ్బందిపడుతున్నారు. బాబు మీద వ్యతిరేకతతో బిజెపి పంచన చేరితో టిడిపి మూల సిద్ధాంతాన్నే గాలికి వదిలేసినట్లు అవుతుంది. అందుకే జూనియర్‌ ఆలోచించి అడుగులు వేయాల్సిన అవసరం ఉంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*