జూబ్లీహిల్స్‌లోని ప్రైవేట్‌ ఆలయానికి రూ.4.76 కోట్ల టిటిడి నిధులు!

తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో అత్యంత ధనవంతులు నివాసముండే జూబ్లీహిల్స్‌లో తిరుమల తిరుపతి దేవస్థానం రూ.14 కోట్లు వెచ్చించి శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయం నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఇదే ప్రాంతంలోని మరో ప్రైవేట్‌ ఆలయానికి రూ.4.76 కోట్ల శ్రీవారి నిధులు ఇవ్వబోతున్నారు. ఈ నిధులను ఇక్కడ కల్యాణ మండపం, అన్నదానం హాలు నిర్మాణం, కారు పార్కింగ్‌ ఏర్పాటుకు ఖర్చు చేయనున్నారు. టిటిడి పాలక మండలిలో తీర్మానం జరిగిందో లేదో తెలియదుగానీ….ఇప్పటికే దీనికి సంబంధించి అంచనాలు అన్నీ సిద్ధమై టెండర్లు పిలవడానికి అధికారులు రెడీ అవుతున్నారు.

ముఖ్యమంత్రి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నుంచి 21.10.2016న ఒక లేఖ టిటిడికి అందింది. జూబ్లీ హిల్స్‌, రోడ్డు నెం.15లో ఉన్న సీతారామస్వామి ఆలయానికి కల్యాణ మంపడం, అన్నదాన హాలు, కారు పార్కింగ్‌ నిర్మాణానికి అవసరమైన రూ.4.76 కోట్ల నిధులు కేటాయించాలన్నది దాని సారాంశం. ఈ మేరకు జీవో ఆర్‌టి నెం.16, తేదీ : 03.01.2018ను ప్రభుత్వం విడుదల చేసింది. ముఖ్యమంత్రి కుటుంబ సభ్యుల సిఫార్సు వల్లనే ప్రైవేట్‌ ఆలయానికి నిధులు ఇవ్వడానికి సిద్ధపడ్డారని తెలుస్తోంది. టిటిడి ఇప్పటికే జూబ్లీ హిల్స్‌లో శ్రీవారి ఆలయాన్ని నిర్మిస్తోంది. అవసరమైతే అక్కడే కల్యాణ మండపం నిర్మింవచ్చు. కానీ అదే ప్రాంతంలోని ఇంకో ఆలయానికి అనుబంధంగా ఇవన్నీ చేయాల్సిన అవసరం ఏముందనేది ప్రశ్న.

సాధారణంగా పురాతన ఆలయాలను పునరుద్ధరించడానికి టిటిడి నిధులు ఇస్తుంది. దేవాదాయ శాఖ అధీనంలోని ఆలయాల్లో రద్దీని దృష్టిలో ఉంచుకుని, ప్రముఖ ఆలయాల వద్ద యాత్రీకుల వసతి సముదాయాలు వంటివి నిర్మిస్తుంది. అంతేగానీ…ప్రైవేట్‌ ఆలయాలకు కల్యాణ మండపాలు నిర్మించడానికి, అన్నదాన సత్రాలు కట్టించడానికి, కారు పార్కింగులు ఏర్పాటుకు నిధులు ఇచ్చే సంప్రదాయం టిటిడిలో లేదు. ప్రభుత్వం నుంచి ఆదేశాలు రావడంతో టిటిడి నిబంధనలను పక్కనపెట్టి రూ.4.76 కోట్ల కేటాయించింది. టిటిడిపై ప్రభుత్వం జోక్యం ఎక్కువవుతోందని వస్తున్న ఆరోపణలకు ఇలాంటివన్నీ సాక్ష్యంగా నిలుస్తున్నాయి. ఇవి కోర్టు దాకా వెళితే టిటిడి సమాధానం చెప్పుకోవాల్సివస్తుంది. ఇప్పటికైనా ఈ నిర్ణయాన్ని టిటిడి ఉన్నతాధికారులు పున:సమీక్షించుకోవాలి.

ప్రభుత్వం విడుదల చేసిన జీవో

ఈ వెబ్‌సైట్‌లోని పాత క‌థ‌నాల కోసం క్లిక్ చేయండి….
www.dharmachakram.in

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*