జెడి లక్ష్మీనారాయణ దాగుడుమూతలు!

సిబిఐ జాయింట్‌ డైరెక్టర్‌గా పనిచేసి, ఇంకా పదవీకాలం ఉండగానే స్వచ్ఛంద ఉద్యోగ విరమణ చేసిన లక్ష్మీనారాయణ తెలుగు రాష్ట్రాల ప్రజలకు సూపరిచితులే. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి కేసులను విచారించింది ఆయనే. ఆ సమయంలో ఆయన రోజూ వార్తలకెక్కారు. అవినీతికి సింహ స్వప్నం అంటూ కొందరు ఆయన్ను హీరోను చేశారు. కాంగ్రెస్‌ చేతుల్లో కీలుబొమ్మగా మారి జగన్‌పై అక్రమ కేసులు బనాయించారని వైసిపి ఆరోపించింది. ఆయన్ను నిబద్ధత కలిగిన అధికారి అని విశ్వసించే వారు లక్ష్మీనారాయణకు అభిమానులుగానూ మారారు.

ఇదిలావుండగా….సమాజానికి తనవంతు సేవలు అందించడం కోసం ఉద్యోగం విడిచిపెట్టినట్ల చెప్పిన ఆయన…రాష్ట్రమంతా తిరుగుతున్నారు. అన్నివర్గాల ప్రజల స్థితిగతులను అధ్యయనం చేస్తున్నారు. ఆయన ప్రత్యేక విధానాలను ప్రకటిస్తున్నారు. స్మార్ట్‌ సిటీలు కాదు కావాల్సింది…స్మార్ట్‌ విలేజెస్‌ గురించి మనం ఆలోచించాలి అంటున్నారు. ప్రతి గ్రామానికి, పట్టణానికి, ప్రాంతానికి అభివృద్ధి ప్రణాళికను ఆ ప్రాంత ప్రజలే రూపొందించుకోవాలని చెబుతున్నారు.

ఈ ప్రణాళికను స్టాంప్‌ పేపర్‌పైన రాసి. ఎన్నికల్లో ఓట్ల కోసం వచ్చేవారితో సంతకం పెట్టించుకోవాలని సూచిస్తున్నారు. పీపుల్స్‌ మ్యానిఫెస్టో అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇందుకోసం ఒక వెబ్‌సైట్‌ పెట్టి, ఏ ప్రాంత ప్రజలైనా తమ సమస్య ఏమిటో తెలియజేయడానికి వీలుగా ఏర్పాట్లు చేశారు. మరో కీలకమైన అంశం కూడా ఆయన ప్రస్తావిస్తన్నారు. ధనమయంగా మారిన రాజకీయాలను మార్చడానికి ‘జోరో బడ్జెట్‌ పాలిటిక్స్‌’ అవసరమని చెబుతున్నారు. అంటే ఎన్నికలకు పైసా ఖర్చు చేయాల్సిన అవసరం ఉండకూడదని అంటున్నారు.

తాను ప్రతిపాదిస్తున్న పీపుల్స్‌ మ్యానిఫెస్టో అమలు చేయాలంటే స్వచ్ఛంద సంస్థల వంటి సంస్థలతో సాధ్యం కాదని, అందుకే రాజకీయాల్లోకి రావాలని చాలా మంది తనను కోరుతున్నట్లు చెప్పారు. రాజకీయాల్లోకి రావాలని తాను కూడా నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు. అయితే…సొంతంగా పార్టీ పెడతారా? లేక ఇప్పటికే ఉన్న పార్టీల్లో చేరుతారా? అనేదానిపైన ఆయన స్పష్టత ఇవ్వడం లేదు. నా విధానాలను నేను ప్రకటించాను. ఇవి నచ్చిన పార్టీలు ఏవైనా ముందుకు వస్తే…అప్పుడు ఏమి చేయాలో ఆలోచిస్తానని చెబుతున్నారు. భావసారూపత్యత కలిగిన వారితో ఎలా కలిసి పని చేయాలో కూడా తరువాత ఆలోచిస్తానని చెప్పారు.

ఆయన చెప్పే విషయాలన్నీ బాగున్నా….తన ఆలోచనలకు దగ్గరగా ఉన్న పార్టీ ఏదైనా రాష్ట్రంలో ఉందా…అని ప్రశ్నిస్తే మాత్రం జవాబు దాటవేస్తున్నారు. ఇంత విస్తృతమైన ఆలోచన చేస్తున్న ఆయనకు…రాష్ట్రంలో తన విధానాలతో సారూప్యం ఉన్న పార్టీలు ఉన్నాయా లేవా అనే విషయాన్ని ఆయనే స్వయంగా తేల్చుకోలేరా…అనేది ప్రశ్న. వచ్చే ఎన్నికల్లోపే తన నిర్ణయం ప్రకటిస్తానని చెబుతున్నారు. ఇంతకీ కొత్త పార్టీ పెడతారా? భావసారూప్యత పేరుతో ఏదో ఒక పార్టీలో చేరుతారా? అనేది వేచి చూడాలి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*