జెసి దివాకర్ రెడ్డి టిడిపిలో ఉంటారా…గుడ్ బై చెప్పేస్తారా..!

జేసి దివాకర్ రెడ్డి తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో ఉంటారు. ఆయన వ్యాఖ్యలు ఒక్కోసారి సొంతపార్టీకే తలనొప్పిగా మారుతుంటాయి. ఆయన ప్రభుత్వాన్ని పొగుడుతున్నారో తెలియదు…తిడతావున్నారో తెలియదు.‌

ప్రస్తుత ఎంఎల్ఏల్లో 40 శాతం మందిని అంటే 70 మందిని మార్చనిదే వచ్చే ఎన్నికల్లో టిడిపి గట్టెక్కబోదని అన్నారు. అంతేకాదు చంద్రబాబు అధికారాలన్నీ ఎంఎల్ఏలకే ఇచ్చారని, ఎంపిలకూ ఏమీ లేదని చెప్పారు. ఎన్నికల్లో 40 శాతం మందికి టికెట్లు ఇవ్వకూడదన్న ఆయన వ్యాఖ్యలు కచ్చితంగా చంద్రబాబుకు తొలనొప్పి తెచ్చేవే. దీనివల్ల ఎవరికి టికెట్టు వస్తుంది ఎవరికి రాదు…అనే చర్చ, రచ్చ ఇప్పటి నుంచే మొదలవుతుంది.

గతంలోనూ జేసి పలు సార్లు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. జన్మభూమి కమిటీల వల్ల సర్వం సాశనమవుతోందని సిఎం ముఖం మీదే‌ అనేశారు. అదేవిధంగా ఎంఆరోఓలతో కూడా ముఖ్యమంత్రే నేరుగా మాట్లటడితే తమకు ఏం విలువ వుంటుందంటూ చరకలు వేశారు. ఇక స్థానికంగా ప్రభోదానంద స్వామితో‌‌ గొడవలు తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన్ను వదిలించుకోవాలని చంద్రబాబు నిర్ణయానికి వచ్చారట. దీనిపై సోషల్ మీడియాలో కనిపించిన కథనం యథాతథంగా ఇస్తున్నాం. చదవండి….

స్వపక్ష నేతలపైనే విమర్శలు చేస్తూ తలనొప్పిగా తయారైన దివాకర్ రెడ్డిని ఎలాగైనా వదిలించుకోవాలని చంద్రబాబు వ్యూహరచన చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో దివాకర్ రెడ్డి తనయుణ్ని పార్టీ తరఫున బరిలో నిలిపేందుకు కొన్ని షరతులు విధించినట్లు సమాచారం. ఆ షరతులతో ఖంగుతిన్న జేసీ.. తనను సీఎం అవమానిస్తున్న తీరుపై మండిపడు తున్నట్లు ప్రస్తుతం ప్రచారం జరుగుతోంది.

అనంతపురం జిల్లాలో జేసీ బ్రదర్స్కు గట్టి పట్టుంది. తాడిపత్రి నియోజకవర్గంతోపాటు చుట్టుపక్కల కొన్ని అసెంబ్లీ స్థానాల్లో వారు మాట తప్పక చెల్లుబాటవుతుంది. అందుకే ఆ ఇద్దరు సోదరులు కాంగ్రెస్ను వీడి టీడీపీలో చేరినప్పుడు చంద్రబాబు చంకలు గుద్దుకున్నాడు. జిల్లాలో తన పార్టీ బలం మరింత పెరిగిందని మురిసిపోయాడు.

కానీ – కాలం గడిచే కొద్దీ జేసీ బ్రదర్స్ తీరు చంద్రబాబుకు ఇబ్బందిగా మారింది. స్వపక్ష నేతలను విమర్శిస్తూ.. అధిష్ఠానాన్ని లెక్క చేయకుండా అంతా తామేనన్నట్లు ఉన్న వారి శైలి బాబుకు తలనొప్పిగా తయారైంది. ముఖ్యంగా జేసీ దివాకర్ రెడ్డి తీరు ఆయనకు మింగుడుపడటం లేదు. అనంతపురం – గుంతకల్ – శింగనమల ఎమ్మెల్యేలతో విరోధం పెంచుకున్న దివాకర్ రెడ్డి.. చంద్రబాబుతో ఎప్పుడు భేటీ అయినా వారిపై ఫిర్యాదులు చేసేవాడు. తానొక్కడినే మంచి వాడినని చెప్పుకునేవాడు.

ఇక ఈ దఫా ఎన్నికల్లో తన వారసుడిగా కుమారుణ్ని ఎంపీగా పోటీ చేయించాలని దివాకర్ రెడ్డి భావిస్తున్నారు. అందుకు తగ్గట్లు వ్యూహాలు రచిస్తున్నారు. అందులో భాగంగానే ఇటీవల చంద్రబాబును కలిసి తన మనసులోని కోరికను బయటపెట్టాడు. అనంతపురం పార్లమెంటు స్థానం పరిధిలోని అసెంబ్లీ సీట్లలో తాను చెప్పిన వ్యక్తులకే టికెట్ ఇవ్వాలని పట్టుబట్టాడు.

దీంతో ఇన్నళ్లూ ఓపికపట్టిన చంద్రబాబులో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. జేసీని వదిలించుకునేందుకు ఇదే సరైన తరుణమని భావించిన ఆయన.. పరుష పదజాలంతో మాట్లాడాడు. బాగా క్లాస్ పీకాడు. నీ కొడుకు గెలుస్తాడా? అసలు నీ కొడుకుకు టికెట్ ఇస్తామని ఎవరు చెప్పారు? అని అసహనంగా ప్రశ్నించారు. అతడికి టికెట్ ఇవ్వాలంటే కొన్ని షరతులకు అంగీకరించాల్సిందేనని తేల్చిచెప్పాడు. వచ్చే ఎన్నికల్లో నీ కొడుకుకు ఎంపీ టికెట్ ఇవ్వాలంటే.. ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో ముగ్గురి చేత సంతకాలు పెట్టించుకురమ్మని ఆదేశించాడని కూడా సమాచారం.

జేసీకి అనంతపురం ఎమ్మెల్యేల్లో చాలామందితో గొడవలున్నాయి. ఈ పరిస్థితుల్లో ఆయన సంతకం కోరితే పెట్టడానికి ముందుకొచ్చేవారు ఎవరూ లేరనే చెప్పుకోవచ్చు. ఆ విషయం తెలుసు కాబట్టే చంద్రబాబు జేసీని వదిలించుకోవడానికి అలాంటి ఇబ్బందికర షరతు విధించాడని విశ్లేషకులు చెప్పుకుంటున్నారు. షరతులను అవమానంగా భావించి జేసీ బ్రదర్స్ త్వరలోనే టీడీపీని వీడటం ఖాయమని కూడా వారు విశ్లేషిస్తున్నారు.

ఇదీ ఆ కథనం. తాజాగా జెసి చేస్తున్న వ్యాఖ్యలు, పరిణామాలు సరిపోలు తున్నాయి. మరి జెసి టిడిపిలో ఉంటారా…గుడ్ బై చెప్పి వేరే దారి చూసుకుంటారా…అనేది చూడాలి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*