జ‌నం కోసం 108లాగా ప‌ని చేస్తా…అదే నా బ‌లం – కోలా ఆనంద్‌

ఎప్పుడూ ప్రజలను అంటిపెట్టుకుని ఉండేవాడే నిజమైన నాయకుడు అవుతాడు. ప్రజలకూ దూరంగా, తనను కలవడమే గగనంగా ఉంటే అలాంటి వారు ఎప్పటికీ ప్రజా నాయకులు కాలేరు. అందుబాటులో ఉండటమేకాదు….తన వద్దకు వచ్చే చెప్పే కష్టాలను ఓపిగ్గా వినాలి. అవకాశంవుంటే సాయం చేయాలి. అలాంటి అవకాశం లేనపుడు కనీసం నైతిక బలమైన ఇవ్వగలగాలి. తాను ఏ పార్టీలో ఉన్నా ఎప్పుడూ ప్రజలను అంటిపెట్టుకుని ఉండే నాయకుడిగా శ్రీకాళహస్తికి చెందిన కోలా ఆనంద్‌ గుర్తింపు పొందారు. జనంతో ఉండటమే ఆయన బలం. ఆ బలమే ఆయనకు ఏపార్టీలోనైనా గుర్తింపును, ప్రాధాన్యతను తెచ్చిపెడుతోంది.

ఒకప్పుడు కోలా ఆనంద్‌ కాంగ్రెస్‌లో ఉరడేవారు. అలనాటి కాంగ్రెస్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డితో కోలాకు ఎంత సన్నిహిత సంబంధాలుండేవో అందరికీ తెలిసిందే. కోలా వివాహానికి స్వయంగా వైఎస్‌ హాజరయ్యారు. చిన్న వయసులోనే శ్రీకాళహస్తి ఆలయ ట్రస్టుబోర్డు పదవి కట్టబెట్టారు. ఇంకా కెవిపి రామచంద్రరావు వంటి ప్రముఖులు కూడా కోలాను ఆత్మీయంగా పలకరించేవాళ్లు. కర్నాటక మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య వంటివారు కూడా కోలాను చూడగానే ఇట్టే గుర్తుపట్టి పలకరిస్తారు. వైఎస్‌ మరణం, రాష్ట్ర విభజన తరువాత కాంగ్రెస్‌ను విడిచిపెట్టారు. 2014 ఎన్నికల తరువాత బిజెపిలో చేరారు. ఆయన ఆ పార్టీలో చేరి ఇప్పటికా సరిగ్గా నాలుగేళ్లు పూర్తికాలేదు. అయినా…ఆ పార్టీ జాతీయ అధ్యక్షులు అమిత్‌షాకు ఆప్తుడిగా మారగలిగారు. అనేక పర్యాయాలు ప్రధానికి కలిశారు. దశాబ్దాలుగా బిజెపిలో ఉంటున్న నాయకులూ ఇప్పటికీ అమిత్‌షాను కలవలేరు. ప్రధాని దగ్గరికి అసలే వెళ్లలేరు. అలాంటిది ఆ పార్టీలో నాలుగేళ్ల వయసులేని కోలా ఆనంద్‌కు ఇదంతా ఎలా సాధ్యమైందనేది ప్రశ్న. కోలాను చూస్తే చాలా మంది బిజెపి నాయకులకు ఈర్ష్య, అసూయ.

‘మీరు ఏ పార్టీలో ఉన్నా…పెద్దపెద్ద నాయకులకు అంత దగ్గరవుతారు…మీకు ఎలా సాధ్యమవుతోంది….ఆ కిటుకేదో చెబితే మిగతా వాళ్లూ నేర్చుకుంటారు కదా…’ అని ఓ టివి ఛానల్‌ ఇంటర్వ్యూలో కోలా ఆనంద్‌ను అడిగారు. దానికి ఆయన చెప్పిన సమాధానం ఒక్కటే…’నేను ప్రజలతో ఉంటాను. నాకు ప్రజల మద్దతు ఉంది. అందుకే అందరూ నన్ను గుర్తిస్తారు. నేను మీడియాలో మాత్రమే కనిపించే నాయకుడిని కాదు. నిరంతరం ప్రజలతోఉండే నాయకుడిని. ఏ పని ఉండి నా ఇంటికి వచ్చినా చేసిపెడతాను. నన్ను నమ్ముకున్నవారికి, నేను ఒక రకంగా 108లా సేవలందిస్తాను. ఆ ప్రేమతోనే జనం నాతో ఉంటారు’ అని తన బలం ఏమిటో బహిరంగంగానే చెప్పారు. తనకు అనుచర గణం ప్రపంచ వ్యాపితంగా ఉన్నారని చెప్పుకోగలిగిన నాయకుడు ఆనంద్‌.

కోలా ఆనంద్‌ తన బలంగా చెప్పుకున్న జనం వాస్తవంగా కూడా ఆయన వెంట ఉన్నారు. నియోజకవర్గంలో వేలాది మందిని సమీకరించగల శక్తి ఆయనకు ఉంది. ఆయన బిజెపిలో చేరేనాటికి నియోజకవర్గంలో ఆ పార్టీ బలం సున్నానే. 2014లో పార్టీలో చేరిన సమయంలో దాదాపు 20 వేల మందితో సభ పెట్టారు. 60 వేల సభ్యత్వం చేర్పించగలిగారు. అన్ని బూత్‌లకు కమిటీలు వేశారు. తిరుపతి, విజయవాడ, కాకినాడలో జరిగిన సభలకు…జిల్లాలో మరే నియోజకవర్గం నుంచి వెళ్లనంత పెద్ద సంఖ్యలో జనాన్ని తరలించారు. జిల్లాలో ఇంతగా జన సమీకరణ చేయగల బిజెపి నాయకులు ఇంకొకరు లేరంటే అతిశయోక్తికాదు. దీంతో సహజంగానే బిజెపి అగ్రనాయత్వం దృష్టిలోపడ్డారు. తాజాగా అలిపిరిలో జరిగిన గొడవతో ఏకంగా జీతీయ అధ్యక్షుడు అమిత్‌షాకు మరింత దగ్గరయ్యారు. అమిత్‌షా తిరుమలకు వచ్చినపుడు ఆయనకు అతి దగ్గరగా ఉన్న ముగ్గురు నలుగురు స్థానిక నాయకుల్లో కోలా ఆనంద్‌ ఒకరు. ఆలయంలోకి కూడా ఆయనతో పాటు వెళ్లగలిగారు. టిటిడి ట్రస్టు బోర్డు సభ్యునిగా కోలా పేరు ఖరారయింది. ఇంతలో టిడిపి-బిజెపి సంబంధాలు తెగిపోవడంతో ఆ అవకాశం చేజారిపోయింది.

తనకున్న ప్రజాబలాన్ని నమ్ముకునే వచ్చే ఎన్నికల్లో శ్రీకాళహస్తిలో బిజెపి తరపున పోటీ చేయాలన్న ఆలోచనతో కోలా ఆనంద్‌ ఉన్నారు. రాష్టంలో సొంత బలం పెంచుకోవాలన్న పట్టుదలతో ఉన్న బిజెపి అందుకు అవసరమైన కసరత్తు చేస్తోంది. ఆయా ప్రాంతాల్లో బలం ఉన్న నాయకులను గుర్తించి పార్టీలో చేర్చుకుని, వారి ద్వారా పార్టీని బలోపేతం చేసుకోవాలని యోచిస్తోంది. రాష్ట్రంలో బిజెపికి చెప్పుకోదగ్గ బలమున్న చాలా తక్కువ నియోజకవర్గాల్లో శ్రీకాళహస్తి కూడా ఒకటిగా చేరిందంటే అది కోలా ఆనంద్‌ వల్లే. పార్టీలతో నిమిత్తం లేకుండా ఆయన ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ వెంట నడిచే అనుచర గణం ఆయనకున్నారు. రాష్ట్రంలో బిజెపికి ఎంత వ్యతిరేకత ఉన్నా….వచ్చే ఎన్నికల్లో తాను ఆ పార్టీ తరపున పోటీచేసి గెలవగలనన్న నమ్మకం ఉందంటే…అది కోలాకు ఉన్న వ్యక్తిగత జనబలమే. గత ఎన్నికల్లో బిజెపి బలపరచిన టిడిపి అభ్యర్థి బొజ్జల గోపాలక్రిష్ణారెడ్డి గెలుపునకు కృషి చేశానని, ఈసారి బిజెపి అభ్యర్థిగా బరిలో ఉంటానని కోలా ఆనంద్‌ చెబుతున్నారు. ఆ పార్టీకి రాష్ట్రంలో ఉన్న అననుకూలత గురించి ఆలోచించడం లేదు.

ఈ వెబ్‌సైట్‌లోని పాత క‌థ‌నాల కోసం క్లిక్ చేయండి….
www.dharmachakram.in

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*